Vegan Diet: ఏది అపోహ? ఏది వాస్తవం?

చాలామంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వారి ఆహారపుటలవాట్లు కూడా కారణమవుతుంటాయి. అయితే వీటిని దూరం చేసుకోవడానికి కచ్చితమైన ఆహార నియమాలు అలవాటు చేసుకోవడం సహజమే! ఈ క్రమంలో కొంతమంది వీగన్‌ డైట్‌కు ప్రాధాన్యమిస్తుంటారు.

Published : 18 Nov 2023 12:03 IST

చాలామంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వారి ఆహారపుటలవాట్లు కూడా కారణమవుతుంటాయి. అయితే వీటిని దూరం చేసుకోవడానికి కచ్చితమైన ఆహార నియమాలు అలవాటు చేసుకోవడం సహజమే! ఈ క్రమంలో కొంతమంది వీగన్‌ డైట్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. పాలు, పాల పదార్థాల్ని పూర్తిగా పక్కన పెట్టి.. మొక్కల ఆధారిత ఆహార పదార్థాల్ని, ఆహారోత్పత్తుల్ని తీసుకోవడమే ఈ డైట్‌లోని ప్రధానాంశం. అయితే ఈ డైట్‌కు సంబంధించి కొంతమందిలో కొన్ని సాధారణ అపోహలుంటాయి. మరి, అవేంటి? వాటిపై నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

అపోహ: ఈ డైట్ ద్వారా శరీరానికి సరిపడా పోషకాలు అందవు..

వాస్తవం: గేదె, ఆవు పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మాంసాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అయితే వీగన్లు వీటికి దూరంగా ఉండడం వల్ల వారికి సరిపడా పోషకాలు లభించవని అనుకుంటారు కొందరు. ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. మొక్కల ఆధారిత ఆహార పదార్థాల్లో కూడా ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు. బ్రకలీ, ఓట్స్‌, బీన్స్‌, నట్స్‌, క్వినోవా, బచ్చలికూర, తృణధాన్యాలు.. వంటి వాటిల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే పాలకు బదులుగా సోయా, కొబ్బరి, బాదం.. వంటి పదార్థాల నుంచి తీసిన పాలలో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. అంతేకాదు.. మాంసాహారం నుంచి లభించే పోషకాలతో పోల్చుకుంటే వీగన్‌ పదార్థాల్లో లభించే ప్రొటీన్లు, క్యాల్షియంను శరీరం తొందరగా గ్రహిస్తుందట!

అపోహ: ఈ డైట్‌ పాటించడం కష్టం...

వాస్తవం: సాధారణ డైట్‌ నుంచి వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి మారడం కష్టమనుకుంటారు కొందరు. అయితే మన దృష్టి ఏయే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నామన్న దానిపై కాకుండా ఏయే పదార్థాలను తినొచ్చన్న దానిపై కేంద్రీకరిస్తే.. ఇలాంటి అపోహలు/సందేహాల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. నిజంగా వీగన్‌ వంటకాలను పరిశీలిస్తే వీటిలో ఎన్నో రకాల వెరైటీలు కనిపిస్తాయి. అలాగే నాన్‌వెజ్‌కి బదులుగా మొక్కల ఆధారిత మాంసాహార ఉత్పత్తులు (ప్లాంట్‌ బేస్‌డ్‌ మీట్‌) కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి వీగన్‌ డైట్‌కి అలవాటు పడడం కష్టమైన వ్యవహారమేమీ కాదు.

అపోహ: గర్భిణులు ఈ డైట్‌ పాటించకూడదు..

వాస్తవం: మహిళలు గర్భం ధరించిన తర్వాత ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది పోషకాల కోసం మాంసం, పాలు, గుడ్లు.. మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వీగన్లు వీటిని తీసుకోరు కాబట్టి గర్భిణులకు ఈ డైట్‌ సరిపడదనే భావన కొంతమందిలో ఉంటుంది. కానీ, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారపదార్థాల్లో కూడా గర్భిణులకు కావాల్సిన ప్రొటీన్లు, ఐరన్‌, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. గర్భధారణ సమయంలో వచ్చే పలు సమస్యల్ని కూడా ఇవి తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణులు ఈ డైట్‌ పాటించే ముందు ఓసారి వైద్యులు/పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి!

అపోహ: వీగన్‌ డైట్‌తో పలు సమస్యలొస్తాయి..

వాస్తవం: మాంసం, పాలు, గుడ్లు.. వంటివి తీసుకుంటేనే శరీరానికి పోషకాలన్నీ అందుతాయని.. లేదంటే పోషకాహార లోపంతో పలు అనారోగ్యాలు తప్పవన్న భావనలో ఉంటారు కొందరు. కానీ ఇదీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యల ముప్పు పొంచి ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. అదే వీగన్‌ డైట్‌ పాటించే వారికి ఈ రిస్క్‌ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : అయితే కొత్తగా ఈ డైట్‌ని పాటించాలనుకునే వారు ముందుగా ఓసారి పోషకాహార నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.. ఈ క్రమంలో తమ శరీరతత్వాన్ని బట్టి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం మరీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్