China: కమ్యూనిస్టు పార్టీ నుంచి.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులను బహిష్కరించిన చైనా

అవినీతి ఆరోపణలతో మాజీ రక్షణ మంత్రులైన వీ ఫెంగె, లీ షంగ్‌ఫులను అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) నుంచి గురువారం బహిష్కరించారు.

Published : 28 Jun 2024 05:18 IST

బీజింగ్‌: అవినీతి ఆరోపణలతో మాజీ రక్షణ మంత్రులైన వీ ఫెంగె, లీ షంగ్‌ఫులను అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) నుంచి గురువారం బహిష్కరించారు. ఈ పరిణామాన్ని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో తీవ్ర కళంకంగా భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వీ, లీ.. ఇద్దరూ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో వీరిపై తదుపరి విచారణకు  సిద్ధమవుతున్నట్టు వేర్వేరు అధికార ప్రకటనల్లో తెలిపారు. చైనా మంత్రుల పరంగా చూస్తే 2023 అత్యంత హేయమైందిగా నిలిచిపోనుంది. వీ, లీలతోపాటు మాజీ విదేశాంగ శాఖ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌ కూడా గతేడాదే బాహ్య ప్రపంచానికి కనిపించకుండా మాయమయ్యారు. పార్టీ క్రమశిక్షణని, నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు సీపీసీ నుంచి 66 ఏళ్ల లీని పార్టీ బహిష్కరించిందని ప్రభుత్వ ఆధీనంలో నడిచే వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. తర్వాత వీ విషయంలోనూ అలాటి వార్త వచ్చింది. 2018-23 మధ్య వీ రక్షణ మంత్రిగా పనిచేయగా, ఆయన తర్వాత కొద్ది నెలలపాటు లీ ఆ పదవిలో ఉన్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలోని అత్యంత ముఖ్యమైన రాకెట్‌(క్షిపణి) దళానికి నాయకత్వం వహించిన లీని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్వయానా రక్షణ మంత్రిగా ఎంపికచేశారు. ఏడాదిగా వీ, లీ కనిపించకపోవడంతో అవినీతి, క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి వీరిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. రాజకీయ, సంస్థాగతపరమైన అంశాల్లో.. వీ, లీ క్రమశిక్షణ తప్పారని దర్యాప్తులో తేలింది. తమ హోదాని అడ్డం పెట్టుకుని కొందరికి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారని, బదులుగా పెద్ద మొత్తంలో డబ్బు, విలువైన వస్తువుల్ని స్వీకరించారని, తమవారికి లబ్ధి జరిగేలా చూసుకున్నారని దర్యాప్తు సంఘం పేర్కొన్నట్లు జిన్హువా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని