హార్మోన్లు సమతులంగా.. ఉండాలంటే..!

హార్మోన్ల అసమతౌల్యత.. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అతిగా బరువు పెరగడం, నిద్ర పట్టకపోవడం, బద్ధకంగా అనిపించడం, రుతు సంబంధిత సమస్యలు.. మొదలైనవన్నీ హార్మోన్ల అసమతౌల్యతకు కారణాలు కావచ్చు.

Published : 28 Jun 2024 12:30 IST

హార్మోన్ల అసమతౌల్యత.. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అతిగా బరువు పెరగడం, నిద్ర పట్టకపోవడం, బద్ధకంగా అనిపించడం, రుతు సంబంధిత సమస్యలు.. మొదలైనవన్నీ హార్మోన్ల అసమతౌల్యతకు కారణాలు కావచ్చు. అయితే శరీరంలో వివిధ రకాల హార్మోన్లన్నీ సవ్యంగా విడుదలైనప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఇందుకోసం నిపుణులు సూచించే కొన్ని సలహాలేంటో తెలుసుకుందాం రండి..

ఏడెనిమిది గంటల నిద్ర..

నిద్రలేమితో కూడా హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడుతుంది. కాబట్టి రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే హార్మోన్లు సమతులంగా ఉంటే శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ దరిచేరవు.

వ్యాయామం చేయాలి..

హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడినప్పుడు వాకింగ్, స్విమ్మింగ్.. లాంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది కాలంలోనే ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయంలో నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

ఆహారం విషయంలో..

హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి.. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు తగినంత మేర ఉండేలా చూసుకోవాలి. రోజూ రెండుమూడు రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు.. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని సమన్వయపరుస్తుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి, యాపిల్, జామ పండ్లను ఎక్కువగా తినాలి.

కొబ్బరి నూనెతో..

హార్మోన్లపై కొబ్బరి నూనె ప్రభావం చాలానే ఉంటుంది. శరీరంలో వివిధ హార్మోన్లు ఉత్పత్తి కావడానికి కొబ్బరి నూనె కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

వెజిటబుల్ ఆయిల్స్..

మన శరీరంలో కొవ్వుల పాత్ర చాలానే ఉంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, వివిధ కణాలు తిరిగి నిర్మితమవడానికి కొవ్వులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలో వెజిటబుల్ ఆయిల్స్‌లో పాలీశ్యాచురేటెడ్ కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి వంటకాల్లో ఈ నూనెల్ని వాడటం మంచిది.

టాక్సిన్స్‌కి దూరంగా..

ఇంట్లో వివిధ వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలు, క్రిమి సంహారక మందులు, ప్లాస్టిక్ మొదలైన వాటిలో విష పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని ఉపయోగించకపోవడమే ఉత్తమం.

కాఫీ..

అలవాటైందనో లేక ఇష్టమనో కొందరు పదే పదే కాఫీ తాగుతుంటారు. కానీ కాఫీ ఎక్కువగా తాగకూడదు. ప్రత్యేకించి గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే కొన్ని సందర్భాల్లో అది ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపించే ప్రమాదమూ లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్