China: ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్‌..!

చైనాలో ప్రయోగానికి సిద్ధం చేస్తున్న ఓ రాకెట్‌ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి సమీపంలోని కొండల్లో పడింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.  

Published : 01 Jul 2024 12:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లాంచ్‌ప్యాడ్‌ వద్ద ఉంచిన ఓ రాకెట్‌ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిన ఘటన చైనా (China)లో చోటుచేసుకొంది. బీజింగ్‌ తియాన్‌లాంగ్‌ టెక్నాలజీ అండ్‌ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్‌-3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయింది. ఇది సెంట్రల్‌ చైనాలోని గాంగ్యీ అనే పర్వత ప్రాంతంలో పడింది. అక్కడ  జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ భాగాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే నిర్మాణలోపాలు బయటపడ్డాయని కంపెనీ పేర్కొంది. ఈ రాకెట్‌ పడటం వల్ల అక్కడి అడవిలో భారీ పేలుడు చోటుచేసుకొని పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

తియాన్‌లాంగ్‌-3 రాకెట్‌ను చైనా స్కైడ్రాగన్‌ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది. ఇది రెండంచెల వ్యవస్థగా పని చేస్తుంది. వీటిని పాక్షికంగా పునర్వినియోగించుకోవచ్చు. చైనాలో రాకెట్‌ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. హెనాన్‌ ప్రావిన్స్‌లో ఈ సంస్థ ఉన్నచోట దాదాపు 8 లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు.

జూన్‌ 22న చైనాలోని ఓ గ్రామంపై రాకెట్‌ శిథిలాలు కూలాయి. షీఛాంగ్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి లాంగ్‌మార్చ్‌-2 రాకెట్‌ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. ఈ ఘటన సిచువాన్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకొంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు