Elon Musk Vs Kamala Harris: ‘నాయకులు ఇంకెప్పుడు తెలుసుకుంటారు..’: గర్భవిచ్ఛిత్తి పోస్ట్‌పై మస్క్‌ వర్సెస్‌ కమలా హ్యారిస్‌!

Elon Musk Vs Kamala Harris: గర్భవిచ్ఛిత్తిపై ట్రంప్‌ నిషేధం విధిస్తారని కమలా హ్యారిస్‌ చేసిన పోస్ట్‌పై ఎక్స్‌ కమ్యూనిటీ నోట్స్‌ ట్యాగ్‌ను జత చేసింది. దీనిపై మస్క్‌ సైతం హ్యారిస్‌ను విమర్శించారు.

Published : 02 Jul 2024 10:01 IST

Elon Musk Vs Kamala Harris | వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి కీలకాంశంగా మారింది. బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. దీనిపై ఇటీవల సోషల్‌ మీడియా సహా ప్రచార కార్యక్రమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk Vs Kamala Harris) విమర్శలు గుప్పించారు.

ట్రంప్‌ దేశవ్యాప్తంగా గర్భవిచ్ఛిత్తిని (Abortion ban) నిషేధిస్తానంటున్నారని కమలా హ్యారిస్‌ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీన్ని బైడెన్ నేతృత్వంలోని బృందం ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతుందని తెలిపారు. తద్వారా మహిళల సంతానోత్పత్తి హక్కును పరిరక్షిస్తామని వివరించారు. అయితే, ఆమె పోస్ట్‌పై మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ ‘కమ్యూనిటీ నోట్‌’ ట్యాగ్‌ను జత చేసింది. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్‌ కావొచ్చని.. నిజనిర్ధరణ చేసుకోవాలని సూచించింది. దీంతో యూజర్లు దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది.

కమలా హ్యారిస్‌ పోస్ట్‌పై మస్క్‌ (Elon Musk Vs Kamala Harris) స్పందించారు. ‘‘ఎక్స్‌లో అబద్ధాలు పోస్ట్‌ చేయడం ఇక ఎంతమాత్రం కుదరదనే విషయాన్ని రాజకీయ నాయకులు లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే వ్యక్తులు ఎప్పుడు తెలుసుకుంటారు’’ అని ప్రశ్నించారు. ఇటీవల బైడెన్‌తో జరిగిన చర్చలో తాను గర్భవిచ్ఛిత్తిని నిషేధించబోనని ట్రంప్‌ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌కు జత చేసిన కమ్యూనిటీ నోట్‌లోనూ మెజారిటీ యూజర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

కమ్యూనిటీ నోట్స్‌ ఫీచర్‌..

యూజర్లకు మెరుగైన సమాచారం అందించడానికి కమ్యూనిటీ నోట్స్‌ ఒక మార్గమని ఎక్స్‌ వివరించింది. తప్పుదారి పట్టించే పోస్ట్‌లను యూజర్ల సహకారంతో సరిదిద్దేందుకు ఒక అవకాశమని పేర్కొంది. ఏదైనా పోస్ట్‌పై అభ్యంతరాలు వ్యక్తమైతే ఎక్స్‌ దానిపై కమ్యూనిటీ నోట్స్‌ ట్యాగ్‌ను జత చేస్తుంది. యూజర్లు దానిపై తమ అభిప్రాయాలు వెల్లడించొచ్చు. మెజారిటీ రేటింగ్‌ ఉన్న యూజర్‌ అభిప్రాయాన్ని అందరికీ కనిపించేలా పిన్‌ చేస్తారు. తద్వారా వాస్తవమేంటో తెలుస్తుంది. తాజాగా ట్రంప్ గర్భవిచ్ఛిత్తిపై పూర్తి నిషేధం విధిస్తానని ఎక్కడా చెప్పలేదని చాలామంది యూజర్లు అభిప్రాయపడ్డారు. కేవలం కొన్ని పరిమితులు ఉండాలని.. పైగా ఈ విషయాన్ని రాష్ట్రాలకు వదిలివేయాలని సూచించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని