MEA: ‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్‌

‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది.

Published : 29 Jun 2024 00:13 IST

దిల్లీ: భారత్‌లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ అమెరికా (USA) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. అయితే.. దీన్ని తిరస్కరిస్తున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది. ఆ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడిందని, ఓటు బ్యాంకు కోణంలో దీన్ని రూపొందించినట్లు కనిపిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

‘‘గతంలో మాదిరే ఈ నివేదిక పక్షపాతంతో కూడి ఉంది. ఇందులో భారత సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కొరవడింది. ఓటు బ్యాంకు లెక్కలు కనిపిస్తున్నాయి. అనేక అసంబద్ధ ఆరోపణలు, తప్పుడు వివరణలు, కొన్ని అంశాలనే ఎంచుకోవడం, పక్షపాత అంశాలపై ఆధారపడటం, ఒకే కోణాన్ని చూపించడం వంటివి పొందుపరిచారు’’ అని పేర్కొన్నారు. ‘‘భారత వ్యతిరేక కథనాన్ని చిత్రీకరించేందుకు కొన్ని ఘటనలనే ఆ నివేదిక ప్రస్తావించింది. చట్టాలు, నిబంధనల చెల్లుబాటునూ ప్రశ్నించింది. భారత న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని తీర్పుల విశ్వసనీయతను కూడా సవాలు చేసేలా కనిపిస్తోంది’’ అని జైశ్వాల్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా బుధవారం ఓ నివేదిక విడుదల చేసింది. ‘భారత్‌లోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడి నిషేధిస్తూ చట్టాలు చేశాయి. ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు భారత్‌ ఆధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు’ అని అందులో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని