కాఫీ కోసం ప్రపంచమంతా తిరిగా!

కాఫీ పరిమళం... ఆ ఘుమఘుమల గురించి తెలిసిందే! ఇంకా కొత్తగా ఏం తెలుసుకుంటాం అంటారా? కాఫీ అనే సబ్జెక్ట్‌ సముద్రమంత! దాని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అంటారు ‘స్పెషాలిటీ కాఫీ’ల తయారీలో క్యూ గ్రేడర్‌గా రాణిస్తున్న శ్రీరాజాకలిదిండి చాందిని. ఆ కాఫీ ముచ్చట్లను ‘వసుంధర’తో పంచుకున్నారిలా...

Updated : 27 Jun 2024 07:11 IST

కాఫీ పరిమళం... ఆ ఘుమఘుమల గురించి తెలిసిందే! ఇంకా కొత్తగా ఏం తెలుసుకుంటాం అంటారా? కాఫీ అనే సబ్జెక్ట్‌ సముద్రమంత! దాని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అంటారు ‘స్పెషాలిటీ కాఫీ’ల తయారీలో క్యూ గ్రేడర్‌గా రాణిస్తున్న శ్రీరాజాకలిదిండి చాందిని. ఆ కాఫీ ముచ్చట్లను ‘వసుంధర’తో పంచుకున్నారిలా...

నా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. నాన్న చంద్రశేఖర్‌రాజు. వ్యవసాయం చేసేవారు. వ్యాపారవేత్త కూడా. అమ్మ లత గృహిణి. చిన్నప్పట్నుంచీ ఏదైనా కొత్తగా ప్రయత్నించు అనేవారు అమ్మానాన్నలు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాక పుణెలో రెండేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశా. పెళ్లైన తర్వాత ఎంబీఏ చేయడం కోసం యూకే వెళ్లాను. యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్‌ నుంచి న్యూవెంచర్‌ క్రియేషన్‌లో ఎంబీఏ చేశా. కొన్ని క్లాసులు సుదీర్ఘంగా సాగేవి. అలాంటప్పుడు బోర్‌ కొట్టకుండా మా కాలేజీ ముందుండే ఓ కెఫేకి వెళ్లేదాన్ని. అక్కడ కాఫీ రుచి చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆరాతీస్తే అవి స్పెషాలిటీ కాఫీలన్నారు. అంతవరకూ నేను తాగిన ఆర్టిఫిషియల్‌ ఫ్లేవర్డ్‌ రుచులకూ, వీటికీ చాలా తేడా ఉంది. ఇవి ఎందుకింత ప్రత్యేకం అని రిసెర్చ్‌ మొదలుపెట్టా. ది బెస్ట్‌ కాఫీని నిర్ణయించడంలో 100 పాయింట్లు ఉన్నాయనుకుంటే... ఈ స్పెషాలిటీ వాటికి 80 కంటే ఎక్కువ పాయింట్లు ఇస్తారు క్యూగ్రేడర్లు. కాఫీ పరిమళం, రుచిని నిర్ణయించే నిపుణులనే క్యూగ్రేడర్లు అంటారు. వైన్, టీ రుచులని నిర్ణయించేందుకు సమోలియర్స్‌ అని ఎలా ఉంటారో, అలా ఈ కాఫీ రుచి కోసం క్యూ గ్రేడర్స్‌ ఉంటారు. ఇందుకు ప్రత్యేకంగా లైసెన్స్‌ కూడా ఉంటుంది. ఈ స్పెషాలిటీ వాటిల్లో ఎక్కడా కృత్రిమ రుచులు, చికోరి వంటి వాటిని కలపరు. కాఫీ గింజల ఎంపిక, వివిధ ప్రక్రియల్లో రోస్ట్‌ చేయడంలోనే ఆ రుచంతా దాగి ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో పండించిన గింజలని మాత్రమే ఇందుకు వాడతారు. మనదేశంలో చిక్‌మగళూరు, కూర్గ్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో పండించిన అరాబికా గింజలని ఇందుకు ఎంచుకుంటారు.

బ్రెజిల్, ఇటలీ, లండన్‌ వంటిచోట్ల తిరిగి నిపుణులని కలిసి ఈ కాఫీల తయారీలో మెలకువలు నేర్చుకున్నా. కొవిడ్‌ సమయంలో ఇండియాలోనే ఉన్నా. అప్పుడేం చేయాలో తోచేది కాదు. ఆ సమయంలో ఒక కేజీ సామర్థ్యం ఉండే రోస్టింగ్‌ మెషీన్‌ కొనుక్కొని సొంతంగా ప్రయోగాలు చేశా. కొంతమంది ఎస్టేట్‌ యజమానులని కలిసి వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న తరవాత... చుట్టుపక్కల కెఫేలకు వాళ్లు కోరిన రుచుల్లో కాఫీ పొడిని సరఫరా చేయడం మొదలుపెట్టాను. సాధారణంగా నాలా ఇండిపెండెంట్‌ రోస్టర్‌లు చాలా తక్కువగా ఉంటారు. పెద్దపెద్ద రెస్టరంట్లూ, సంస్థల్లో అక్కడే మెషీన్లు పెట్టీ రోస్ట్‌ చేస్తూ ఉంటారు. నాకు మాత్రం సొంతంగా పెట్టుకుని రాణించాలనిపించింది. అలా ‘ఫస్ట్‌ క్రాక్‌ స్పెషాలిటీ రోస్టర్స్‌’ సంస్థను స్థాపించా. కాస్త అనుభవం వచ్చాక... ఇటలీలోని ఫ్లోరెన్స్‌కి వెళ్లి అక్కడి కాఫీ కోర్సులు నేర్పించే ఎస్‌ప్రెసో అకాడమీ నుంచి ప్రొఫెషనల్‌ రోస్టర్‌గా సర్టిఫికెట్‌ అందుకున్నా. ఆ సమయంలో మా పాప చిన్నది. తనని మా అమ్మ దగ్గర వదిలి ఈ పరీక్షలకు హాజరయ్యా. ఆ తరవాత కాఫీ గింజల ఎంపిక కోసం ఎవరిపైనో ఆధారపడకుండా సొంతంగా గ్రేడింగ్‌ చేసుకొనేందుకు వీలుగా క్యూ గ్రేడర్‌గా మారాలనుకున్నా. ఇందుకూ శిక్షణ తీసుకున్నా. పరిమళం, రుచి, ఆకారం ఆధారంగా కాఫీ గింజలని ఎంచుకోవడం నేర్పిస్తారు. ఇక కాఫీ రుచి నిర్ణయించడాన్ని కప్పింగ్‌ చేయడం అంటారు. ప్రపంచవ్యాప్తంగా దొరికే కాఫీ పొడులని సబ్‌స్క్రైబ్‌ చేసుకుని వాటి రుచి చూసేదాన్ని. ఆ సమయంలో గీషా వంటి ఎన్నో ఖరీదైన కాఫీల గురించి తెలిసింది. కాఫీల్లో వాడే నాణ్యమైన గింజల కోసం దేశమంతా తిరిగాను. ఇప్పుడు చిక్‌మగళూరు రైతులతో కలిసి ఈ గింజల్ని సేకరిస్తున్నా. దేశవ్యాప్తంగా 60 మంది క్యూ గ్రేడర్స్‌ ఉంటే అందులో నేనొక్కదాన్ని. ప్రస్తుతం ఐదుకేజీల ప్రొబాట్‌ రోస్టర్‌తో... ఎస్‌ప్రెసో, సింగిల్‌ ఎస్టేట్‌ పోరోవర్స్, కోల్డ్‌ బ్రూ బ్లెండ్స్‌ కాఫీలకు అవసరం అయిన కాఫీ పొడులని కెఫేలు, రెస్టరంట్లకు అందిస్తున్నా. స్పెషాలిటీ కాఫీ రంగంలో మాదైన ముద్ర ఉంది. త్వరలో ఈకామర్స్‌లోకి వచ్చి రిటైలర్స్‌కీ చేరువవ్వాలనేది నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్