ఆ ఆశే నన్ను నడిపించింది..!

నవమాసాలూ కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది తల్లి. అమ్మ అనే పిలుపు కోసం పరితపిస్తుంటుంది. మరి ఆ పాపకి అసలు మాటలే రాకుంటే...చెవులే వినిపించకుంటే...కళ్లతో చూడలేకుంటే... ఆ తల్లి బాధ వర్ణనాతీతం. మాతృత్వం అంటేనే అదొక జీవితకాల ఉద్యోగం.

Published : 18 Jun 2024 01:27 IST

నవమాసాలూ కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది తల్లి. అమ్మ అనే పిలుపు కోసం పరితపిస్తుంటుంది. మరి ఆ పాపకి అసలు మాటలే రాకుంటే...చెవులే వినిపించకుంటే...కళ్లతో చూడలేకుంటే... ఆ తల్లి బాధ వర్ణనాతీతం. మాతృత్వం అంటేనే అదొక జీవితకాల ఉద్యోగం. ఇక ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లుల పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని సానుకూల దృక్పథంతో ఎదుర్కొనడమే కాదు, ‘మారిపోసా ఫౌండేషన్‌ సెంటర్‌’ ద్వారా తన బిడ్డలాంటి అనేకమంది పిల్లలకూ తల్లిగా మారిన సేజల్‌ ప్రయాణమే ఇది...

ముద్దులొలికే కవలలు నాలో పెరుగుతున్నారని తెలిసి ఎంతో సంతోషించా. అయితే, ప్రెగ్నెన్సీలో కొన్ని సమస్యల వల్ల నెలలు నిండకుండానే ప్రసవించా. ఇద్దరిలో ఒక పాప దక్కలేదు. మరో పసికందూ బతకడం కష్టమేనన్నారు వైద్యులు. ఆ పసిగుడ్డును నెలలపాటూ ఐసీయూలోనే ఉంచాల్సి వచ్చింది. వందరోజుల చికిత్స తర్వాత విహాను మా చేతుల్లో పెట్టారు. అప్పుడే అనిపించింది తనొక ఫైటర్‌ అని. అయితే, విహా బతికిందని సంతోషించేలోపే వైద్యులు మరొక పిడుగులాంటి వార్త చెప్పారు. ఆక్సిజన్‌ ఎక్కువై తనకు రెటినాల్‌ డిటాచ్‌మెంట్‌ అయిందనీ, ఇకపై చూడలేదని చెప్పారు. తను పెరిగేకొద్దీ మాకు తెలిసిన మరో విషయం ఏంటంటే... తనకు దృష్టిలోపంతోపాటు మానసిక ఎదుగుదలలోనూ లోపాలు ఉన్నాయని. సొంత పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమని...

వాళ్లకోసమే...

విహాకు ఐదారేళ్లప్పుడు హెలెన్‌ కెల్లర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించా. తొమ్మిదేళ్లు వచ్చాక తను మాటలు నేర్చుకోవడం కోసం వోకల్‌ ట్రైనింగ్‌ అవసరమని వేరే చోటుకి తీసుకెళ్లమని అక్కడివాళ్లు చెప్పారు. దక్షిణ బాంబే అంతా తిరిగినా, విహాకు సరిపోయే శిక్షణా కేంద్రం ఒక్కటీ కనిపించలేదు. ఎందుకంటే తనొక ఛాలెంజింగ్‌ కిడ్‌. మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌ ఉన్నాయి. ఇటువంటి పిల్లలకు రోజువారీ పనులు నేర్పించాల్సి ఉంటుంది. తినటం దగ్గరనుంచీ బట్టలువేసుకోవడం, మోటార్‌ స్కిల్స్, వంటివి అనేకం నేర్పించాలి. ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ కూడా అవసరమవుతుంది. వీళ్లలో జ్ఞానేంద్రియాల సమన్వయం ఉండదు. అందుకు వారికి సెన్సరీ స్టిమ్యులేషన్‌ ఇవ్వాలి. ఆర్ట్, సంగీతం వంటి వాటిలోనూ భాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడే అనిపించింది విహా లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం నేనే ఒక కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించుకున్నా. అలా వచ్చిందే ‘మారిపోసా ఫౌండేషన్‌ సెంటర్‌’. ప్రస్తుతం ఇందులో 14మంది పిల్లలున్నారు. మారిపోసా ప్రారంభించాక అక్కడికి వచ్చిన పిల్లల్ని చూస్తున్నా. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. వాళ్ల అవసరాలను బట్టి, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్ని రూపొందించడం కోసం పరిశోధనలూ చేశా. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లతోపాటు నేనూ అనేక విషయాలు నేర్చుకున్నా.

అదే ఆనంద క్షణం...

ఏ తల్లికి అయినా తమ పిల్లలు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడడం కంటే కావాల్సింది ఏముంది? మొదట్లో విహా మనవైపు చూడడం, నవ్వడం లాంటివి ఏమీ చేసేది కాదు. చాలా బాధగా అనిపించేది. కానీ తర్వాత విహా పలికిన మొదటి మాట ‘పాపా’.. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఏదో ఒకరోజు తను నా దగ్గరికొచ్చి అందరి పిల్లల్లానే నన్ను కౌగిలించుకుని మాట్లాడుతుందనీ, నడవడం, పరిగెత్తడం... వంటివి చేస్తుందని ప్రతిరోజూ అనుకుంటా. నిజానికి ఆ ఆశే నన్ను నడిపించేది. కానీ ప్రస్తుతం నా ఆలోచనా విధానం మారింది. ఇప్పుడు నాకు ఉన్న కోరిక ఒక్కటే. తను ఎలా ఉన్నా... జీవితాంతం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే, ఎంత సానుకూలంగా ఆలోచించినా సరే... ఒక్కోసారి తల్లిగా అదీ ప్రత్యేక అవసరాలున్న బిడ్డకు అమ్మగా నన్ను ఎప్పుడూ వెంటాడే భయం ఒక్కటే. ఒకవేళ దురదృష్టవశాత్తూ నేను ఈ లోకంలో లేకపోతే, తనను ఎవరు చూసుకుంటారు? ఈ ప్రశ్నే నన్ను బలహీనురాల్ని చేసేది. అప్పుడే నేనో విషయం తెలుసుకున్నా. నేను ఎంతగా ఆలోచించినా, బాధపడినా మారేది ఏమీ ఉండదు. కాబట్టి దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అందుకే భారమంతా దేవునిమీదే వేసి నాకు నేను సర్ధిచెప్పుకొనేదాన్ని. ప్రస్తుతం ఉన్న క్షణాల్ని ఆనందంగా మలుచుకోవడమే తప్ప మనచేతుల్లో ఏమీ ఉండదు. సానుకూలంగా ఆలోచించి, ముందుకు సాగాలనేదే నా ప్రయత్నం. జీవితం క్లిష్టతరంగా మారినప్పుడు మనమూ అంతే కఠినంగా తయారవుతాం. ప్రేమ పర్వతాలనూ కదిలిస్తుందంటారు. అలా నా బిడ్డపై ఉన్న ప్రేమ నా జీవితానికో అర్థాన్నిచ్చింది. విహాతోపాటు అనేకమంది పిల్లలకు తల్లిగా మారే అవకాశాన్నీ ఇచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్