ఏఐ డ్రెస్‌... చూశారా?

ఏఐ డ్రెస్సా... ఏముంది, చాలా సింపుల్‌! వాట్సాప్‌ తెరిచి, కొన్ని కమాండ్స్‌ ఇస్తే సరి... నచ్చినట్లుగా ఏఐ రూపొందించిన డిజైన్‌ క్షణాల్లో కళ్లముందుకు వచ్చేస్తుంది... అంటారా? ఇది కేవలం డిజైన్‌ కాదండీ బాబు.

Published : 05 Jul 2024 04:23 IST

ఏఐ డ్రెస్సా... ఏముంది, చాలా సింపుల్‌! వాట్సాప్‌ తెరిచి, కొన్ని కమాండ్స్‌ ఇస్తే సరి... నచ్చినట్లుగా ఏఐ రూపొందించిన డిజైన్‌ క్షణాల్లో కళ్లముందుకు వచ్చేస్తుంది... అంటారా? ఇది కేవలం డిజైన్‌ కాదండీ బాబు. ఏకంగా ధరించొచ్చు. ఆశ్చర్యంగా ఉందా? దాన్ని రూపొందించిందో అమ్మాయి. పేరు... క్రిస్టినా ఎర్నెస్ట్‌.

క్రిస్టినాది అమెరికా. గూగుల్‌లో ఇంజినీర్, ‘షీ బిల్డ్స్‌ రోబోట్స్‌’ ఫౌండర్‌ కూడా. పేరుకి ఇంజినీర్‌ అయినా... ఫ్యాషన్‌పైనా ఆసక్తి ఎక్కువ. ఆ రెంటినీ ఎందుకు కలపకూడదన్న ఆసక్తితో తయారు చేసిందే... ఈ ఏఐ డ్రెస్‌. ప్రపంచంలోనే ఏఐతో రూపొందించిన తొలి డ్రెస్‌ కూడా ఇదే కావొచ్చు అంటోందీమె. దీనికోసం క్రిస్టినా చాలానే కష్టపడింది. ఎన్నో ప్రయోగాల తరవాత చివరకు సఫలమైంది. నలుపు రంగు గౌనుకు మెడ వద్ద, నడుము చుట్టూ బంగారు రంగు పాములు వచ్చేలా రూపొందించిన దీనికి ‘మెడూసా’ డ్రెస్‌ అని పేరు పెట్టింది. గ్రీకు పురాణాల్లో తలంతా పాములే వెంట్రుకల్లా ఉండే ‘మెడూసా’ అనే మహిళ పాత్ర స్ఫూర్తితో దీన్ని రూపొందించిందట. దీనిలో ప్రత్యేకత ఏముంది అనిపిస్తోందా? దీని రూపకల్పనలో కృత్రిమమేధ (ఏఐ)ని ఉపయోగించిందన్నాం కదా! ఈ డ్రెస్‌ వేసుకున్న అమ్మాయిని ఎవరైనా చూస్తే ఈ పాములన్నీ వాళ్లవైపు చూస్తాయట. అలా కోడింగ్‌ రాసి, దీన్ని రూపొందించింది మరి. పైగా ధరించినవారికి భారమవకుండా తేలిగ్గా ఉండేలానూ జాగ్రత్తలు తీసుకుంది క్రిస్టినా. పూర్తయ్యాక ఆ డ్రెస్‌ని స్వయంగా ధరించి వీడియో చిత్రీకరించింది. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే మూడురోజుల్లో 31 లక్షలమంది వీక్షించారు. ఆమె సృజనాత్మకతకు జేజేలూ కొడుతున్నారు. అన్నట్టూ క్రిస్టినా ఏఐ ప్రయోగాలకే పరిమితమవదు. తన సంస్థ ద్వారా కోడింగ్, రోబో తయారీల్లో అమ్మాయిలకు శిక్షణ ఇస్తోంది. గతంలో ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించింది. ఇంతకీ ఈమె సృజన మీకెలా అనిపించింది? 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్