Radhika-Anant: అంబానీ వారి పెళ్లి శుభలేఖ.. అదుర్స్!

‘ఊరంతా చెప్పుకొనే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి!’ అన్నట్లుగా ఊరంతా, దేశమంతానే కాదు.. ప్రపంచమంతా మాట్లాడుకునేంత అంగరంగ వైభవంగా జరుగుతోంది అంబానీ వారింట వివాహం. అనంత్‌ అంబానీ - రాధికా మర్చంట్‌ నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటోంది.

Published : 28 Jun 2024 12:37 IST

(Photos: Twitter)

‘ఊరంతా చెప్పుకొనే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి!’ అన్నట్లుగా ఊరంతా, దేశమంతానే కాదు.. ప్రపంచమంతా మాట్లాడుకునేంత అంగరంగ వైభవంగా జరుగుతోంది అంబానీ వారింట వివాహం. అనంత్‌ అంబానీ - రాధికా మర్చంట్‌ నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇక తాజాగా ఈ జంట వివాహ ఆహ్వాన పత్రిక కూడా ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచింది. బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో, దేవాలయ నమూనాలో ఈ వెడ్డింగ్‌ కార్డుని తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ఏమాత్రం తీసిపోకుండా తయారుచేసిన ఈ లగ్న పత్రిక.. చూపరులను అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

అంబానీ వారింట పెళ్లంటే ఎలా ఉంటుందో ఇప్పటికే రెండుసార్లు చూశాం. ఈషా-అనంత్‌, ఆకాశ్‌-శ్లోక వివాహాలే ఇందుకు ఉదాహరణ! ఇక ఇప్పుడు అనంత్‌-రాధికల పెళ్లి అంతకుమించి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు అంబానీ దంపతులు. గతేడాది జరిగిన వీళ్లిద్దరి నిశ్చితార్థం మొదలు.. గుజరాత్‌ జామ్‌నగర్‌లో జరిగిన తొలి ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు, ఇటీవలే యూరప్‌లోని లగ్జరీ షిప్‌లో నిర్వహించిన రెండో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు.. యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించాయి. ఇక జులైలో జరగనున్న ఈ జంట వివాహం కోసం తాజాగా ఆహ్వాన పత్రిక కూడా సిద్ధమైంది. ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న ఈ లగ్న పత్రికను కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. రాజసం ఉట్టిపడేలా రూపొందించారు.

దేవాలయ నమూనాలో!

ఎరుపు రంగులో ఓ చిన్న సైజు వార్డ్‌రోబ్‌ని పోలి ఉన్న ఈ శుభలేఖ తెరవగానే.. అందులో వెండితో రూపొందించిన ఓ చిన్న దేవాలయం మాదిరిగా కనిపిస్తుంది. ఈ గుడికి నలువైపులా బంగారు తాపడంతో తయారుచేసిన గణపతి, రాధాకృష్ణులు, దుర్గామాత.. వంటి దేవతామూర్తుల విగ్రహాలు పొందుపరిచారు. ఇక ఇదే వార్డ్‌రోబ్‌లో వివిధ రకాల పెళ్లి వేడుకలకు అతిథుల్ని ఆహ్వానించడానికి వేర్వేరు పత్రికల్ని తయారుచేయించారు. వీటిలో ముఖ్యమైన వివాహ ఆహ్వాన పత్రికను ప్రాచీన ఆలయ ప్రాకారం నమూనాలో వెండితో డిజైన్‌ చేశారు. దీని లోపల లగ్న పత్రికతో పాటు దేవతామూర్తుల ప్రతిరూపాల్ని అందంగా డిజైన్‌ చేయించారు. ఇక మరో ఇన్విటేషన్‌ను బాక్స్‌ తరహాలో రూపొందించి.. అందులో విష్ణువు, ఇతర దేవతామూర్తుల ప్రతిరూపాల్ని చెక్కినట్లుగా తయారుచేశారు. బాక్స్‌ తరహాలోనే రూపొందించిన మరో ఆహ్వాన పత్రికలో ‘A-R’ అనే అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్‌, బ్లూ కలర్‌ శాలువా, గిఫ్ట్‌లతో కూడిన వెండి బాక్స్‌.. వంటివన్నీ అమర్చారు. ఇక ఈ పత్రికలన్నింటికీ బ్యాక్‌డ్రాప్‌గా భక్తి గీతాలు/శ్లోకాల్ని జత చేయడం విశేషం.

చాట్‌ తిని.. షాపింగ్‌ చేసి!

అబ్బురపరిచేలా ఉన్న ఈ లగ్న పత్రిక వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘అద్భుతంగా ఉందం’టూ కొందరు స్పందిస్తే.. మరికొందరు ‘ఈ ఒక్క కార్డు ధర తమ పెళ్లి ఖర్చుతో సమానం!’ అంటూ సరదాగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇక ఇటీవలే నీతా అంబానీ.. రాధిక-అనంత్‌ల వివాహ ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథుని పాదాల వద్ద ఉంచి ఆ శివుడి ఆశీస్సులు తీసుకున్నారు. కొత్త జంటను ఆశీర్వదించమని ఆ భగవంతుడిని కోరారు.

‘పెళ్లి వేడుకల్లో భాగంగా తొలి ఆహ్వాన పత్రికను ఆ భగవంతుడికి సమర్పించడం మన సంప్రదాయం. నేనూ అనంత్‌-రాధికల పెళ్లి పత్రికను కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద అర్పించాను.. ఆ పరమ శివుడి ఆశీర్వాదం కోరాను..’ అంటూ చెప్పుకొచ్చారామె. ఆపై అక్కడి ఓ చాట్‌ దుకాణానికి వెళ్లి.. పాలక్‌ చాట్‌ని కూడా రుచి చూశారు నీతా. ఆలూ చాట్‌ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. అంతేకాదు.. వారణాసిలోని ఓ పట్టుచీరల దుకాణంలో చీరల షాపింగ్‌ కూడా చేశారీ బిజినెస్‌ లేడీ. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

మూడు రోజుల పెళ్లి!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధిక-అనంత్‌ల వివాహ ఘడియలు దగ్గర పడుతున్నాయి. జులై 12 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్‌.. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, జులై 14న ‘మంగళ్‌ ఉత్సవ్‌’తో ముగుస్తాయి. ఇప్పటివరకు ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి వేడుకా ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. గత ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో.. సందర్భానికి తగినట్లుగా తనదైన ఫ్యాషనబుల్‌/ట్రెడిషనల్‌ దుస్తుల్లో మెరిసిపోయిన రాధిక.. పెళ్లిలో ఎలా ముస్తాబవుతుందో చూడాలన్న ఆతృత చాలామందిలో ఉంది. ఇందుకోసం జులై 12 దాకా ఆగాల్సిందే మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్