Rishi Sunak: ‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్‌ పిలుపు

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాన మంత్రి రిషి సునాక్‌.. పశ్చాత్తప పడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు.

Published : 03 Jul 2024 00:04 IST

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. జులై 4న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేసిన ప్రధాన మంత్రి రిషి సునాక్‌.. పశ్చాత్తపపడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని మెజార్టీ సర్వేలు చెబుతున్న వేళ రిషి సునాక్‌ ఈ విధంగా పిలుపునిచ్చారు.

‘‘సర్వేలు చెప్పిన విషయాన్ని విశ్వసించి, ఒకవేళ లేబర్‌ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని భావిస్తే.. దేశం మొత్తం పన్నుల భారం మోయక తప్పదు. నేను ఇదే పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నా. తద్వారా ప్రజల పన్నులు, వారి పెన్షన్లలతో పాటు సరిహద్దులను రక్షిస్తా. గురువారం మీరు తీసుకునే నిర్ణయం మళ్లీ వెనక్కి రాదు. పశ్చాత్తాప పడే పని చేయకండి’’ అని రిషి సునాక్‌ పేర్కొన్నారు. లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిఒక్కరిపై పన్నుల భారం మోపుతుందన్న ఆయన.. అందుకు అడ్డుకట్ట వేసేందుకు ఓటర్ల వద్ద కొన్ని గంటల సమయం ఉందన్నారు.

మరోవైపు తాజా సర్వేలతో ఉత్సాహంగా కనిపిస్తోన్న లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌.. ప్రతి ఓటు తమకు ముఖ్యమేనన్నారు. ‘‘ఒకవేళ అధికారం చేపడితే.. తమ ప్రభుత్వానికి అన్నీ సవాళ్లే ఉంటాయి. ఇప్పటికే వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ, సంపద సృష్టి ఎంతో ముఖ్యమైన అంశాలు. వీటిలో 14ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎందులోనూ పురోగతి లేదు. ఇది మారాలంటే ఎన్నికల్లో తీర్పు భిన్నంగా ఉండాల్సిందే’’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇలా  విజయంపై అధికార, విపక్షాలు విశ్వాసం వ్యక్తం చేసుకుంటున్న వేళ జులై 4 బ్రిటిష్‌ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని