Israel Hezbollah: మరో యుద్ధ భయం?

పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా.. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయా? ఈ రెండింటి మధ్య నానాటికీ విస్తరిస్తున్న సాయుధ ఘర్షణలు మరో యుద్ధం తప్పదన్న విస్పష్ట సంకేతాల్ని వెలువరిస్తున్నాయి.

Updated : 30 Jun 2024 06:53 IST

కాలుదువ్వుతున్న ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా
అదే జరిగితే మరింత విధ్వంసం
గాజాలో కాల్పుల విరమణకు లంకె పెడుతున్న హెజ్‌బొల్లా

శ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా.. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయా? ఈ రెండింటి మధ్య నానాటికీ విస్తరిస్తున్న సాయుధ ఘర్షణలు మరో యుద్ధం తప్పదన్న విస్పష్ట సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. ఇప్పటికే హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య పోరాటంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. ఇంకో యుద్ధం మొదలైతే మరింత మానవ హననం తప్పదన్న తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌తో సై అంటే సై అంటున్న హెజ్‌బొల్లా.. ఇటీవల ఇజ్రాయెల్‌లోని కీలక సైనిక, నౌకా స్థావరాలను డ్రోన్ల ద్వారా చిత్రీకరించి, 9 నిమిషాల వీడియో విడుదల చేసింది. ఈ పరిణామం ఇజ్రాయెల్‌కు పుండుమీద కారం చల్లినట్లయింది. దానికి తోడు హెజ్‌బొల్లా వరుస క్షిపణి, డ్రోన్ల దాడులతో ఇజ్రాయెల్‌లోని ఉత్తర ప్రాంత ప్రజలు చాలాకాలంగా తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ భద్రతకు ముప్పు తప్పదని భావిస్తున్న ఇజ్రాయెల్‌- ఇక హెజ్‌బొల్లాతో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని ప్రకటించింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అది ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చునని పాశ్చాత్య వ్యూహకర్తలు అంచనావేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో 400 మంది దాకా మరణించారు. 

హెజ్‌బొల్లా చీఫ్‌ హెచ్చరిక

డ్రోన్ల వీడియోను చూపిస్తూ.. పరిమితులు లేని, నిబంధనలు, సీలింగ్‌ లేని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హెచ్చరించారు. ఒకవేళ ఇజ్రాయెల్‌ ఘర్షణను విస్తరించాలని చూస్తే తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే ఐరోపా కూటమిలోని దేశమైన సైప్రస్‌పైనా దాడి చేస్తామని నస్రల్లా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.


అడ్డుకోవాల్సింది అమెరికానే..

ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మధ్యలోకి ఇరాన్‌ ప్రవేశించకుండా చూడాలని వారు సూచిస్తున్నారు. బైడెన్‌ సీనియర్‌ సలహాదారు అమోస్‌ హాక్‌స్టీన్‌ ఇటీవల బీరుట్‌ను సందర్శించారు. 2022లో ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య తీర ప్రాంత సరిహద్దులపై సంధి కుదర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తాజా పర్యటనలో ఆయన గాజాలో కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్, లెబనాన్‌ మధ్య రాజీ కుదర్చాలని ప్రయత్నించారు. దీనిని హెజ్‌బొల్లా తిరస్కరించింది. వేల మంది మరణానికి కారణమవుతున్న గాజా యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ కచ్చితంగా ఆపాల్సిందేనని స్పష్టం చేసింది. హమాస్‌కు సాయం చేయడాన్ని ఆపాలన్న అమెరికా సూచననూ అంగీకరించలేదు. 


ఉత్తర సరిహద్దులో పరిస్థితి బాగాలేదు

ఇజ్రాయెల్, లెబనాన్‌ ఉత్తర సరిహద్దులో పరిస్థితి అంత బాగాలేదని హాక్‌స్టీన్‌ అంచనా వేశారు. నస్రల్లా తన ప్రసంగంలో కోరినట్లు సరిహద్దుల్లోని బఫర్‌ జోన్‌లో యథాతథస్థితిని కొనసాగించేందుకు ఇజ్రాయెల్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అది ఇజ్రాయెల్‌ భూభాగంలో ఉండటంతో రాజీ అసలే సాధ్యం కాదనేది అంచనా. అదే సమయంలో లెబనాన్‌ సురక్షిత ప్రాంతం కాదంటూ ఇజ్రాయెల్‌ అధికారులు చేస్తున్న హెచ్చరికలు మరింత ఇబ్బందికరంగా మారాయి.


ఒక్క అడుగు దూరంలో ఇజ్రాయెల్‌

సరిహద్దుల్లోని హెజ్‌బొల్లా దళాలను వెనక్కి తరిమికొట్టాలని భావిస్తున్న ఇజ్రాయెల్‌ అందుకనుగుణంగా సిద్ధమైంది. దక్షిణ లెబనాన్‌పై దాడి చేసేలా ఆదేశాలివ్వడానికి ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల లోపలకు వెళ్లేలా హెజ్‌బొల్లా దళాలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, ఫ్రాన్స్‌లు దాడి చేయకుండా నెతన్యాహును ఆపుతున్నాయి. 2006లో ఒప్పందాన్ని గౌరవించాలని ఆ రెండు దేశాలు సూచిస్తున్నాయి.


ఇజ్రాయెల్‌కు ఇబ్బందే

యుద్ధం ప్రారంభమైతే భారీ నష్టం తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇజ్రాయెల్‌ను పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య యుద్ధం ప్రారంభమైతే పశ్చిమాసియాలో పూర్తి స్థాయి ఘర్షణగా మారవచ్చు. ఇప్పటికే గాజాపై యుద్ధంతో సైనికపరంగా, దౌత్యపరంగా, న్యాయపరంగా ఇజ్రాయెల్‌ నష్టపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కూడా ఆ దేశానికి వ్యతిరేకంగా మారింది. పైగా గాజాపై దాడి ద్వారా హమాస్‌ను పూర్తిగా అంతమొందించాలన్న లక్ష్యం నెరవేరలేదు. న్యాయపరంగా ఇజ్రాయెల్‌ మానవ హనన నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో లెబనాన్‌పై దాడులకు దిగితే అంతర్జాతీయ సమాజం మద్దతును మరింతగా కోల్పోయే అవకాశముంది. 


బలపడిన హెజ్‌బొల్లా

2006లో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణతో పోలిస్తే ప్రస్తుతం హెజ్‌బొల్లా మరింత బలపడింది. టెల్‌ అవీవ్‌సహా ఇజ్రాయెల్‌లోని అన్ని నగరాలపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించగలిగే స్థితిలో ఉంది. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించగల స్థాయిలో దాదాపు లక్ష రాకెట్లు, ఆత్మాహుతి డ్రోన్లు హెజ్‌బొల్లావద్ద ఉన్నాయని అమెరికా భావిస్తోంది. ఒక దేశం స్థాయిలో హెజ్‌బొల్లా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంది. వాళ్ల దగ్గర ఫతేహ్‌-110, జెల్‌జాల్‌-2 లాంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలున్నాయి. 


ఇరాన్‌ కోణం

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ యుద్ధం అంశంలో అత్యంత కీలకమైంది ఇరాన్‌. హమాస్‌తో పోలిస్తే హెజ్‌బొల్లాకు ఇరాన్‌ అధిక ప్రాధాన్యమిస్తుంది. ప్రాంతీయ వ్యూహంలో భాగంగా ఇరాన్‌ ఇలా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైతే ఇరాన్‌ రంగంలోకి దిగడం ఖాయం. హెజ్‌బొల్లాకు మరింత ఆయుధ, ఆర్థిక సాయం అందుతుంది. అప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది.


దాడులను ఆపాలని హెజ్‌బొల్లాకు హెచ్చరిక

ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైతే నెలలపాటు కొనసాగే అవకాశముందని ఆందోళన చెందుతున్న అమెరికా, ఐరోపా, అరబ్‌ మధ్యవర్తి దేశాలు శాంతిమంత్రం జపిస్తున్నాయి. దాడులను ఆపాలని హెజ్‌బొల్లాకు హెచ్చరికలు జారీ చేశాయి. యుద్ధం చేయాలని ఇజ్రాయెల్‌ నిర్ణయం తీసుకుంటే అడ్డుకునే శక్తి హెజ్‌బొల్లాకు లేదని స్పష్టం చేశాయి. యుద్ధం కారణంగా రెండు వైపులా ప్రాణ నష్టం భారీగా జరుగుతుందని తేల్చి చెప్పాయి. 

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని