కురులు వేగంగా పెరగాలా?

పట్టుకుచ్చులా అందంగా, పొడవుగా ఉండే కురులు... కోరుకోని అమ్మాయి ఉంటుందా? కానీ ఈ కాలుష్యానికి ఊడటమే కానీ పెరగడం ఎక్కడుంది! ఈ చిన్ని చిట్కాలను పాటించండి. వేగంగా పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా?

Published : 22 Jun 2024 05:02 IST

పట్టుకుచ్చులా అందంగా, పొడవుగా ఉండే కురులు... కోరుకోని అమ్మాయి ఉంటుందా? కానీ ఈ కాలుష్యానికి ఊడటమే కానీ పెరగడం ఎక్కడుంది! ఈ చిన్ని చిట్కాలను పాటించండి. వేగంగా పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా?

  • తల ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ దాన్ని శుభ్రం చేయడం తప్పనిసరి. కానీ ఆరబెట్టడమే పెద్ద పని. అందుకే చాలామంది డ్రైయ్యర్‌ని వాడుతుంటారు. కానీ దాని వేడి కురుల పెరుగుదలను అడ్డుకుంటుందని తెలుసా? స్టైలింగ్, స్ట్రెయిట్‌నింగ్‌ కోసం వాడేవే కాదు... ఎండలో అతిగా తిరగడం, జడను లాగివేయడం, తువాలుతో తడిపోవాలని కొట్టడం వంటివీ చేటు చేసేవే. వీటికి దూరంగా ఉండండి.
  • కండిషనర్‌ వెంట్రుకలకు బాగా పడుతుంది, ఇప్పుడైతే చిక్కులు బాగా వస్తాయి... అని తడి తలమీద దువ్వెన ఉపయోగిస్తున్నారా? మేలు చేయడం మాట అటుంచితే కుదుళ్లకు హాని. ఫలితమే కురులు రాలడం. కాబట్టి, తడి వెంట్రుకలు ఆరేవరకూ ఆగండి. తరవాతే దువ్వండి.
  • ఒకప్పుడు సమస్యేదైనా నిపుణులను సంప్రదించేవారు. మరి ఇప్పుడు? అరచేతిలోనే సమాచారం. దాని సలహాతో ఇష్టారీతిన సప్లిమెంట్లను వాడేస్తున్నారు. మీదీ అదే ధోరణా? ఇవి మేలు చేయకపోగా చేటు చేస్తాయి. వాటి ప్రభావం తొలుత పడేది చర్మం, కురులపైనే! నిపుణుల సలహా లేనిదే వాడకపోవడమే మేలు.
  • త్వరగా పెరగవు అని చాలామంది కురులను కత్తిరించడానికి వెనకాడతారు. కానీ రెండు నెలలకోసారైనా ట్రిమ్‌ చేసుకోవాలి. చిట్లడం, చివర్లు పొడిబారడం కూడా కురుల పెరుగుదలకు అవరోధంగా మారతాయి. కాబట్టి, వాటిని తొలగించడం తప్పనిసరి.
  • జిడ్డు, సమయం లేదని బద్ధకించక వారానికి రెండుసార్లు గోరువెచ్చని నూనెతో తలకు మర్దనా చేయండి. మాడుకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే కండిషనర్‌ వాడకం కూడా తప్పనిసరి. ఇది వాతావరణ పరిస్థితుల నుంచి కురులను సంరక్షిస్తుంది.
  • దిండు కూడా కేశాల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని తెలుసా? సరైన గలేబులను వాడకపోతే అవి కురుల్లోని సహజ నూనెలను పీల్చేయడమే కాదు, రాపిడికి గురిచేసి వెంట్రుకలు తెగేలానూ చేయగలవు. కాబట్టి, శాటిన్‌ రకాలనే ఎంచుకోండి. చిన్నవే కదూ... అందమైన, ఆరోగ్యకరమైన కురుల కోసం పాటించండి మరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్