Biden Vs Trump: ట్రంప్‌ దూకుడు.. బైడెన్‌ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ

Biden Vs Trump: చివరి అధ్యక్ష ఎన్నికల తర్వాత బైడెన్‌, ట్రంప్‌ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. ఇద్దరి మధ్య వివిధ అంశాలపై వాడీవేడిగా చర్చ సాగింది. 

Updated : 28 Jun 2024 11:53 IST

వాషింగ్టన్‌: అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చ (Biden Vs Trump Debate) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2020 అధ్యక్ష ఎన్నికల గందరగోళం తర్వాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. అట్లాంటాలోని సీఎన్‌ఎన్‌ ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

చర్చలో బైడెన్‌, ట్రంప్‌ (Biden Vs Trump Debate) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన నేతలు వ్యక్తిగత విమర్శలకూ దిగారు. మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా.. బైడెన్‌ కొన్నిచోట్ల తడబడ్డట్లు కనిపించారు. బైడెన్‌ను ట్రంప్‌ ఫెయిల్యూర్‌గా అభివర్ణించారు. దీనికి ప్రతిగా ట్రంప్‌ను బైడెన్‌ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు. చర్చలో నిర్వహకులు తప్ప మరెవరూ లేకపోవడం గమనార్హం. పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా.. మరొకరి మైక్‌లను కట్‌ చేశారు.

చర్చలో ట్రంప్‌ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సైతం బైడెన్‌ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ, చివరకు హుందాగా, దీటుగా ముగించారని పేర్కొన్నారు. మొత్తం చర్చలో ట్రంప్‌ 23 నిమిషాల ఆరు సెకన్లు మాట్లాడగా.. బైడెన్‌ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు.

వివిధ అంశాలపై ఇరువురి నేతల అభిప్రాయాలు సంక్షిప్తంగా..

ఆర్థిక వ్యవస్థ..

ట్రంప్‌ హయాంలో అనుసరించిన ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పిస్తూ బైడెన్‌ (Joe Biden) చర్చను ప్రారంభించారు. సంపన్నులకు అనుకూల వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు. దీంతో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిందన్నారు. ఉద్యోగ కల్పన పూర్తిగా క్షీణించిందన్నారు. నిరుద్యోగం 15 శాతానికి చేరిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు తనపై ఉంచినట్లు పేర్కొన్నారు.

దీనికి బదులిస్తూ.. బైడెన్‌ హయాంలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని ట్రంప్‌ (Donald Trump) విమర్శించారు. ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోందన్నారు. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు.

మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి!

విదేశాంగ విధానం..

విదేశాంగ విధానంపైకి రాగానే చర్చ వాడీవేడిగా సాగింది. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత ఘోరంగా సాగినట్లు ట్రంప్‌ విమర్శించారు. అమెరికా చరిత్రలోనే అదో దుర్దినంగా నిలిచిపోతుందని బైడెన్‌ (Biden) అమలుచేసిన అఫ్గాన్‌ నుంచి బలగాల నిష్క్రమణ విధానాన్ని దుయ్యబట్టారు. తన హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు బయటకు వచ్చేలా ఏర్పాట్లుచేశామని తెలిపారు.

దీనిపై బైడెన్‌ స్పందిస్తూ.. ట్రంప్‌ (Trump) హయాంలో తాలిబన్లు అఫ్గాన్‌ సామాన్య పౌరులను చంపుతూనే ఉన్నారని తెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా అక్కడ మరణించిన అమెరికా సైనికులను ట్రంప్ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈసందర్భంగా ఇరాక్‌లో పనిచేసి తర్వాత మరణించిన తన కుమారుడు బ్యూను బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా గురించి మాట్లాడుతూ.. పుతిన్‌కు ట్రంప్‌ పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు. పైగా అనేకమంది సైనికుల ప్రాణాలు కోల్పోయినందునే రష్యా ప్రతిదాడి చేస్తోందని సమర్థించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు.

వలస విధానం..

ఇరువురు నేతల మధ్య సాగిన ముఖాముఖి చర్చలో వలస విధానం మరో కీలక అంశంగా నిలిచింది. అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారారాలు చేస్తున్నారన్నాని బైడెన్ తెలిపారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

ట్రంప్‌ మాట్లాడుతూ.. దేశ దక్షిణ సరిహద్దులను భద్రంగా ఉంచడంలో బైడెన్‌ విఫలమయ్యారని తెలిపారు. దీన్ని బైడెన్‌ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తాననన్నారు.

గర్భ విచ్ఛిత్తి..

ఈసారి ఎన్నికల్లో గర్భవిచ్ఛిత్తి అంశం కీలకంగా మారిన విషయం తెలిసిందే. తాజా డిబేట్‌లోనూ ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. గర్భవిచ్ఛిత్తి నిషేధాన్ని బైడెన్‌ తప్పుబట్టారు. దీన్ని అనుమతిస్తూ ఇచ్చిన ‘రో వర్సెస్‌ వేడ్‌’ తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు. గర్భవిచ్ఛిత్తి అనేది ఆ మహిళ, వైద్యులు తేల్చాల్సిన అంశమని.. రాజకీయ నాయకులు కాదని బైడెన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం..

ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్‌ పునరుద్ఘాటించారు. ఘర్షణలకు పూర్తిగా హమాస్‌దే బాధ్యతని విమర్శించారు. యుద్ధం ముగించడానికి వారే ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే దీనికి ఒక ముగింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్‌ సైతం ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, బైడెన్‌ వైఖరిలో మార్పు వచ్చిందని.. ఓ పాలస్తీనావాసిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

వీటితో పాటు కొవిడ్‌-19, సామాజిక భద్రత, మెడికేర్‌, పన్నులు, ట్రంప్‌పై కేసులు, 2020 క్యాపిటల్‌ దాడులు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలు సైతం చర్చకు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని