పరిమళాలు... రూ.కోట్లు వెదజల్లుతున్నాయి!

పరిమళం... మనసును సేదతీరుస్తూ మరో లోకంలో విహరింపజేస్తుంది. అయితే ఇది ఒకప్పటి సంగతి... ఇప్పుడు ఆ పరిమళం... మనది అని తెలిసేలా ఉండాలి అని కోరుకుంటోంది నేటితరం. అందుకే ప్రస్తుతం ‘పర్సనలైజ్‌డ్‌ పర్‌ఫ్యూమ్‌’ ట్రెండ్‌ పెరుగుతోంది.

Updated : 04 Jul 2024 06:42 IST

పరిమళం... మనసును సేదతీరుస్తూ మరో లోకంలో విహరింపజేస్తుంది. అయితే ఇది ఒకప్పటి సంగతి... ఇప్పుడు ఆ పరిమళం... మనది అని తెలిసేలా ఉండాలి అని కోరుకుంటోంది నేటితరం. అందుకే ప్రస్తుతం ‘పర్సనలైజ్‌డ్‌ పర్‌ఫ్యూమ్‌’ ట్రెండ్‌ పెరుగుతోంది. దాన్నే వ్యాపారసూత్రంగా మలుచుకుని కుటుంబ వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు విదుషీ విజయ్‌వర్గియా, శీతల్‌ దేశాయ్‌లు.


పర్‌ఫ్యూమ్‌ కిట్లతో...

ఒకరు తయారుచేసిన పర్‌ఫ్యూమ్‌ వాడడం కాదు. మనకు నచ్చిన పరిమళాన్ని మనమే తయారుచేసుకుంటే... ఈ ఆలోచనే ‘ఇసాక్‌ ఫ్రాగ్రెన్సెస్‌’ ఫౌండర్‌ విదుషీ విజయ్‌ వర్గియాను ‘ల్యాబ్‌ ఇన్‌ ఏ బాక్స్‌’ పేరుతో కిట్‌ను అందుబాటులోకి తెచ్చేలా చేసింది. ఈ కిట్‌ సాయంతో ఇంట్లోనే 20రకాల సెంట్లు తయారుచేసుకోవచ్చు. అందులోనే కావాల్సిన ఎసెన్షియల్‌ ఆయిల్స్, పరిమళ వనరులు, పరికరాలు, డైల్యూషన్‌ మెటీరియళ్లు... వంటి 12రకాల తయారీపదార్థాలు, ల్యాబ్‌ నోట్స్, ఫార్ములా షీట్లూ... వంటివన్నీ ఉంటాయి. ఎలా చేయాలన్నది అందులో వివరంగా సూచిస్తారు. దాంతో మన సృజనాత్మకతకు పదునుపెట్టడమే.

విదుషీది లఖ్‌నవూ. ఐఐఎమ్‌లో లగ్జరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన విదుషీ ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో అరోమాథెరపీ కోర్సు చేసింది. మొదట వేరే వెంచర్‌ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత అనుకోకుండా కుటుంబ వ్యాపారమైన పర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. వాళ్ల కుటుంబం సుమారు 170ఏళ్ల నుంచీ ఈ వ్యాపారంలో ఉంది. ‘‘పర్సనలైజేషన్‌ చేయించుకోవడం అంటే ఒకప్పుడు ఓ విలాసం. ఎందుకంటే దాని తయారీకి చాలా సమయం పట్టడంతోపాటు ఖర్చుకూడా ఎక్కువే. రాజులు మాత్రమే అలా చేయించుకునేవారు. ఆ పద్ధతిని అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నా. కొవిడ్‌ సమయంలో అయితే రిటైల్‌ సెక్టార్‌ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులోనూ పర్‌ఫ్యూమ్‌లంటేనే వాసన చూడాల్సినవి. అందుకే ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా ఎవరికి వాళ్లే సొంతంగా తయారుచేసుకునేలా ‘ల్యాబ్‌ ఇన్‌ బాక్స్‌ కిట్’ లను అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అంటోంది విదుషీ. తన ఉత్పత్తులపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ తరచూ తీసుకుంటూ వాటిని మరింత మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్, లండన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా..వంటి ఎన్నో దేశాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. తాజాగా షార్క్‌ట్యాంక్‌ ఇండియా నుంచి రూ.50లక్షల పెట్టుబడినీ పొందింది విదుషీ.


నచ్చిన లేయర్‌ వేసుకునేలా...

మన వార్డ్‌రోబ్‌లో దుస్తులు ఎలా ఎంపిక చేసుకుంటామో... అలానే మనకు నప్పే పరిమళాలనూ ఎంచుకోవాలంటారు ముంబయికి చెందిన శీతల్‌ దేశాయ్‌. అమెరికాలో విజయవంతంగా సాగుతోన్న తన కెరియర్‌ను వదిలేసి కుటుంబ వ్యాపారమైన పరిమళాల తయారీలోకి అడుగుపెట్టారు. శీతల్‌కు 25ఏళ్లకు పైగా ఈ రంగంలో అనుభవముంది. ఈక్రమంలో తన మానసపుత్రిక అయిన ‘విజ్‌డమ్‌ (ఎస్‌డీ)’ లగ్జరీ పర్‌ఫ్యూమ్‌ ఉత్పత్తుల సంస్థను 2018లో స్థాపించారీమె. ‘ఆర్ట్‌ ఆఫ్‌ లేయరింగ్‌’ పేరుతో మనకు నచ్చిన పరిమళాన్ని మనమే సిద్ధం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రోజ్, ఆపిల్, శాఫ్రన్, వెనీలా, మస్క్, పెప్పర్, గ్రేప్‌ఫ్రూట్‌... వంటి రకరకాల పరిమళాలను మనకు నచ్చినట్లుగా బ్లెండ్‌ చేసుకునేందుకు మూడింటిని కలిపి ఓ సెట్‌లా అందిస్తున్నారు. సందర్భానికి తగినట్లు ఈ మూడింటినీ మిక్స్‌ చేసుకుని మనకు నచ్చే పరిమళాన్ని మనమే తయారుచేసుకోవచ్చు. పైగా ఒకేసారి పెద్దవి తీసుకుంటే వృథా అయిపోతాయేమో అన్న భయం లేకుండా 10ఎమ్‌ఎల్‌ పరిమాణంలోనూ అందుబాటులోకి తెచ్చారు. ఇదే కాన్సెప్ట్‌తో ఇంటికి అవసరమయ్యే కొవ్వొత్తులూ, డిఫ్యూజర్లూ, రూమ్‌ స్ప్రేలతోపాటు ఇన్‌స్టిట్యూషనల్‌ ఉత్పత్తులనూ అందిస్తున్నారు. అంతర్జాతీయంగానూ వ్యాపారాన్ని విస్తరించారు. అంతేకాదు, సీఓఎఫ్‌వీఐ (కాలేజ్‌ ఆఫ్‌ ఫ్రాగ్రెన్సెస్‌ ఫర్‌ ది విజువల్లీ ఇంపెయిర్డ్‌)ను ప్రారంభించి, అంధులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత వారికి ఫ్రాగ్రెన్సెస్‌ ఇండస్ట్రీలోనూ, దాని అనుబంధరంగాల్లోనూ ఉపాధి అవకాశాలూ కల్పిస్తున్నారు శీతల్‌. ఫ్రాగ్రెన్సెస్‌ ఇండస్ట్రీలో తన ఇన్నొవేషన్‌కు గానూ తాజాగా ఇన్‌స్పైరింగ్‌ లీడర్‌గా ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డునీ అందుకున్నారు శీతల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్