Biden-Trump: అధ్యక్ష పోరు.. చర్చకు ‘ట్రంప్‌-బైడెన్‌’ సిద్ధం

జోబైడెన్‌-డొనాల్డ్ ట్రంప్(Biden-Trump) మధ్య తొలి చర్చకు రంగం సిద్ధం అవుతోంది. ఈ వారంలో వారిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. 

Published : 24 Jun 2024 18:01 IST

వాషింగ్టన్‌: నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Biden-Trump) వాడీవేడీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్‌ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు. 

ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికల్లో 81 బైడెన్‌, 78 ఏళ్ల ట్రంప్‌ వయసు కూడా ప్రధానాంశంగా ఉంది. ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్దినెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. అలాగే పలు సందర్భాల్లో గందరగోళం కనిపించింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా..? అని అంతా ఎదురుచూస్తున్నారు. మరోపక్క అబార్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడి అతివాద వైఖరిని బైడెన్‌ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులో ఎవరివైపు స్పష్టమైన మొగ్గు చూపించడం లేదు. కానీ ప్రస్తుత చర్చతో వారికొక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని