అమ్మపాటతో జోల పాడింది!

అమ్మప్రేమ అసామాన్యం... అపురూపం.. ఆ అనంతమైన మాతృత్వపు మధురిమల్ని ఎంతని వెలకట్టగలం.. ఏమని వర్ణించగలం! అవును... ఎంత గొప్పగా చెప్పినా ఏదో వెలితిగానే ఉంటుంది. అందుకే, అమ్మ పాట ఏదైనా మనసుని హత్తుకుంటుంది. తల్లి ఒడిలోని వెచ్చదనపు అనుభూతిని పంచుతుంది.

Updated : 20 Jun 2024 14:49 IST

రేపు మ్యూజిక్‌ డే

అమ్మప్రేమ అసామాన్యం... అపురూపం.. ఆ అనంతమైన మాతృత్వపు మధురిమల్ని ఎంతని వెలకట్టగలం.. ఏమని వర్ణించగలం! అవును... ఎంత గొప్పగా చెప్పినా ఏదో వెలితిగానే ఉంటుంది. అందుకే, అమ్మ పాట ఏదైనా మనసుని హత్తుకుంటుంది. తల్లి ఒడిలోని వెచ్చదనపు అనుభూతిని పంచుతుంది. అలా తాజాగా తెలుగు రాని అమ్మాయి తేనెలొలికిస్తూ పాడిన ‘అమ్మపాడే జోలపాట...అమృతంకంటే తియ్యనంట’ పాట సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఆ గాయని ముంబయికి చెందిన జాహ్నవి ఎర్రం.

వకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు... వాటిని మనమే సృష్టించుకోగలగాలి. అప్పుడే మనం కోరుకున్న జీవితం సొంతమవుతుంది. అందుకు నేనే ఉదాహరణ. మాది ముంబయి. నాన్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్, అమ్మ గృహిణి. చిన్నప్పుడే సినిమాల్లో నేపథ్య గాయనిగా స్థిరపడాలన్న కోరిక బలపడింది. అదే సంగీతంపై ఆసక్తిని పెంచింది. అమ్మానాన్నలూ నా అభిరుచిని గుర్తించి ప్రఖ్యాత గాయకులు గులామ్‌ ముస్తఫా ఖాన్‌ సాబ్‌ వద్ద సంగీత శిక్షణకోసం చేర్చారు. సోనూనిగమ్, హరిహరన్‌లాంటివారంతా ఈయన శిష్యులే. ఇక్కడే హిందుస్థానీ సంగీతంపై పట్టు సాధించడానికి సాధన చేస్తున్నా. మరోపక్క ఎప్పటికప్పుడు నేను పాడే పాటల్ని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాముల్లో పెడుతుంటా. అలా ఓసారి సురేందర్‌ మిట్టపల్లి పాటల్ని విన్నా. మనసుకి నచ్చడంతో సరదాగా ట్రై చేసి... ఆయనకి ఇన్‌స్టాలో ఆడియో క్లిప్‌ పంపించా. అది చూసి నన్ను సంప్రదించారు. నెలరోజుల పాటు రకరకాల తెలుగుపాటల్ని పాడించారు. చివరికి ఆయన ఇరవై ఏళ్ల క్రితం రాసుకున్న అమ్మ పాటను పాడే అవకాశం నాకు వచ్చింది. నాకు తెలుగు రాదు కాబట్టి... ప్రతి పదానికీ అర్థాన్ని వివరించేవారు. నేను పూర్తిగా పల్లవి, చరణాలపై పట్టు సాధించాక... అసలు పాటని రికార్డు చేశారు. ఇదే నా మొదటి కమర్షియల్‌ పాట. పెద్దగా అంచనాలేవీ లేకుండానే 2024 మే 5న ఇది విడుదలైంది. అప్పటికి ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తోంది. ఆ సమయంలోనూ 25 రోజుల్లో కోటికిపైగా వ్యూస్‌ని సంపాదించుకోగలిగింది మా సాంగ్‌. ప్రస్తుతం ఈ సంఖ్య రెండుకోట్ల పైచిలుకే. అంతేకాదు ఈ ఏడాది తాజా మ్యూజిక్‌ వీడియోల్లో టాప్‌ 10 స్థానాల్లో నిలబడగలిగింది. ఇదెంతగా వైరల్‌ అయ్యిందంటే... ఓరోజు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని ఉన్నా. ఓ తల్లీ కొడుకులు ముందున్న నన్ను గమనించకుండా మొబైల్‌లో వీడియో చూస్తూ దీని గొప్పతనం గురించి మాట్లాడుతుంటే భలే సంతోషంగా అనిపించింది. చాలామంది తెలుగు రాని నువ్వు అంత బాగా ఎలా పాడగలిగావు అని అడుగుతున్నారు. అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని అనుభవించానికి భాషతో సంబంధం ఏముంటుంది చెప్పండి. ఈ హిట్‌తో తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ పాట రిలీజ్‌ అయ్యింది. ఈ గుర్తింపు నేపథ్యగాయనిగా నాకు కొన్ని అవకాశాలనూ తెచ్చిపెట్టింది. నా కుటుంబమూ ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సరే, నిరాశపడకుండా సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ ఉండదు.

సతీష్‌ దండవేణి, హైదరాబాద్‌ 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్