నీళ్లే.. రుచికరంగా.. ఇలా!

రోజూ తగిన మొత్తంలో నీళ్లు తాగడం అవసరం అన్న విషయం తెలిసినా సరే.. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడైతే మరీనూ..! అయితే రోజూ నిర్ణీత మొత్తంలో నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ బయటకు వెళ్లిపోయి, అనారోగ్యాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.

Published : 16 Sep 2023 12:25 IST

రోజూ తగిన మొత్తంలో నీళ్లు తాగడం అవసరం అన్న విషయం తెలిసినా సరే.. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడైతే మరీనూ..! అయితే రోజూ నిర్ణీత మొత్తంలో నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ బయటకు వెళ్లిపోయి, అనారోగ్యాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. అలాగే శరీర బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు. ఒకవేళ నీటిని ప్లెయిన్‌గా తాగడం ఇష్టం లేని వారు అందులో కొన్ని పదార్థాల్ని కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఫలితంగా నీటిని రుచికరంగా తయారు చేసుకోవడంతో పాటు మరిన్ని ప్రయోజనాల్ని కూడా పొందచ్చంటున్నారు నిపుణులు.

కీరాదోస, పుదీనాతో..

ముందుగా మూడు కీరాదోస కాయల్ని, నాలుగు నిమ్మకాయల్ని తీసుకుని చక్రాల్లా కట్ చేసుకోవాలి. లీటరు నీటిలో ఈ ముక్కల్ని, కొన్ని తాజా పుదీనా ఆకుల్ని వేసి.. రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంతరం నీటిని వడకట్టుకుని తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ నీరు శరీరంలోని మలినాల్ని, విషపదార్థాల్ని బయటికి పంపిస్తుంది. నిమ్మలోని ఆల్కలీన్ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పుదీనా జీర్ణశక్తిని మెరుగుపరిస్తే.. కీరాదోస చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పండ్లతో..

నిమ్మ, ద్రాక్ష, యాపిల్, కివీ, అనాస.. వంటి పండ్లతో తయారు చేసిన పానీయం కూడా బరువు తగ్గడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొన్ని పండ్ల ముక్కల్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో కొన్ని గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని వడకట్టుకొనైనా తీసుకోవచ్చు.. లేదంటే ముందు పండ్లు తిని ఆ నీరైనా తాగచ్చు. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. జీవక్రియల్ని వేగవంతం చేసి శరీరంలోని మలినాల్ని అతి వేగంగా బయటికి పంపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలోని విటమిన్ 'సి' రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దాల్చినచెక్కతో..

ఒక గ్లాస్ నీటిలో కొన్ని యాపిల్, దాల్చినచెక్క ముక్కల్ని వేసి.. ఈ మిశ్రమాన్ని గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. మరీ రుచిగా కావాలనుకున్న వారు యాపిల్, దాల్చిన చెక్క ముక్కల్ని కాస్త ఎక్కువగా కూడా కలుపుకోవచ్చు. ఈ పానీయంలో క్యాలరీలు అసలే ఉండవు. కాబట్టి కూల్‌డ్రింక్ బదులు దీన్ని తీసుకోవచ్చు. దీనివల్ల త్వరగా బరువు తగ్గడంతో పాటు శరీరంలోని విషతుల్యాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. అలాగే శరీరంలోని జీవక్రియల్ని వేగవంతం చేయడంలోనూ ఈ నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.

కలబందతో..

కప్పు నీటిలో, రెండు చెంచాల చొప్పున నిమ్మరసం, కలబంద గుజ్జు తీసుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. మరింత బాగా కలవాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అలసట వెంటనే దూరమవడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా బరువూ తగ్గచ్చు.

చెరకుతో..

రెండు లీటర్ల నీటిలో.. అనాస, చెరకు ముక్కల్ని వేసి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత వడకట్టుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. చెరకు వేయడం వల్ల ఈ పానీయం రుచిగా ఉండడంతో పాటు.. శరీరంలోని విషతుల్యాలను కూడా సులభంగా బయటికి పంపిస్తుంది. ముఖ్యంగా అనాస ముక్కలు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చెరకు అలసటను దూరం చేసి తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే చెరకులోని విటమిన్లు, ఖనిజాలు.. రొమ్ము క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కొవ్వు కరగడానికి..

శరీరంలో నీటి నిల్వను పెంచి తద్వారా అనవసర కొవ్వుల్ని కరిగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్‌తో తయారుచేసిన పానీయం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం గ్లాసు నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తీసుకోవాలి. చల్లగా కావాలనుకునే వారు అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమం అజీర్తి సమస్యను దూరం చేసి తద్వారా బరువును అదుపులో ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్