పనికిరాని వాటితో... ఫోర్బ్స్‌లోకి

తక్కువ ధరకే వస్తున్నాయని కొనడం... ఆపై బోర్‌ కొట్టేసింది, ఇదిప్పుడు ఫ్యాషన్‌ కాదు అని పక్కన పెట్టేయడం. చాలామంది చినగకపోయినా దుస్తులు పక్కన పడేయడానికి ప్రధాన కారణాలు ఇవేనట!

Updated : 02 Jul 2024 14:24 IST

తక్కువ ధరకే వస్తున్నాయని కొనడం... ఆపై బోర్‌ కొట్టేసింది, ఇదిప్పుడు ఫ్యాషన్‌ కాదు అని పక్కన పెట్టేయడం. చాలామంది చినగకపోయినా దుస్తులు పక్కన పడేయడానికి ప్రధాన కారణాలు ఇవేనట! ఇలాగైతే భూమిపై బోలెడు వృథా పేరుకుంటుందిగా? ఇక డిజైనర్లు, వస్త్ర పరిశ్రమల నుంచి వచ్చే వృథా సంగతి సరే సరి! దీన్ని అరికట్టాలనుకుంది అషితా సింఘాల్‌. పర్యావరణానికి మేలు చేస్తూనే రూ.కోట్లనూ సంపాదిస్తోంది.

మ్మడి కుటుంబం... దీంతో అషితాకి ప్రతి వస్తువునీ జాగ్రత్తగా వాడుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటైంది. ఇంట్లో చిన్నది. మురిపెంగా అన్నీ నేర్పేవారు. అలా గార్డెనింగ్‌ మెలకువలు నేర్చుకున్న తనకు పర్యావరణంపైనా ప్రేమ ఏర్పడింది. ఈమెది దిల్లీ. బీకాం ఆనర్స్‌ పూర్తయ్యాక పెరల్‌ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో పీజీలో చేరింది. అప్పుడే నేర్చుకునే క్రమంలో ఎంత వస్త్రం వృథా పేరిట చెత్తబుట్ట పాలవుతోందో అర్థమైంది. ఇక ఫాస్ట్‌ ఫ్యాషన్‌ ఎంత చెత్తకు కారణమవుతోందో కూడా గ్రహించింది. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలి అనుకుంది అషిత. సరిగా అప్పుడే ఆమెకు అమెరికాలోని ‘లారెట్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ నెట్‌వర్క్‌’ నిర్వహించే ఫ్యాషన్‌ పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌ విద్యార్థులు పాల్గొంటారు. గెలిచినవారికి పెద్ద మొత్తంలో స్పాన్సర్‌షిప్‌తోపాటు వ్యాపారం నిర్వహించుకోవడానికి అవసరమైన మెంటార్‌షిప్‌ కూడా దొరుకుతుంది.

ఆ తికమకలో...

సమస్యల్లా... ఏం చేయాలనే! ఓవైపు పెరుగుతున్న వృథా ఆమె బుర్రను తొలిచేస్తోంది. మరోవైపు వచ్చిన అవకాశాన్ని అందుకుని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఆ తికమకలో ఉండగా... ‘పడేసే ఆ వస్త్రాల ముక్కలతోనే ఏదైనా చేస్తే’ అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రావడం తడవు డిజైనర్లు, నేతకారులు, వస్త్ర తయారీ సంస్థలను కలిసింది. ‘ఏదో హాబీ కోసం చేస్తున్నావు. కొద్దిరోజుల్లో నువ్వే ఆలోచన మానుకుంటా’వనేవారు. కానీ తను పట్టు వదల్లేదు. నోయిడాలో చిన్న గదిని అద్దెకు తీసుకొని అయిదుగురు సహాయకులు, ఇద్దరు నేతకారులను నియమించుకుంది. వస్త్ర వృథాని తీసుకొచ్చి నేతకారులతో నేయించడం, ప్యాచ్‌ల్లా కుట్టించడం లాంటివి చేసింది. వాటితో దుస్తులు డిజైన్‌ చేసి, అంతర్జాతీయ పోటీలో రెండో స్థానంలో నిలవడమే కాదు, రూ.20 లక్షలు నగదు బహుమతినీ అందుకుంది. ఆ మొత్తంతో 2018లో ‘పైవాండ్‌ స్టూడియో’ ప్రారంభించింది.

‘సేకరించిన వస్త్రాన్ని రంగు, మెటీరియల్‌ ఆధారంగా వేరు చేస్తాం. వాటిని నేతకారులతో తిరిగి నేయిస్తాం. దాంతో వస్త్రాలు, బ్యాగులు, జాకెట్లు వగైరా రూపొందించి అమ్ముతున్నాం. విదేశీ ఫ్యాషన్‌ షోల్లోనూ పాల్గొన్నా. ఫ్యాషన్, ఇంటీరియర్‌ డిజైనర్లకు వస్త్రాలనూ అమ్ముతున్నాం. ఇప్పుడు నా దగ్గర 35 మంది పనిచేస్తున్నారు. గత ఏడాది టర్నోవర్‌ రూ.కోటికిపైనే! దానికంటే పర్యావరణానికి మేలు చేస్తున్నా అన్నది ఎక్కువ ఆనందాన్నిస్తోంది. 30వేల కేజీల వృథాని వస్త్రంగా మార్చాం. కొన్ని వేల లీటర్ల నీటిని ఆదా చేయగలిగా’మంటోన్న అషిత 2021లో ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30, ఈ ఏడాది ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌ 30 జాబితాల్లో చోటునీ సంపాదించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్