South Korea: దక్షిణ కొరియా బ్యాటరీ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం: 20 మంది మృతి

దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఓ బ్యాటరీ ప్లాంట్లో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 24 Jun 2024 18:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 సమయంలో సియోల్‌ దక్షిణ ప్రాంతంలోని హ్వసోంగ్‌లో ఉన్న ఆరిసెల్‌ బ్యాటరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 35,000 సెల్స్‌ను భద్రపర్చిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. 

ఇప్పటివరకు 20 మృతదేహాలను ప్రమాదం జరిగినచోట అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్‌ ఇంజిన్లు ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీలు వేగంగా మండటం.. అత్యధిక ఉష్ణోగ్రతలు వెదజల్లడంతో తొలుత సహాయక చర్యలు కష్టంగా మారాయి. దీనికితోడు నీరు ఈ బ్యాటరీలపై మంటలు ఆర్పలేదు. ఈనేపథ్యంలో డ్రైశాండ్‌ను కూడా వినియోగించారు. 

ఈ కర్మాగారంలో ప్రమాదం జరిగే సమయంలో సుమారు 100 మంది పని చేస్తున్నారు. వీరిలో 78 మంది సురక్షితంగా బయటపడ్డారు. మంటలను అదుపు చేయడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు యూన్‌సుక్‌ యోల్‌ స్పందించారు. అధికారులు అందుబాటులో ఉన్న వనరులు, సిబ్బందిని వినియోగించి ప్రమాదాన్ని అదుపుచేయాలని ఆదేశించారు. 

ప్రపంచంలో బ్యాటరీల తయారీ రంగంలో దక్షిణ కొరియా చాలా ముందుంది. అంతేకాదు.. వాటిని వినియోగించే కార్లు కూడా అక్కడ ఎక్కువే. ద.కొరియా బ్యాటరీ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహన కంపెనీలకు సరఫరా చేస్తుంటాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని