Tanvi Deore: కవలల తల్లి.. ‘ఇంగ్లిష్‌ ఛానల్‌’ని ఈదేసింది!

చుట్టూ శీతల వాతావరణం.. చర్మానికి తగలగానే రోమాలు నిక్కబొడుచుకొచ్చే చల్లటి నీళ్లు.. ఆ నీటిలో నిరంతరం తేలియాడే జెల్లీ ఫిష్‌లు.. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులుండే ఇంగ్లిష్‌ ఛానల్‌ని ఈదడమంటే మాటలు కాదు.. కానీ చేతల్లో ఈ సాహసం చేసి చూపించింది మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన తన్వీ చవాన్.

Published : 04 Jul 2024 12:16 IST

(Photos: Instagram)

చుట్టూ శీతల వాతావరణం.. చర్మానికి తగలగానే రోమాలు నిక్కబొడుచుకొచ్చే చల్లటి నీళ్లు.. ఆ నీటిలో నిరంతరం తేలియాడే జెల్లీ ఫిష్‌లు.. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులుండే ఇంగ్లిష్‌ ఛానల్‌ని ఈదడమంటే మాటలు కాదు.. కానీ చేతల్లో ఈ సాహసం చేసి చూపించింది మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన తన్వీ చవాన్. కవల పిల్లలకు తల్లైన ఆమె.. 42 కిలోమీటర్ల పొడవైన ఈ ఛానల్‌ను ఇటీవలే ఈదింది.. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మాతృమూర్తిగా చరిత్రకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ సూపర్ మామ్‌ సక్సెస్‌ స్టోరీ మీకోసం..!

పెళ్లి, పిల్లలు.. ఈ బాధ్యతల్లో పడిపోయి చాలామంది మహిళలు తమ అభిరుచుల్ని పక్కన పెట్టేస్తుంటారు. ఒకానొక సమయంలో తన్విది కూడా ఇలాంటి పరిస్థితే! ఇంగ్లిష్‌ ఛానల్‌ని ఈదాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె.. పలు వ్యక్తిగత బాధ్యతల రీత్యా ఇన్నాళ్లూ తన కలను పక్కన పెట్టేసింది. కానీ కాస్త ఆలస్యంగానైనా ఇటీవలే తన తపనను నెరవేర్చుకున్న ఆమె.. తన కల నెరవేరిందంటూ సంబరపడిపోతోంది.

చిన్ననాటి కల!

‘ఇంగ్లిష్‌ ఛానల్‌ సాహసయాత్ర గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి తెలుసుకున్నా. అప్పుడే అనిపించింది.. నేనూ ఈ సాహసం చేయాలని! కానీ అప్పుడు చదువు, ఆపై పెళ్లి, పిల్లల బాధ్యతలతో దాన్ని పక్కన పెట్టేశా. అయితే గత కొన్నేళ్లుగా ఈ బాధ్యతల నుంచి క్రమంగా నాకు కాస్త విశ్రాంతి దొరకడంతో తిరిగి స్విమ్మింగ్‌పై దృష్టి పెట్టా. మా వారు విప్లవ్‌ నన్నెంతో ప్రోత్సహించారు. ఇదే సమయంలో మా ఇంట్లో వాళ్లను ఒప్పించడం కూడా కాస్త కష్టమే అయింది.. ఏదేమైనా నా చిన్ననాటి కలను నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది..’ అంటోంది తన్వీ. జూన్ 29న 17:42 గంటల వ్యవధిలో 42 కిలోమీటర్లు ఈత కొట్టి ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదేసిందామె. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మాతృమూర్తిగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం తన్వికి ఐదేళ్లున్న ఇద్దరు కవల పిల్లలున్నారు.

అదో పెద్ద సవాలు!

ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదడమంటే పెద్ద సవాలంటోన్న తన్వీ.. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికే రోజుకు 6 గంటలు ఈత సాధన చేశానంటోంది.

‘నా ఫ్రెండ్స్‌లో చాలామందికి పెళ్లై, పిల్లలున్నారు. అలాగని వాళ్లు తమ తపన, అభిరుచులు పక్కన పెట్టలేదు. వీలు కుదుర్చుకొని, బాధ్యతల నుంచి కాస్త విరామం దొరికినప్పుడల్లా వాటిపై దృష్టి పెట్టేవారు. నేనూ వారి నుంచే స్ఫూర్తి పొందా. ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదాలన్న సంకల్పంతో రోజుకు 4-6 గంటల పాటు సాధన చేశా. పర్వతారోహకులకు ఎవరెస్ట్‌ ఎక్కడం ఎంత పెద్ద సవాలో.. స్విమ్మర్లకు ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదడం అంతటి సవాలు! ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌లను విడదీసే ఈ జలసంధి అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కూడుకున్నది! ఇక్కడ వాతావరణం ఎప్పుడూ 15 డిగ్రీలకు మించదు. చల్లటి నీళ్లు, ఈ నీటిలో ఉండే జెల్లీ ఫిష్‌లు ఈతకొట్టే వారికి సవాలు విసురుతుంటాయి. నేనూ జెల్లీ ఫిష్‌ల బారిన పడ్డాను. అయినా ధైర్యంగా ముందుకు సాగాను. ఇక ఇక్కడి శీతల వాతావరణ పరిస్థితులు తట్టుకునేందుకు తరచూ ఐస్‌ నీళ్లతో స్నానం చేయడం, ధ్యానం, యోగా.. వంటివి లక్ష్యాన్ని చేరేందుకు నాకు సహకరించాయి..’ అంటోంది తన్వీ.

అమ్మతనం అడ్డుకాదు!

ఐదేళ్ల కవల చిన్నారులకు తల్లైన తన్వీ.. పట్టుదల, అంకితభావం ఉంటే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అమ్మతనం అడ్డు కానే కాదంటోంది.

‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా వివిధ లక్ష్యాలుంటాయి. ఒక దాంతో మరొకటి ముడిపెడితే ఏదీ సాధించలేం. అందుకే రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో క్రమశిక్షణతో లక్ష్యంపై దృష్టి సారిస్తే తప్పకుండా మన కల నెరవేరుతుంది..’ అంటోన్న తన్వీ.. గతంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పాల్గొని పలు పతకాలూ నెగ్గింది. స్వతహాగా ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే ఆమె.. అందరికీ దీన్ని చేరువ చేయాలన్న ముఖ్యోద్దేశంతో నాసిక్‌లో ‘Viveda’ పేరుతో ఓ వెల్‌నెస్‌ రిసార్ట్‌ నడుపుతోంది. ఈ వేదికగా మసాజ్‌ థెరపీలు, డీటాక్సిఫికేషన్‌ చికిత్సలు, స్పా ట్రీట్‌మెంట్లు, యోగా తరగతులు.. వంటివెన్నో నిర్వహిస్తోందీ మామ్‌ స్విమ్మర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్