America: భారత్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం

భారత్‌లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది.

Published : 28 Jun 2024 06:25 IST

అమెరికా వ్యాఖ్య

వాషింగ్టన్‌: భారత్‌లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది. మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను, ప్రార్థనా స్థలాలను కూల్చివేయడమూ ఇబ్బందికరమేనని అభిప్రాయపడింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై బుధవారం నివేదిక విడుదల చేసిన సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం పలువురు పని చేస్తున్నారని తెలిపారు.‘భారత్‌లోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడి నిషేధిస్తూ చట్టాలు చేశాయి. ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు భారత్‌ ఆధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు’ అని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై విడుదల చేసిన 2023 నివేదిక పేర్కొంది. 

భారత్‌ దర్యాప్తు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం

తమ దేశంలో జరిగిన ఖలిస్థాన్‌ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను హత్య కేసులో భారత్‌ దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా పేర్కొంది. ఈ హత్యలో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా ప్రమేయముందని అమెరికా అధికారులు గత నవంబరులో అభియోగాలు మోపారు. గత ఏడాది జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌లో నిఖిల్‌ను అరెస్టు చేసి అమెరికాకు తీసుకొచ్చారు. ‘ఈ కేసులో విచారణ జరుపుతున్నామని భారత్‌ అధికారులు తెలిపారు. ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి బుధవారం వాషింగ్టన్‌లో వ్యాఖ్యానించారు. 


ఇరు దేశాల సంబంధాలు మరింత విస్తృతం

అమెరికా రాయబారి గార్సెట్టీ వెల్లడి

ఆక్సన్‌ హిల్‌: భారత్, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత అత్యుత్తమంగా ఉన్నాయని, అవి మరింత విస్తృతమవుతున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇంత దగ్గరగా రెండు దేశాలు లేవని, అమెరికాలో భారతీయులు 1.5 శాతం ఉన్నారని, వారు దేశ పన్నుల్లో 6శాతం చెల్లిస్తున్నారని తెలిపారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన వలస వర్గమని వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి భారీగా తరలివచ్చిన ప్రతినిధులతో వాషింగ్టన్‌కు సమీపంలోని ఆక్సన్‌ హిల్‌లో నిర్వహించిన సెలక్ట్‌ యూఎస్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘భారత్, అమెరికా సంబంధాలంటే కూడిక కాదు.. మల్టిప్లికేషన్‌. ఇది అమెరికా ప్లస్‌ ఇండియా కాదు. గుణింతం లాంటిది’ అని గార్సెట్టీ పేర్కొన్నారు. అమెరికన్లకు మరిన్ని భారత్‌ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని