సదా... అడవితో ప్రేమలో!

‘భగీరా... వీడిని బ్లఫ్‌మాస్టర్‌ అనొచ్చు.  మనుషులని చూస్తే సిగ్గెక్కువ... వాళ్లకి తన జాడ తెలియనివ్వడు..చల్లగా జారుకుంటాడు. చింతనిప్పుల్లాంటి ఆ కళ్లని చూడాలంటే ధైర్యమే కాదు, సహనం కూడా ఉండాలి!’ అంటోంది వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ సదా సయ్యద్‌. ఇంతకీ సదా చెప్పిన ఆ భగీరా ఎవరంటారా? రండి తెలుసుకుందాం... 

Updated : 28 Jun 2024 13:08 IST

‘భగీరా... వీడిని బ్లఫ్‌మాస్టర్‌ అనొచ్చు.  మనుషులని చూస్తే సిగ్గెక్కువ... వాళ్లకి తన జాడ తెలియనివ్వడు..చల్లగా జారుకుంటాడు. చింతనిప్పుల్లాంటి ఆ కళ్లని చూడాలంటే ధైర్యమే కాదు, సహనం కూడా ఉండాలి!’ అంటోంది వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ సదా సయ్యద్‌. ఇంతకీ సదా చెప్పిన ఆ భగీరా ఎవరంటారా? రండి తెలుసుకుందాం... 

గీరా... తెలివైన చిరుతపులి. చూడ్డానికి అందమైన మచ్చలతో ఎంత ముచ్చటగా ఉంటుందో... తేడా వస్తే నోట్లో వేసుకుని అంత తేలిగ్గానూ చప్పరిస్తుంది. ఇది ఉండేది జైపుర్‌లోని జల్లానా లెపర్డ్‌ సఫారీలో. మరి అలాంటి పులిని కెమెరాలో బంధించాలంటే ధైర్యంతోపాటు సహనమూ ఉండాలిగా. అదే చెబుతోంది సదా. ‘అప్పటికే ఎన్నో గంటలు ఎదురుచూశా భగీరా కోసం. తప్పదు. ఆ చిరుత తీరే అంత. మన సహనానికి పరీక్ష పెడుతుంది. అలా ఎంతోసేపు ఎదురుచూస్తే కానీ దాని నడకలోని అందాన్నీ, గాంభీర్యాన్నీ క్లిక్‌ మనిపించే అవకాశం దొరకలేదు. అలాగే మీరు సీఎం గురించి కూడా తెలుసుకోవాలి. అది దాని ముద్దుపేరు... పూర్తి పేరు చోటామట్కా. తాడోబా అడవిని ఏలుతుందీ పులి. మూడు ఆడపులుల మనసు గెలుచుకుంది. తొమ్మిది పిల్లలు. దీన్ని చూడ్డానికి తొమ్మిదిసార్లు ప్రయత్నించా. ఎప్పుడూ నా కెమెరాకి చిక్కేది కాదు. ఎన్నోసార్లు నిరాశతో వెనుతిరిగా. చివరికి ఎలా అయితేనేం... నాలుగు పిల్లలూ, ఆడపులి భానుస్కిందితో కలిసి ఓసారి నా కెమెరా కంట్లో పడింది. ఇవేకాదు చోటా తారా, వీరప్పన్, వీరా... వీటికోసమూ నా ఎదురు చూపులు తప్పలేదు. ఆడపులి శ్యామాని... మొదటిసారి చూసినప్పుడే తనతో ప్రేమలో పడిపోయా.

‘క్వీన్‌ మాయా’ అయితే పిల్లలతో ఎంత ముద్దుగా ఉంటుందో’ అంటోంది సదా. ఇలా అడవితల్లి కడుపులో దాగిన అందమైన జీవజాతుల కథలని తన కెమెరాతో బంధించి ఆ కథలని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది సదా. యూట్యూబ్‌లో ‘సదాగ్రీన్‌ లైఫ్‌’ ఛానెల్‌లో ఆమె చెప్పే అడవి కబుర్లకి ఐదులక్షల మంది అభిమానులున్నారు. ఇన్‌స్టాలోనూ దాదాపుగా లక్షన్నరమంది ఫాలోవర్లు ఉన్నారు. చిట్టి ఉడుత నన్హీ నుంచి మొదలుపెట్టి తోకపిట్టలూ, కింగ్‌ ఫిషర్‌ పక్షుల చిత్రాలు తీయడం వెనక ఉన్న కథలని ఎంతో అద్భుతంగా వివరిస్తోంది సదా. తాజాగా నికాన్‌ రూపొందించిన కాఫీటేబుల్‌ బుక్‌లోనూ ఈమె తీసిన చిత్రాలు రెండింటికి చోటు దక్కింది. ఒకటి తాడోబాలో పులి అయితే రెండోది జొన్నకంకులు విరుచుకుంటున్న చిలుక చిత్రం. అంతా బాగానే ఉంది.. ఇంతకీ ఆమె మనకి తెలిసిన ‘జయం’ సదానేనా అనేగా మీ సందేహం. అవును ‘రానురానంటూనే... చిన్నదో చిన్నది’ సదానే. నటన సంగతి ఏమోకానీ ఈ ఫొటోగ్రఫీలోకి మాత్రం రావాలనే వచ్చింది. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ దారిని ఎంచుకుని రెండున్నరేళ్లు కావొస్తోంది. ఇది తన జీవితకాల అభిరుచి అనే సదా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయపార్కులన్నీ తిరిగేసింది. 52 పులుల్ని క్లిక్‌ మనిపించింది.  

అలా మొదలయ్యింది... 

‘అహింస’ చిత్రంలో నటించేటప్పుడు... మధ్యప్రదేశ్‌లోని పన్నా రిజర్వ్‌ ఫారెస్ట్‌కి వెళ్లింది. అప్పుడే తొలిసారి అడవిపై ప్రేమ పెంచుకున్నాననే సదా వీగన్‌ మాత్రమే కాదు, కొన్నేళ్లుగా జంతు హక్కులకోసమూ పనిచేస్తోంది. ‘నాకు జంతువులపై ఇష్టం ఎలా పెరిగిందో గుర్తులేదు. ముంబయిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల కుక్కలు, పిల్లులకు ఆహారం పెట్టేదాన్ని. దాంతో చాలామంది వీధి కుక్కల్ని ప్రోత్సహించకు అని నాతో గొడవ పెట్టుకునేవారు. మనకు తెలియని పొరుగింటి వాళ్లని కూడా గౌరవంగా ‘నైబర్‌’ అంటాం. మరి మనతోపాటు సమాజంలో ఉండే కమ్యూనిటీ యానిమల్స్‌ని మాత్రం స్ట్రే అంటూ ఎలా దూరం పెడతాం? గాలిపటాలకు వాడే మాంజా దారాలతో పక్షులను హింసించే హక్కు మనకుందా? ఈ ఆలోచనలే నన్ను యానిమల్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌గా మార్చాయి’ అనే సదా తనలాంటి జంతు ప్రేమికులతో కలిసి వాటి రక్షణ కోసం కృషిచేస్తోంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్