అనాథలకు అర్హత కల్పించింది..!

కన్నవాళ్లెవరో తెలీదు... అనాథలా పెరిగింది. అష్టకష్టాలూ పడి చదువుకుంది... కానీ ఉద్యోగార్థం రాసిన అర్హత పరీక్షలో మహిళా రిజర్వేషన్‌ వర్తించదన్నారు... అయితే అమృతా కర్వందే అందరిలా ఊరుకోలేదు... మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడింది. ఎట్టకేలకు అనుకున్నది సాధించింది.

Updated : 29 Jun 2024 03:34 IST

కన్నవాళ్లెవరో తెలీదు... అనాథలా పెరిగింది. అష్టకష్టాలూ పడి చదువుకుంది... కానీ ఉద్యోగార్థం రాసిన అర్హత పరీక్షలో మహిళా రిజర్వేషన్‌ వర్తించదన్నారు... అయితే అమృతా కర్వందే అందరిలా ఊరుకోలేదు... మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడింది. ఎట్టకేలకు అనుకున్నది సాధించింది... అదెలానో ఆమె మాటల్లోనే..!

నాకు ఊహ వచ్చేటప్పటికే గోవాలోని ‘మాతృఛాయ’ అనాథాశ్రమంలో ఉన్నాను. రిజిస్టర్‌లో ‘అమృత కర్వందేే’ అని నా పేరు రాసి మరీ నా తండ్రి అక్కడ వదిలేశాడట. అలా అందరూ ఉండీ అనాథగా పెరిగాను. పుణె సేవాసదన్, అహ్మద్‌నగర్‌ అంటూ ప్రాంతాలు మారుతూనే ఉన్నాను. పద్దెనిమిదేళ్లు వస్తే అనాథాశ్రమాల్లో ఉండనివ్వరు. దాంతో నాకు పెళ్లి సంబంధాలు చూశారు. పెళ్లి చేసుకుంటే... మళ్లీ నేను మరొకరిమీద ఆధారపడాలి. అలా ఉండకూడదంటే నాకంటూ ఓ గుర్తింపు ఉండాలి. అందుకే బాగా చదివి స్థిరపడాలి అనుకున్నా. తప్పనిసరి పరిస్థితుల్లో హోమ్‌ నుంచి బయటకు వచ్చేశాను.
రావడమైతే వచ్చాను కానీ పై చదువుకి డబ్బుల్లేవు. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీదే ఉంటూ... చిన్నచిన్న దుకాణాల్లో పనిచేసేదాన్ని. వంటమనిషిగానూ పనిచేశా. అలా దాచుకున్న డబ్బుతో నైట్‌ కాలేజీలో చేరి ఎలాగో డిగ్రీ చేశా. పుణెలో ఎంఏ ఎకనామిక్స్‌ చేయాలని ‘సావిత్రీబాయ్‌ ఫులే’ యూనివర్సిటీ ప్రవేశపరీక్ష రాశా. కుల ధ్రువపత్రం లేదన్న కారణంతో రిజర్వేషన్‌ వర్తించదన్నారు. ఓపెన్‌ క్యాటగిరీలో రూ.16 వేలు చెల్లించాలన్నారు. అంత డబ్బు లేక వేరే కాలేజీలో చేరాలనుకున్నా. ఆ ప్రిన్సిపల్‌కు నా సమస్య చెబితే చేర్చుకున్నారు. అలా మాస్టర్స్‌ చేశా. దీంతోపాటు మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కీ ప్రిపేర్‌ అయ్యా. పరీక్ష రాస్తే 100కి 39 మార్కులొచ్చాయి. మహిళలకు కటాఫ్‌ 35 మార్కులు కాబట్టి, సాధించగలననుకున్నా. తీరా లిస్ట్‌లో నా పేరు లేదు. కారణం అడిగితే అధికారులెవరూ స్పందించలేదు. చివరికెలాగో ఓ అధికారిని సంప్రదిస్తే అనాథను కావడంవల్ల రిజర్వేషన్‌ రాదనీ జనరల్‌ క్యాటగిరీ ప్రకారం కటాఫ్‌ 46 మార్కులు రావాలనీ చెప్పారు. అలా అర్హత సాధించలేకపోయా.

అనాథ అనే కారణంతో మహిళలకొచ్చే రిజర్వేషన్‌లోకి నేను రాననే ఆలోచన నన్ను నిలవనివ్వలేదు. నాలాంటి మరెందరో కోటి కలలతో చదువుకుంటున్నారు. వారికీ ఇలా జరగకుండా నావంతుగా ఏదైనా చేయాలనిపించింది. నా ప్రయత్నంగా అధికారులు, మంత్రులను కలవడానికి ఎంతో ప్రయత్నించా. వీలు కాలేదు. చివరకు అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతి పత్రమివ్వగలిగాను. సమస్య వివరించి నాలాంటి వారందరికీ న్యాయం జరిగేలా చూడమని అభ్యర్థించాను. దాన్ని పరిశీలించింది ప్రభుత్వం. అనాథలకు విద్య, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్రప్రభుత్వం 2018లో ప్రకటించింది. దీనివల్ల నాలాంటి ఎందరికో ప్రయోజనం చేకూరుతుంది. అనాథల సంక్షేమానికి పాటుపడటమే లక్ష్యంగా ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నా. అలాగే పేద పిల్లలకు పుస్తకాలు, దుస్తులు వంటివాటితోపాటు ఉచిత విద్యాబోధననీ అందిస్తున్నా. ఇందుకుగానూ ‘శారద దుర్గ స్త్రీ శక్తి’ సహా’ పలు పురస్కారాలనూ అందుకున్నా. కలెక్టరు అయ్యి పేదల సంక్షేమం కోసం పాటుపడటం నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్