చర్మం పొడిబారిందా..?

కొంతమందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా కనిపిస్తుంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి ఎన్నో రకాల కారణాలుంటాయి.

Published : 29 Jun 2024 20:56 IST

కొంతమందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా కనిపిస్తుంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి ఎన్నో రకాల కారణాలుంటాయి. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి పొడిబారిన, పెళుసుబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేమిటో చూద్దాం రండి..

కొబ్బరినూనెతో..

కొద్దిగా కొబ్బరినూనె తీసుకొని చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై మృదువుగా మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా పాదాలను ఇలానే వదిలేసి నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే కాళ్లు తిరిగి కోమలంగా మారడమే కాదు.. చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. రోజూ రాత్రి పడుకొనే ముందు ఈ చిట్కా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు పొందవచ్చు. కొబ్బరినూనె పొడిబారిన, పెళుసుబారిన చర్మానికి తగినంత తేమని అందించి తిరిగి మృదువుగా మారుస్తుంది.

ఈ స్క్రబ్‌తో..

అరచెంచా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ రెండు చెంచాల చొప్పున ఒక పాత్రలో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, పాదాల వద్ద పొడిగా మారిన చర్మంపై అప్త్లె చేసి కాసేపు మృదువుగా మసాజ్ చేయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాదాలు బాగా ఆరాక నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది.

తేనెతో..

పొడిగా మారిన పాదాలకు తేనె అప్త్లె చేసి రెండు లేదా మూడు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇది పొడిబారి, పెళుసుగా మారిన చర్మాన్ని బాగుచేయడమే కాకుండా చర్మం యవ్వనంగా కనిపించేలా కూడా చేస్తుంది.

కలబందతో..

తాజా కలబంద గుజ్జు తీసుకొని పాదాలకు అప్త్లె చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్ల చొప్పున క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పాదాలు కోమలంగా మారతాయి.


ఇవి గుర్తుంచుకోండి..

⚛ కాళ్లు, పాదాలపై గాయాలతో బాధపడే వారు అవి పూర్తిగా తగ్గిన తర్వాతే ఈ చిట్కాలను అనుసరించాలి.

⚛ మరీ వేడిగా ఉన్న నీటితో కాళ్లు, పాదాలు కడగకూడదు.

⚛ రోజూ స్నానం చేసిన తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి.

⚛ మరీ బిగుతుగా ఉండే సాక్సులు, షూలు, చెప్పులు.. వంటివి ధరించకూడదు.

⚛ ఎక్స్‌ఫోలియేషన్‌కి ఉపయోగించే పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్