విహారయాత్రల్లో ఈ ఆహార నియమాలు పాటిస్తున్నారా?

ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివారు విహారయాత్రలకు వెళ్లినప్పుడు పలు సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఈ సమస్యల వల్ల బయటకు కూడా వెళ్లరు. ఇంకొంతమంది వెళ్లినా ఆ ఇబ్బందుల వల్ల సరిగా ఎంజాయ్‌ చేయలేకపోతుంటారు.

Published : 01 Sep 2023 12:12 IST

ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివారు విహారయాత్రలకు వెళ్లినప్పుడు పలు సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఈ సమస్యల వల్ల బయటకు కూడా వెళ్లరు. ఇంకొంతమంది వెళ్లినా ఆ ఇబ్బందుల వల్ల సరిగా ఎంజాయ్‌ చేయలేకపోతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వీరు కూడా విహారయాత్రలను ఆస్వాదించవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా...

బ్రేక్‌ఫాస్ట్‌ మితంగా..

మన దినచర్య బ్రేక్‌ఫాస్ట్‌తోనే మొదలవుతుంటుంది. అయితే కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా కడుపు నిండా ఆహారం తీసుకుంటారు. అలా చేయడం వల్ల రోజంతా శరీరం భారంగా అనిపిస్తుంది. దానివల్ల ఏ పనీ సరిగా చేయలేకపోతుంటారు. అలాగని తక్కువగా తీసుకున్నా నీరసం వచ్చేస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా మొలకలు, నట్స్‌ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లను అల్పాహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చంటున్నారు.

ఇంటి భోజనం..

కొంతమందికి బయటి భోజనం అస్సలు పడదు. ఇక విహారయాత్రలకు వెళ్లినప్పుడు భిన్నమైన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు గ్యాస్ సంబంధిత సమస్యలు మరింత అధికమవుతుంటాయి. కాబట్టి, ఇంటి నుంచే కొన్ని రకాల పదార్థాలను తీసుకెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు. సాధారణంగా ఆహారం ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలని అంటుంటారు. విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఈ నియమాన్ని తు.చ. తప్పకుండా పాటించడం వల్ల కూడా గ్యాస్‌ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు.

అవి కూడా..

కొంతమంది విహారయాత్రలకు వెళ్లినప్పుడు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను తినాలంటే ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అవి తమ శరీరానికి పడకపోతే ఇబ్బందులు వస్తాయనుకోవడమే. అయితే తాజాగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ఇంతకుముందు చెప్పినట్లు ఒకేసారిగా కాకుండా మితంగా ఎక్కువసార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వీటికి దూరంగా..

ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలకు కొదవ ఉండదు. ఇందులో కెఫీన్‌, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌లు ముందు వరుసలో ఉంటాయి. కాబట్టి, విహారయాత్రలకు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడం లేదా తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

నడక మర్చిపోవద్దు..

కొంతమంది అజీర్తి సమస్యలతో విహారయాత్రలను ఆస్వాదించలేకపోతుంటారు. ఇలాంటి వారు తమ ఆహారంలో పెరుగు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కోసం క్రమం తప్పకుండా నీళ్లు తాగుతుండాలి. అయితే ఎంత చేసినా శారీరక వ్యాయామం ఉంటేనే ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి, ఒకవైపు కొత్త ప్రదేశాలను చూస్తూనే ఎక్కువ సమయం నడవడానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నిపుణులు. ఇది పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్