ఆ మూడు గంటలు దానికి దూరంగా ఉంటా..!

ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. అయితే కొంతమంది పలు చిట్కాలను ఉపయోగించి ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

Published : 01 Jul 2024 12:12 IST

(Photos: Twitter)

ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. అయితే కొంతమంది పలు చిట్కాలను ఉపయోగించి ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ‘మామా ఎర్త్’ సహ వ్యవస్థాపకురాలు గజల్‌ అలఘ్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ నిత్యం పలు చిట్కాలను పంచుకుంటుంటారు. తాజాగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి బయటపడడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో అభిమానులతో పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె పాటించే చిట్కాలేంటో తెలుసుకుందామా..!

ఆ మూడు గంటలు ఫోన్‌కు దూరం..!

సాధారణంగా చాలామంది మహిళలు ఒకవైపు పని, మరోవైపు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ బిజీగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. తను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నా నంటున్నారు ‘మామా ఎర్త్’ సహ వ్యవస్థాపకురాలు గజల్‌ అలఘ్‌. ఒకవైపు ఏడు బ్రాండ్లు, 1300కు పైగా ఉద్యోగుల బాగోగులతో పాటు తన ఇద్దరు పిల్లల బాధ్యతను చూసుకుంటూ బిజీగా గడుపుతుంటారు గజల్‌. అయితే ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరకుండా ఉండడానికి తను మూడు చిట్కాలు పాటిస్తారట.

1. ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి రెండు గంటలు, పడుకునే ముందు గంట పాటు ఫోన్‌కు పూర్తి దూరంగా ఉంటా. అంటే రోజులో మూడు గంటల పాటు నేను ఫోన్‌ ఉపయోగించను. ఇక ఆదివారాల్లో అయితే ఐదు గంటల పాటు డిజిటల్‌ డిటాక్స్‌ను పాటిస్తుంటా.

2. రోజుకి అరగంట నుంచి గంట వరకు నా కార్యక్రమాలకు విరామం ప్రకటిస్తాను. ఈ సమయం నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి, వినూత్నంగా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. నా వ్యాపారానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. సామాజిక మాధ్యమాలు, ఇతరుల నుంచి అనేక రకాల ప్రతికూల వార్తలు వినిపిస్తుంటాయి. అయితే వీటి ప్రభావం నాపై పడకుండా జాగ్రత్తపడతాను. ఒకవేళ అవసరమనిపిస్తే తగు చర్యలు తీసుకుంటాను.. అంటున్నారు గజల్.


అది వీడితేనే...!

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన గజల్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అప్లైడ్‌ ఆర్ట్స్‌-మోడ్రన్‌ ఆర్ట్‌ డిజైన్‌లో ఇంటర్న్‌షిప్‌ కోర్స్ చేశారు. 2011లో ఆమె తన స్నేహితుడు వరుణ్‌ అలఘ్ను  పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి 2016లో ‘మామాఎర్త్‌’ను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 10 వేల కోట్లు. అయితే విజయాలను అందుకోవాలంటే కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు రావాలంటారు ఆమె. తాను కూడా ఆ జోన్‌ నుంచి బయటకు వచ్చినప్పుడే విజయాన్ని సొంతం చేసుకున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. 

‘16 ఏళ్ల క్రితం ఎలాంటి అనుభవం లేకుండానే నేను ఒక కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం కోసం వెళ్లాను. 10 ఏళ్ల క్రితం ఐటీ జాబ్‌ వదిలి ఆర్టిస్ట్‌గా చేయడం కోసం న్యూయార్క్‌ వెళ్లాను. అప్పటివరకు నేను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు. ఏడేళ్ల క్రితం బ్యూటీ, పర్సనల్ కేర్‌ బ్రాండ్‌ ‘మామా ఎర్త్‌’ని నా భర్తతో కలిసి స్థాపించాను. సరిగ్గా అదే సమయంలో నేను బిడ్డను ప్రసవించాను. దానికి తోడు నాకు ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. అయితే నేను నా కంఫర్ట్ జోన్‌ నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ నేను ముందుకు సాగడానికి మూడు అంశాలు దోహదం చేశాయి. మొదటగా నేను అసౌకర్య పరిస్థితులకు సిద్ధంగా ఉండేదాన్ని. దానివల్ల వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని. ఆ అనుభవాలే నాకు మార్గం చూపేవి. ఇలా ప్రతిసారీ నాపై నాకు సందేహం, భయం కలిగినప్పుడు మరింత దృఢంగా, నమ్మకంగా, హుషారుగా మారేదాన్ని’ అని చెప్పుకొచ్చారు.


అది ఏమాత్రం స్వార్థం కాదు..!

గత ఏడేళ్లుగా గజల్‌ తన మూడు స్టార్టప్లపై పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె దాదాపు 10 వేల గంటలకు పైగా పని చేశారు. దానివల్ల ఆమె ఆరు పాఠాలు నేర్చుకున్నట్టుగా మరొక సందర్భంలో పోస్ట్‌ చేశారు. అవేంటంటే...

1. విజయం.. మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే స్ఫూర్తి నింపుతుంది. అయితే అక్కడే ఆగిపోకుండా మరొక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి.

2. మీ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం స్వార్థం కాదు. ఎందుకంటే, అది మీతో పాటు మీ వ్యాపారానికి కూడా ప్రయోజనం చేకూర్చుతుంది.

3. మీకు మద్దతు తెలిపే వ్యక్తుల మధ్య ఉండడం మంచిది. దీనివల్ల మీతో పాటు మీ వ్యాపారాన్ని కూడా బలంగా ముందుకు తీసుకెళ్లచ్చు.

4. దీర్ఘకాలిక ప్రణాళికలు మంచివే. కానీ, మీ తర్వాతి అడుగుపై దృష్టి పెట్టడం కూడా అవసరం.

5. మీ ప్రత్యేకతలను స్వీకరించండి. అది మీకు గుర్తింపు తెస్తుంది.

6. ఎప్పుడూ పూర్తిగా పనే మీ జీవితాన్ని తినేయకూడదు.. ప్రతి తడబాటు.. అనుకున్నది సాధించడానికి ఒక మెట్టు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్