Turbulence in Flight: విమానంలో కుదుపులు.. ఓవర్‌హెడ్‌ బిన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

గగనతలంలో విమాన ప్రయాణికులు తీవ్ర భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారు. కుదుపుల (Turbulence)తో కొందరు అమాంతం సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు.  

Updated : 02 Jul 2024 10:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాము ప్రయాణిస్తోన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు (Turbulence) రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల(Turbulence) తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ఒక వ్యక్తి ఏకంగా ఓవర్‌హెడ్ బిన్‌ వద్ద ఇరుక్కుపోయాడు. మిగతా ప్రయాణికులు అతడిని కిందికి దించుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..

విమానయాన సంస్థ ఎయిర్‌ యురోపా(Air Europa)కు చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకు బయల్దేరింది. ఆ సమయంలో ఒక్కసారిగా కుదుపులకు లోనయింది. ప్రయాణికులు ఎగిరిపడటమే గాకుండా సీలింగ్ ప్యానెల్, సీట్లు దెబ్బతిన్నాయి. చిన్నారులు భయంతో ఏడుపు లంకించుకున్నారు. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బ్రెజిల్‌లోని నాటల్ ఎయిర్‌పోర్టులో దింపారు. దీనిపై ఎయిర్ యురోపా సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.

సోమవారం జరిగిన ఈ ఘటనపై ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఐరోపా టూర్‌ ముగించుకొని తాను స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పారు. మార్గమధ్యలో ఉండగా కుదుపుల గురించి కెప్టెన్ వార్నింగ్ ఇచ్చారు. సీట్‌బెల్ట్‌ బిగించి పెట్టుకోవాలని సూచించారు. సీట్‌బెల్ట్‌ సరిగా పెట్టుకోనివారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఆ అనుభవం భయానకంగా అనిపించిందని మరో ప్రయాణికుడు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని