ఒలింపిక్‌ క్రీడాకారులను నిద్రపుచ్చుతుంది!

పరీక్షలప్పుడూ... ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉన్నప్పుడూ ముందురోజు రాత్రి నిద్రపడుతుందా? ఎలా రాస్తామో... ఏ ప్రశ్నలు అడుగుతారో అన్న భయం. ఎంతైనా జీవితాన్ని మలుపు తిప్పేవి కదా... ఆ మాత్రం కంగారు ఉంటుంది.

Updated : 24 Jun 2024 14:17 IST

(నేడు అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం...)

పరీక్షలప్పుడూ... ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉన్నప్పుడూ ముందురోజు రాత్రి నిద్రపడుతుందా? ఎలా రాస్తామో... ఏ ప్రశ్నలు అడుగుతారో అన్న భయం. ఎంతైనా జీవితాన్ని మలుపు తిప్పేవి కదా... ఆ మాత్రం కంగారు ఉంటుంది. అలాంటిది దేశం తరఫున ఆడాలి... కొన్ని కోట్లమంది ఆశ నెరవేర్చాలనే ఆటగాడిపై ఎంత ఒత్తిడి ఉంటుంది? అలాంటప్పుడు కునుకెలా వస్తుంది? నిజమే అనిపించొచ్చు కానీ... ఆ నిద్రలేమి చాలాసార్లు పతకాన్నే దూరం చేస్తుంది. ఈసారి అలా జరగకుండా చూడబోతున్నారు డాక్టర్‌ మోనికా శర్మ. ఇంతకీ ఎవరీమె?

టోక్యోలో జరిగిన గత ఒలింపిక్‌ క్రీడలు గుర్తున్నాయా? బల్లెంవీరుడు నీరజ్‌చోప్రా సాధించిన బంగారు పతకాన్ని మర్చిపోగలమా? దేశమంతా సంబరాలు చేసుకున్న క్షణమది. ఒక్కసారిగా నీరజ్‌చోప్రా అందరి గుండెల్లో హీరో కూడా అయ్యాడు. కానీ దానికోసం అతను పడిన కష్టాన్ని తక్కువ చేయలేం. శారీరక శ్రమ, సాధించాలన్న కసి తగ్గకుండా చూసుకోవడమే కాదు... అంతకుమించి ఒత్తిడిని అధిగమించాలి. కొత్తప్రదేశం, మారే వేళలతో జెట్‌ లాగ్, ఏ క్షణం యాంటీ డోపింగ్‌ పరీక్షలు అంటారో తెలియదు. కోట్లమంది ఆకాంక్షలు మరోవైపు... ఇవన్నీ బుర్రపై ప్రభావం చూపుతోంటే ఇక నిద్ర ఎలా పడుతుంది? అలా కునుకే లేని రాత్రులెన్నో చూశాడట నీరజ్‌. తనేకాదు రియో ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన అభినవ్‌ బింద్రాదీ అదే పరిస్థితి. అదృష్టం కొద్దీ పతకం తెచ్చారు కానీ... నిద్ర కరవై పతకాన్ని తృటిలో జారవిడుస్తున్న వారెందరో. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని ప్రభుత్వం నియమించిన స్లీప్‌ అడ్వయిజరే... డాక్టర్‌ మోనికా శర్మ.

తొలి ప్రయత్నం ఈమెదే!

ఈమెది హరియాణ. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి బిహేవియరల్‌ స్లీప్‌ మెడిసిన్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ కోర్సు పూర్తిచేశారు. స్లీప్‌ స్పెషలిస్ట్‌గా మోనికాకి 16 ఏళ్ల అనుభవం. ‘నిద్ర పట్టకపోవడం’ వినడానికి సమస్య చిన్నగానే అనిపిస్తుంది కానీ... దానికి శారీరకంగానే కాదు, ఒత్తిడి, ఆందోళన వంటి బోలెడు కారణాలు. వీటిపైనే పనిచేస్తారీమె. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చికిత్స అందిస్తారు. దేశంలో ‘స్లీప్‌ మోక్ష’ పేరుతో నిద్రకోసం ఆసుపత్రిని తెరిచిన తొలి నిపుణురాలీమె. బాధ్యతల పేరుతో నిర్లక్ష్యం చేస్తారు కానీ... మహిళలకు మిగతావారితో పోలిస్తే ఎక్కువ నిద్ర కావాలి. క్రీడాకారిణులకు మరింత అవసరం. దీనిపై అవగాహన కలిగిస్తూ ‘స్లీప్‌4హర్‌’ అనే ప్రోగ్రామ్‌నీ నిర్వహించారు. సి-సూట్‌ అధికారులు, కార్పొరేట్‌ సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ల అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకొని, వాటి ఆధారంగా ‘స్లీప్‌ స్ట్రాటజీ’లను రూపొందిస్తున్నారు. ఆటగాళ్లతో పనిచేయడమూ మోనికాకి కొత్తేమీ కాదు. ఎంతోమంది క్రీడాకారిణులకు ఈమె అడ్వయిజర్‌. కానీ ప్రభుత్వమే ఇలా నియమించడం తొలిసారి.

ఆ సవాళ్లు ఉండొద్దనే..

‘ఎంత బాగా ఆడేవాళ్లయినా... ఇలాంటి అంతర్జాతీయ పోటీల్లో వెనకబడటానికి ‘రేపెలా ఆడతామో’ అన్న భయం ప్రధాన కారణం. దీంతో తెలియని ఒత్తిడికి గురవుతుంటారు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. దానికి తగ్గట్లు పరిష్కారం అవసరం. అందుకే అందరినీ ఎప్పటినుంచో కలుస్తున్నా. వీళ్లల్లో విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నవారూ ఉన్నారు. మరో సమస్య కూడా ఉంది. ఈసారి ఒలింపిక్స్‌ జులై-ఆగస్టు మధ్యలో జరుగుతున్నాయి. ఆ సమయంలో యూరప్‌లో సుదీర్ఘ పగటివేళలు ఉంటాయి. సూర్యోదయం ఉదయం 4కి అయితే సూర్యాస్తమయం రాత్రి 11గం.కి అవుతుంది. ఆ వెలుతురు, వేడిలో పడుకోవడమూ ఇబ్బందే. అందుకే ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) ఈసారి మనవాళ్లకోసం ప్రత్యేకంగా ‘స్లీపింగ్‌ పాడ్‌’లతోపాటు ప్రత్యేక కిట్‌లనీ అందిస్తోంది. వాటి పనితీరు, నాణ్యత వంటివి గమనించుకోవడమూ నా పనే. మొత్తంగా ఆటగాళ్లకు ఒత్తిడి, నిద్రలేమి లేని వాతావరణాన్ని కల్పించడం, వారి ఆటపై దుష్ప్రభావం పడకుండా చూడటం నా బాధ్యతలు. సవాలుతో కూడుకున్న పనే. కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా’ అంటున్నారు మోనిక. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్