Joe Biden: బైడెన్‌ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్‌ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!

అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) అధ్యక్ష అభ్యర్థిగా నిలుస్తారా..?అనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris ) భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. 

Updated : 03 Jul 2024 11:16 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గరి నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఆరోగ్యమే హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విమర్శల్లో ఈ విషయమే ఎక్కువగా వినిపిస్తోంది. దీనికితోడు ఇద్దరిమధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో బైడెన్ తడబాటుకు గురికావడం సొంతపక్షం డెమోక్రాటిక్‌ నేతల్లో ఆందోళనకు దారితీసింది. ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకుడు టకర్ కార్లసన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బైడెన్‌కు డిమెన్షియా ఉందని, మీడియా ఆ నిజాన్ని దాచిపెట్టిందని కార్లసన్ ఆరోపించారు. ఆ సమస్య గురించి ఇప్పుడే తెలిసిందన్నట్టుగా నటిస్తోందన్నారు. బెడైన్ మెదడు పనితీరు దెబ్బతిన్నదని, ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చని డెమోక్రాటిక్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు రెండు రోజుల క్రితం కార్లసన్‌ అన్నారు. దాని గురించి తాజాగా ప్రస్తావిస్తూ..‘‘డెమోక్రాట్లు బైడెన్‌ను తొలగించాలి. వారు ఆ పని చేస్తారు. కానీ ఎప్పుడు అనేదే ఇక్కడ ప్రశ్న. వారు తెలివిగా ఆలోచిస్తే.. ఇప్పుడే ఆ పని చేస్తారు. ఆయన స్థానంలో వారు కమలాహారిస్‌(Kamala Harris)ను నియమించొచ్చు’’ అని అన్నారు.

మరోవైపు శృంగార తార స్టార్మీ డేనియల్‌తో వివాదం కేసులో జులై 11న ట్రంప్‌ శిక్ష ఖరారు కానుంది. ఈ పరిణామాలు అధికార, విపక్ష పార్టీలు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయని కార్లసన్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే.. ప్రత్యక్ష చర్చ తర్వాత బైడెన్‌ ఆమోద రేటింగ్ పడిపోయిందని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆయనకంటే ట్రంప్ ఆరు పాయింట్లు ముందున్నారు. అయితే బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ ఉంటే అనే ప్రశ్నకు 47 శాతం మంది ఓటర్లు ట్రంప్‌కు అనుకూలంగా స్పందించగా, 45 శాతం మంది హ్యారిస్‌ వైపు మొగ్గు చూపారు. ఫలితాలను చూస్తుంటే.. బైడెన్ కంటే ఆమెనే వైట్‌హౌస్‌లో తిరిగి కాలుపెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని సర్వే పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని