Biden Trump Debate: అందుకే తడబడ్డాను.. ట్రంప్‌తో సంవాదంపై బైడెన్‌

Biden Trump Debate: ట్రంప్‌తో ఇటీవల జరిగిన సంవాదంలో అధ్యక్షుడు బైడెన్‌ కాస్త తడబడిన విషయం తెలిసిందే. అయితే, దానికి కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు.

Published : 03 Jul 2024 08:20 IST

Biden Trump Debate | వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Biden Trump Debate) మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్‌ పలుమార్లు తడబాటుకు గురయ్యారు. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇది స్వపక్షం డెమోక్రాటిక్‌ పార్టీలోనే ఆందోళనలకు దారి తీసింది. ఆయన్ను పోటీ నుంచి తప్పించాలని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను తడబాటుకు గురైనట్లు స్వయంగా బైడెన్ (Joe Biden) అంగీకరించారు. అందుకుగల కారణాన్ని వెల్లడించారు.

ఇది సాకు కాదు..

తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు వెల్లడించారు. తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని తెలిపారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించొద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బైడెన్, ట్రంప్‌ వాడీవే‘ఢీ’

ఆయనకు సామర్థ్యం ఉంది: వైట్‌హౌస్‌

ట్రంప్‌తో (Donald Trump) సంవాదంలో బైడెన్‌ అంతగా రాణించలేకపోయారని శ్వేతసౌధం సైతం అంగీకరించింది. అంతమాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేసింది. దేశాన్ని మరో నాలుగేళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని ఉద్ఘాటించింది. చర్చ సమయానికి అధ్యక్షుడు జలుబుతో ఇబ్బందిపడుతున్నారని.. గొంతులో కూడా సమస్య ఉందని అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ వివరించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు పలు సందర్భాల్లో అంగీకరించారని గుర్తుచేశారు.

గత మూడున్నరేళ్లుగా బైడెన్‌ (Biden) అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని జీన్-పియర్  తెలిపారు. దానికి చరిత్రే సాక్ష్యమని పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు సేవలందించడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. తప్పేదో.. ఒప్పేదో నిర్ణయించే సామర్థ్యం ఉందన్నారు. నిజాన్ని ఎలా చెప్పాలో తెలుసన్నారు. జీవితాంతం అనేక సవాళ్లు ఎదుర్కొన్న బైడెన్‌కు.. పడిన తర్వాత ఎలా లేవాలో కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. సంవాదంలో ఎలా వాదించామనేది ప్రధానం కాదనీ.. అధ్యక్షుడిగా ఎలా పనిచేస్తామనేదే కీలకమని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్తి సహా పలు అంశాలు గత గురువారం బైడెన్‌, ట్రంప్‌ మధ్య జరిగిన వారి సంవాదంలో ప్రస్తావనకు వచ్చాయి. వాటిపై ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని