నాన్‌స్టిక్‌ పాత్రలు వాడుతున్నారా?

నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట అడుగంటదు. ఏం వండినా చక్కగా ఉడుకుతాయి...అంటూ చాలానే చెబుతాం. మొదటిసారి వంట చేసేవాళ్లకు మంచి ఎంపిక. అంతా బాగానే ఉంది. కానీ, దీన్ని సరైన దిశలో వాడకపోతే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తోంది ఐసీఎంఆర్‌.

Updated : 04 Jul 2024 08:36 IST

నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట అడుగంటదు. ఏం వండినా చక్కగా ఉడుకుతాయి...అంటూ చాలానే చెబుతాం. మొదటిసారి వంట చేసేవాళ్లకు మంచి ఎంపిక. అంతా బాగానే ఉంది. కానీ, దీన్ని సరైన దిశలో వాడకపోతే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తోంది ఐసీఎంఆర్‌. మరి దీన్నెలా వాడాలి? నష్టం ఏంటి తెలుసుకుందామా!

వండే ఆహారం పాత్రలకు అతుక్కోకుండా ఉండేందుకు 1930ల్లో పాలీటెట్రాఫ్లోరోఎథిలీన్‌ (టెఫ్లాన్‌)కోట్‌ని కనిపెట్టారు. ఇది కార్బన్, ఫ్లోరిన్‌ అణువులతో కూడిన కృత్రిమ రసాయనం. వెబ్‌ఎండీ రిపోర్ట్‌ ప్రకారం టెఫ్లాన్‌లో ఉండే పెర్‌ఫ్లోరినేటెడ్‌ ఆక్టానోయిక్‌ ఆమ్లం కిడ్నీ, కాలేయ వ్యాధులకూ, సంతానలేమికీ కారణం కావొచ్చంటోంది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నివేదిక. డైటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ ఇండియన్స్‌ పేరుతో నాన్‌-స్టిక్‌ కుకర్‌వేర్‌ను తప్పుగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించీ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నాన్‌-స్టిక్‌ పాత్రలను ఎక్కువ వేడి చేయడం వల్ల వంటల్లోకి విషపూరిత రసాయనాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయట. అందుకే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా మట్టిపాత్రలు, కోటింగ్‌ లేని గ్రానైట్‌ గిన్నెలు వంటివే వాడాలనీ సూచిస్తున్నారు.

తప్పనిసరై నాన్‌స్టిక్‌ వాడేవారు వండేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...

  • కొత్త నాన్‌స్టిక్‌ పాత్రల్ని వాడే ముందు  కాస్త బేకింగ్‌ సోడా వేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వీటిల్లో పేరుకున్న రసాయనాల తాలూకు వ్యర్థాలు తొలగిపోతాయి.
  • నాన్‌స్టిక్‌ గిన్నెల్ని ప్రీహీట్‌ చేయడం మంచిది కాదు. అలానే పెద్ద మంటమీదా వంట చేయొద్దు. ఇలా చేస్తే అవి అధిక వేడిని గ్రహిస్తాయి. ఫలితంగా పైన ఉండే టెఫ్లాన్‌ కోట్‌ కరిగి హానికరంగా మారుతుంది.
  • ప్రతి వంటకానికి నాన్‌స్టిక్‌ పాత్రలను వాడకుండా అడుగంటే వేపుళ్లూ, కూరలకోసం మాత్రమే ఎంచుకుంటే మేలు. అప్పుడే ఎక్కువకాలం మన్నుతాయి. వీటిల్లో వండే పదార్థాలను తిప్పేందుకు చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. లేదంటే గీతలు పడి వంటకు పనికిరాకుండా పోతాయి.
  • ఎసిటిక్‌ గుణాలున్న టొమాటో, నిమ్మ, చింతపండు వంటి వాటితో చేసే పదార్థాలను ఇందులో వండకపోవడమే మేలు. వీటి రసాయనిక చర్యలకు కెమికల్స్‌ విడుదలయ్యే అవకాశమూ ఉంది.  
  • వీలైనంత వరకూ వేడి నీళ్లు, లిక్విడ్‌ సోప్‌లతో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. ఆపై పొడివస్త్రంతో తుడిచి కాస్త నూనె రాసి భద్రపరుచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్