Putin- Kim: దక్షిణ కొరియా నుంచి దిగుమతి.. ఉత్తర కొరియాకు బహుమతి..!

రెండు ఖరీదైన కార్లను ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin).. కిమ్‌ (Kim Jong Un)కు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఉత్తర కొరియా శత్రుదేశం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన విడిభాగాలను వాడినట్లు తెలుస్తోంది.  

Updated : 28 Jun 2024 19:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin), ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un).. చిరునవ్వులు చిందిస్తూ ఒకే కారులో హుషారుగా షికారు చేసిన సంగతి తెలిసిందే. ఆ కారును కిమ్‌కు పుతిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపేరు ఆరుస్‌ లిమోసిన్‌. పుతిన్‌ కాన్వాయ్‌లో అది కీలకం. దీనిలో ఉయోగించే విడిభాగాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి, దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకోవడం గమనార్హం. కస్టమ్ రికార్డులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని వెల్లడించింది.

ఆరుస్‌ కార్లు, మోటార్‌సైకిళ్ల విడిభాగాల కోసం 2018 నుంచి 2023 మధ్య రష్యా 34 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. కారు బాడీ పార్ట్స్‌, సెన్సార్లు, కంట్రోలర్లు, స్విచ్చ్‌లు, వెల్డింగ్ పరికరాలతో సహా ఇతర భాగాలను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నందుకు 15.5 మిలియన్‌ డాలర్లను కేటాయించింది. మిగిలినవాటిని చైనా, భారత్‌, తుర్కియే, ఇటలీ, ఐరోపా యూనియన్‌ నుంచి తెప్పించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి సైనిక చర్య చేపట్టిన తర్వాత కూడా ఈ దిగుమతులు కొనసాగాయి. అయితే కిమ్‌కు బహమతిగా ఇచ్చిన కారులో ఏ విడిభాగాలను వాడారో స్పష్టత లేదు. ఈ ఆరుస్‌ కార్లు.. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశోధక సంస్థ ఎన్‌ఏఎమ్‌ఐ, కార్ల తయారీ సంస్థ సోలర్స్‌ భాగస్వామ్యంలో తయారవుతున్నాయి.

ఆరుస్‌ కారు రెట్రోస్టైల్‌లో తయారుచేసిన సోవియట్‌ కాలం నాటి జిల్‌ లిమోసిన్‌. మరోవైపు కిమ్‌కు కార్లపై విపరీతమైన వ్యామోహం ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు పుతిన్‌ రెండు ఆరుస్‌ లిమోసిన్ కార్లను బహూకరించిన సంగతి తెలిసిందే. ఒకటి రష్యాలో కిమ్ పర్యటించిన సమయంలో ఇవ్వగా.. తాజాగా పుతిన్‌ ఉత్తరకొరియాలో పర్యటించిన సమయంలో మరొకటి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఉభయ కొరియా దేశాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తతలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజా కథనం ఆసక్తిగా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని