కష్టాలే... పాఠాలుగా!

వాళ్లెవరూ ఎంబీఏలు చదివి వ్యాపారంలో అడుగుపెట్టిన వాళ్లు కాదు. అనుభవాలనే పాఠాలుగా మార్చుకున్నావాళ్లు. సవాళ్లతోనే మెలకువలు నేర్చుకున్న ఈ గిరిజన బిడ్డలు శానిటరీ న్యాప్కిన్ల తయారీలో రాణిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ మహిళలు సాధించిన విజయమిది.

Published : 29 Jun 2024 02:17 IST

వాళ్లెవరూ ఎంబీఏలు చదివి వ్యాపారంలో అడుగుపెట్టిన వాళ్లు కాదు. అనుభవాలనే పాఠాలుగా మార్చుకున్నావాళ్లు. సవాళ్లతోనే మెలకువలు నేర్చుకున్న ఈ గిరిజన బిడ్డలు శానిటరీ న్యాప్కిన్ల తయారీలో రాణిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ మహిళలు సాధించిన విజయమిది..

ఆ రోజు కూలి పని దొరికితే సరే సరి. లేదంటే ఆకలితో ఉండాల్సిందే! అలాంటి పరిస్థితి నుంచి మార్కెటింగ్‌ మెలకువలతో వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కించే స్థాయికి ఆదివాసీ మహిళలు వెళ్లారంటే గొప్పవిషయమేగా! లలిత, వెంకటలక్ష్మి, మంగా వీణ, సమ్మక్క, సుక్కమ్మ వంటివారంతా పరిశ్రమలోకి రాకముందు రోజువారీ కూలీలుగా ఉండేవారు. ఏజెన్సీ ప్రాంతంలో తగిన ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వీళ్ల జీవితాల్లో మార్పు రావాలని 2016లో ఐటీడీఏ అధికారులు శానిటరీ న్యాప్కిన్ల  తయారీ పరిశ్రమను నెలకొల్పారు. అనుభవలేమి, నష్టాలతో ఆ ప్రయత్నం విఫలమైంది. దాంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రెండో ప్రయత్నం చేశారు. హైదరాబాద్, ముంబయి, దిల్లీ తదితర ప్రాంతాల్లో నాప్కిన్స్‌ తయారీ ఎలా ఉంటుందో అధ్యయనం చేయించారు. శిక్షణ ఇప్పించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం వచ్చాక 2018లో ఆధునిక మెషినరీని సమకూర్చారు.

ప్రభుత్వ రాయితీ, బ్యాంకు రుణంతో ఆదివాసీ మహిళలూ తాము దాచుకున్న సొమ్ముని పెట్టుబడిగా పెట్టారు. అలా 2020 నుంచి న్యాప్కిన్ల ఉత్పత్తి మొదలైంది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సాయంతో మార్కెటింగ్‌పైనా పట్టుసాధించారు. మొదట్లో ఆశ్రమ పాఠశాలలకు ఈ న్యాప్కిన్లను సరఫరా చేసేవారు. ఆ తరవాత కళాశాలలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు వెళ్లి స్వయంగా మార్కెటింగ్‌ చేసుకున్నారు. నెమ్మదిగా వీరి ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. అలా నెలకు 60 వేల వరకూ న్యాప్కిన్స్‌ తయారుచేసేవారు. అంతా బాగుందనుకుంటే కొవిడ్‌ ముంచుకొచ్చింది. ఆర్డర్లు లేవు. పరిస్థితి మొదటికొచ్చింది. ఆ స్థితి నుంచి కోలుకోవడానికి సమయం పట్టినా... నాణ్యతలో రాజీపడకుండా తిరిగి ఆర్డర్లు సంపాదించారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌ జిల్లాల్లోని విద్యాసంస్థలకు తమ ఉత్పత్తులను అందిస్తున్నారు. ఒక్కో మహిళా నెలకు సుమారు రూ.10-15వేల వరకు సంపాదిస్తున్నారు. వీరిని చూసి మరికొందరూ చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

లింగయ్య ఉప్పుల, ఈటీవీ, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్