Afghanistan: ‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆంక్షలతో మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. వారి పాలనతో ఎంతోమంది మహిళలు తమ కలలను చంపుకొని వంట గదికి పరిమితమవుతున్నారు. దీంతో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది.

Published : 03 Jul 2024 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)ను చేజిక్కించుకున్న తాలిబన్లు (Taliban).. అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తూ, అడుగడుగునా వారి అభ్యున్నతికి అడ్డంకిగా మారినట్లు చెబుతున్నాయి. బాలికలను చదువు నుంచి దూరం చేసి వంటింటికే పరిమితం చేయడంపై ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా తాలిబన్ల తీరుతో ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు తమ స్వప్నాలను చంపుకొని జీవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

మహిళలకు ఉన్నత విద్య అవసరం లేదంటూ వారిపై ఉక్కుపాదం మోపుతోన్న తాలిబన్లు.. కుట్లు, అల్లికలు ఇతర చిన్న పనులకే పరిమితం కావాలని ఆదేశిస్తున్నారు. ఇలా చేసుకునేందుకు దాదాపు 2 లక్షల మంది మహిళలకు తాలిబన్లు అనుమతి ఇచ్చినట్లు అంచనా. వారిలో ఒకరు ఫ్రోజన్‌ అహ్మద్‌జాయ్‌.

చిన్నప్పటినుంచి డాక్టరు కావాలని ఎన్నో కలలు కన్న అహ్మద్‌జాయ్‌కు తాలిబన్ల రాకతో నిరాశే మిగిలింది. స్థానిక విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన ఆమె ప్రస్తుతం పచ్చళ్ల తయారీకే పరిమితమయ్యారు. వైద్యురాలిగా సేవలందించాలనుకున్న తాను కుటుంబపోషణ కోసం ఈ పని చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా అహ్మద్‌జాయ్‌ వంటి ఎంతోమంది నైపుణ్యం కలిగిన మహిళలు తీవ్ర నిరాశతో ఉన్నట్లు వెల్లడవుతోంది.

తగ్గిన మహిళా శ్రామిక శక్తి..

ఆర్థిక అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కానీ, అఫ్గాన్‌లో మాత్రం వారి భాగస్వామ్యం తగ్గింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2021లో అక్కడి శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 14.8 శాతం ఉండగా.. 2023 నాటికి 4.8%కి తగ్గినట్లు వెల్లడైంది.

ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు

అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారి పాలన మహిళల భవిష్యత్తుకు శాపంగా మారినట్లు చెబుతున్నాయి. దేశంలోని బాలికలు ఆరో తరగతికి మించి చదవాల్సిన అవసరం లేదని, ఉద్యోగాలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయడం వంటి ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని