Mohammad Abu Salmiya: మహ్మద్‌ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్‌

హమాస్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో బందీగా తీసుకెళ్లిన అల్‌-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్‌ అబు సల్మియాను ఇజ్రాయెల్‌ తాజాగా విడుదల చేసింది.

Published : 01 Jul 2024 19:25 IST

జెరూసలెం: పాలస్తీనా (Palestine) విషయంలో ఇజ్రాయెల్‌పై (Israel) అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశం కాస్త వెనక్కు తగ్గింది. గతంలో బందీలుగా తీసుకెళ్లిన వారిలో 50 మందికిపైగా ఖైదీలను విడుదల చేసింది. అందులో గాజాలోనే అతిపెద్దదైన అల్‌-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్‌ అబు సల్మియా (Mohammad Abu Salmiya) కూడా ఉన్నారు. ఏడు నెలల క్రితం ఆయన ఇజ్రాయెల్‌ సైన్యానికి చిక్కారు. సల్మియాతోపాటు విడుదలైన ఖైదీలను ఇజ్రాయెల్‌కు తూర్పు సరిహద్దులోని ఖాన్‌ యూనిస్ మార్గం ద్వారా గాజాలోకి పంపారు. ఈ మేరకు గాజాలోని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇజ్రాయెల్ నుంచి విడుదలైన వారిని ఖాన్‌-యూనిస్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరింత మంది ఖైదీలను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఖైదీల విడుదలకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఇటామర్‌ బెన్‌ కూడా ధ్రువీకరించారు. సల్మియాతోపాటు పదుల సంఖ్యలో ఉగ్రవాదులను విడుదల చేయడం దేశ భద్రతను పణంగా పెట్టడమేనని ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు.

గాజా స్ట్రిప్‌లోని వివిధ ఆస్పత్రులను హమాస్‌ ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారని ఎప్పట్నుంచో ఇజ్రాయెల్‌ ఆరోపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అల్‌-షిఫా ఆస్పత్రికి డైరెక్టర్‌గా ఉన్న మహ్మద్‌ అబు సల్మియాను నిర్బంధించి తీసుకెళ్లింది. అయితే, హమాస్‌ మాత్రం ఇజ్రాయెల్‌ ఆరోపణలను ఖండించింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో అల్‌-షిఫా ఆస్పత్రి వార్తల్లో నిలిచింది. పసిబిడ్డలు సహా 179 మంది మృతులను ఇక్కడి ప్రాంగణంలోనే సామూహికంగా ఖననం చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ మహ్మద్‌ అబు సల్మియా అప్పట్లో మీడియాకు వెల్లడించారు. అనంతరం అతడిని ఇజ్రాయెల్‌ సైన్యం కస్టడీలోకి తీసుకుంది. తాజాగా విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని