Ukraine War: ఉక్రెయిన్‌లోకి అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లు.. కీలక నిర్ణయం దిశగా బైడెన్‌ సర్కారు..!

ఉక్రెయిన్‌ యుద్ధ రంగంలోకి నేరుగా తమ మిలటరీ కాంట్రాక్టర్లను పంపించే అంశాన్ని బైడెన్‌ సర్కారు తీవ్రంగా పరిశీలిస్తోంది.

Published : 26 Jun 2024 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ (Ukraine)కు సాయంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కీవ్‌కు మద్దతుగా అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లను తరలించేందుకు బైడెన్‌ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేలా సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న అప్రకటిత నిషేధాన్ని తొలగించనున్నట్లు సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్‌ పాలసీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకొన్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. రష్యా సైన్యంపై కీవ్‌ ఆధిపత్యం సాధించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది. 

ఈ ప్రతిపాదనకు ఒక్కసారి ఆమోదముద్ర పడితే.. ఈ ఏడాదే అమల్లోకి రావచ్చు. దీంతో పెంటగాన్‌లోని పలు అమెరికా కంపెనీలు ఉక్రెయిన్‌ సైన్యానికి మద్దతుగా అక్కడ పని చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. దెబ్బతిన్న ఉక్రెయిన్‌ ఆయుధ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణను వేగవంతం చేసే అవకాశం ఈ నిర్ణయంతో లభిస్తుంది. 

దాదాపు రెండేళ్లుగా బైడెన్‌ సర్కారు అమెరికా జాతీయులను, సైనికులను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి పంపించేందుకు తటపటాయిస్తోంది. అంతేకాదు.. తమతో అమెరికా మిలటరీ నేరుగా తలపడిందన్న భావన రష్యా వారికి కలగకూడదని ఇన్నాళ్లూ వేచి చూసింది. ముఖ్యంగా విదేశాంగశాఖ కూడా ఈ విషయంలో విముఖంగానే ఉంది. దీంతో ఇన్నాళ్లు అమెరికా ఇచ్చిన ఆయుధ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భాల్లోను వాటిని పోలాండ్‌, రొమానియా, లేదా సమీపంలోని ఇతర నాటో దేశాలకు తరలించాల్సి రావడంతో తీవ్ర జాప్యం చోటుచేసుకొంటోంది.  ఇక అమెరికా దళాలు వీటి రిపేర్లకు ఉక్రెయిన్‌ సేనకు వీడియో కాల్స్‌ లేదా సెక్యూర్‌ ఫోన్ల ద్వారానే సాయం చేస్తున్నాయి. 

ఇటీవల కాలంలో రష్యా దళాలు క్రమంగా ముందుకుసాగడం.. ఉక్రెయిన్‌కు అందాల్సిన నిధులను కాంగ్రెస్‌లో చాలాకాలం నిలిపేయడం వంటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ నిధులతో పనిచేసే కాంట్రాక్టర్లను అక్కడకు పంపి ఆయుధాల మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి ఈ ఏడాది చివర్లో అమెరికా ఎఫ్‌-16 కీవ్‌కు చేరనుండటంతో వాటి నిర్వహణకు కూడా ఈ సిబ్బంది ఉపయోగపడనున్నారు. తమ ఆయుధాలతో రష్యా భూభాగంపై కీవ్‌ దాడులు చేయవచ్చని మే నెలలో బైడెన్‌ సర్కారు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత నెల రోజుల్లోనే మిలటరీ కాంట్రాక్టర్లను పంపే ప్రతిపాదనను పరిశీలించడం గమనార్హం. దీనిపై అమెరికా అధికారులు మాట్లాడుతూ ముందే స్పందించడం తొందరపాటవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని