Kenya: మంటల్లో కెన్యా పార్లమెంటు

కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాజధాని నైరోబిలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

Published : 26 Jun 2024 05:52 IST

పన్ను సంస్కరణలను వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు
భద్రతా సిబ్బంది కాల్పుల్లో పలువురి మృతి

నైరోబి: కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాజధాని నైరోబిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో పలువురు నిరసనకారులు మృతి చెందారు.  కనీసంగా అయిదుగురు మృతి చెందారని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. స్థానిక వైద్య సిబ్బంది కథనం ప్రకారం.. పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మంది గాయపడ్డారు. అంతకుముందు పార్లమెంటు భవనం ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు లాఠీఛార్జ్‌తోపాటు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్‌ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం ద్రవ్య బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.  కొత్త ద్రవ్య బిల్లును ఆమోదించవద్దని ప్రజాప్రతినిధులను కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఆందోళనలు ఉద్ధృత రూపం దాల్చడంతో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హై కమిషన్‌ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని