అందుకే అబ్బాయిలా మారి...!

‘ఎక్స్‌ప్లోజివ్‌ ఓపెనర్‌.... లేడీ సెహ్వాగ్‌...’  అంటూ క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకొనే  టీనేజీ సంచలనం షెఫాలీ వర్మ!  15 ఏళ్ల వయసు నుంచే మహిళా క్రికెట్‌లో రికార్డుల మోతమోగిస్తూ ‘శెభాష్‌ షెఫాలీ’ అనిపించుకుంటోందీ అమ్మాయి.

Published : 30 Jun 2024 02:19 IST

‘ఎక్స్‌ప్లోజివ్‌ ఓపెనర్‌.... లేడీ సెహ్వాగ్‌...’  అంటూ క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకొనే  టీనేజీ సంచలనం షెఫాలీ వర్మ!  15 ఏళ్ల వయసు నుంచే మహిళా క్రికెట్‌లో రికార్డుల మోతమోగిస్తూ ‘శెభాష్‌ షెఫాలీ’ అనిపించుకుంటోందీ అమ్మాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న  టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన షెఫాలీ గురించిన కొన్ని ముచ్చట్లు...

చిన్‌ ఆడుతున్న ఆఖరి రంజీమ్యాచ్‌ అది. దాంతో ఆ మ్యాచ్‌ జరుగుతున్న చౌదరీ బన్సీలాల్‌ క్రికెట్‌ స్టేడియం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. హరియాణాలో ఉందీ స్టేడియం. బయట టిక్కెట్‌ కోసం ఎదురుచూస్తున్న వేలమందిలో ఎనిమిదేళ్ల సీమ టపాకాయ పిల్ల కూడా ఉంది. పేరు షెఫాలీ. నాన్న సంజీవ్‌ వర్మ, అన్నయ్య రాహుల్‌తో కలిసి అక్కడకు వచ్చింది. వాళ్ల కుటుంబం మొత్తం క్రికెట్‌ అంటే ప్రాణం పెడతారు. ఎలాగోలా స్టేడియంలో అడుగుపెట్టిన షెఫాలీకి సచిన్‌ ఆటతీరు ఓపక్క... అతనికి జేజేలు పలికే అభిమానులు మరోపక్క. ఆ దృశ్యం మనసులో నిలిచిపోయింది. అప్పటికే టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ నేర్చుకుంటున్న ఆ అమ్మాయి భవిష్యత్తులో సచిన్‌ స్థాయికి వెళ్లాలని మనసులో బలంగా ఫిక్స్‌ అయిపోయింది. ఆ మాటే వాళ్ల నాన్నతో అంటే ‘సాధన చేస్తే అదేమంత కష్టం కాదులే’ అని ప్రోత్సహించాడు. సచిన్‌ అక్కడున్నన్ని రోజులూ అతనుండే గెస్ట్‌హౌస్‌కి వెళ్లి ఎప్పుడైనా బయటకు వస్తాడేమో అని ఆశగా ఎదురుచూసేది షెఫాలీ. ఆ కల అప్పటికి నెరవేరలేదు కానీ... క్రికెట్‌ సాధన మాత్రం మొదలుపెట్టేసింది. 

జుట్టు కత్తిరించుకుని...

ఆమె స్వస్థలం హరియాణలోని రోహ్‌తక్‌ దగ్గరున్న లాహ్లీ. షెఫాలీ తొలిగురువు వాళ్ల నాన్న సంజీవ్‌వర్మనే. బేసిక్స్‌ ఆయన దగ్గరే నేర్చుకుంది. అతనో నగల వ్యాపారి. అంతకుమించి క్రికెట్‌ ప్రేమికుడు. కొడుక్కి క్రికెట్‌ నేర్పుతూ కూతుర్నీ గ్రౌండ్‌కి వెంటపెట్టుకుని వెళ్లేవాడు. అలా అన్నయ్య, తండ్రితో కలిసి సాధన చేసేది. ఆమె కొట్టే ప్రతి సిక్స్‌కి ఐదు రూపాయల బహుమతిగా ఇచ్చేవాడు తండ్రి. ఎప్పుడైనా మిగతా పిల్లలతో కలిసి ఆడిద్దాం అనుకుంటే ‘ఆడపిల్లతో మేం ఆడం’ అని వాళ్లు నిర్మొహమాటంగానే చెప్పేవారు. ఈ మాటలు షెఫాలీని బాగా బాధించాయి. అంతేనా... స్థానిక రోహ్‌తక్‌ అకాడమీ కూడా ఆడపిల్లని చేర్చుకోం అనేసింది. దాంతో జుట్టు కత్తిరించుకుని అచ్చంగా అబ్బాయిలా మారింది షెఫాలీ. చివరికి రామ్‌నారాయణ్‌ క్రికెట్‌ క్లబ్‌ షెఫాలీకి క్రికెట్‌లో శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకొంది. పోనీలే అని కాదు.. ఆ వయసులో ఆమె ప్రతిభను చూసే ఆ అవకాశం ఇచ్చింది. తనో అమ్మాయిని అని భావించకుండా అబ్బాయిలతోనే కలిసి ఆడేది. గాయాల్ని లెక్క చేసేది కాదు. రోజుకి 16 కి.మీ.లు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లేది. ఇంట్లో మాత్రం ఇదేంటి ఆడపిల్లని ఇలాగేనా పెంచడం అంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచారు. అయినా వాళ్లు లెక్కచేయలేదు. ఆ ప్రోత్సాహంతోనే షెఫాలీ అండర్‌-19లో రాణించింది. పదిహేనేళ్లకే అంతర్జాతీయ మ్యాచుల్లో అడుగుపెట్టింది. సచిన్‌ 16 ఏళ్లకి అంతర్జాతీయ మ్యాచుల్లో అర్ధసెంచరీ కొడితే.... షెఫాలీ 15 ఏళ్లకే ఆ రికార్డుని సొంతం చేసుకుంది. టీ20ల్లో రికార్డుల మోతమోగించింది. వరల్డ్‌ ర్యాకింగ్స్‌లోకి చకచకా దూసుకుపోయింది. ‘ప్రత్యర్థి ఎవరైనా, తనదైన శైలిలో ఆడుతూ మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించే ఆటగాళ్లు తరానికి ఒకరొస్తారు. అలాంటి సత్తా షెఫాలిలో చూశా’ అంటూ సీనియర్‌ మిథాలిరాజ్‌ నుంచి ప్రశంసలు అందుకుంది. మైదానంలో అడుగుపెడితే విధ్వంసం సృష్టించే షెఫాలీని అభిమానులు ‘లేడీ సెహ్వాగ్‌’ అని ఇష్టంగా పిలుచుకుంటారు. 2023లో జరిగిన విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆక్షన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ రెండుకోట్లతో షెఫాలీని సొంతం చేసుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో... మహిళల టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ పూర్తిచేసి మరో రికార్డు సృష్టించింది. షెఫాలీ ఇలాంటి మరెన్నో రికార్డులు సృష్టించాలని కోరుకుందాం...!  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్