మా అమ్మ ‘ఐశ్వర్యారాయ్’లా.. అందంగా ఉంటే..!

మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఊహల్లో విహరించేలా చేస్తుంటాయి. మనమైతే వాటి గురించి కాసేపు ఆలోచించి వదిలేస్తాం. కానీ సంజనా ఠాకూర్‌ అలా కాదు. ఆ ఊహల్ని కథలుగా మలిచే దాకా నిద్ర పోదు. ఈ మక్కువే తాజాగా తనను ‘కామన్వెల్త్‌ షార్ట్‌ స్టోరీ ప్రైజ్‌’ గెలుచుకునేలా చేసింది.

Updated : 29 Jun 2024 16:37 IST

(Photo: Twitter)

మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఊహల్లో విహరించేలా చేస్తుంటాయి. మనమైతే వాటి గురించి కాసేపు ఆలోచించి వదిలేస్తాం. కానీ సంజనా ఠాకూర్‌ అలా కాదు. ఆ ఊహల్ని కథలుగా మలిచే దాకా నిద్ర పోదు. ఈ మక్కువే తాజాగా తనను ‘కామన్వెల్త్‌ షార్ట్‌ స్టోరీ ప్రైజ్‌’ గెలుచుకునేలా చేసింది. ఊహా ప్రపంచంలో గడుపుతూ.. వాటిని పేపర్‌పై పెడుతూ.. కాల్పనిక కథలు రాయడంలో ఆమె దిట్ట. ఇంతకీ సంజన రాసిన కథ పేరేంటో తెలుసా? ‘ఐశ్వర్యారాయ్’!

సంజనది ముంబయి. చిన్న వయసు నుంచీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, వ్యక్తుల్ని నిశితంగా పరిశీలించేదామె. ఇలా వచ్చిన ఆలోచనల్ని పేపర్‌పై పెట్టేది. కొన్నింటిని కథలుగా మలిచేది. ఈ జిజ్ఞాసే భవిష్యత్తులో రచయిత్రి కావాలన్న కోరికను తనలో రేకెత్తించేలా చేసింది. ముఖ్యంగా కాల్పనిక కథలు రాయడంపై మక్కువ చూపిన ఆమె.. ఇందులో మరింత పట్టు సాధించేందుకు ప్రస్తుతం టెక్సాస్‌ యూనివర్సిటీలో ‘ఫిక్షన్‌’ విభాగంలో ‘మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (MFA)’ కోర్సు చేస్తోంది.

‘ఐశ్వర్యారాయ్’ కథేంటంటే..!

ఈ క్రమంలోనే ఇటీవలే ఓ కథ రాసింది సంజన. దీనికి ‘ఐశ్వర్యారాయ్’ అనే పేరు పెట్టింది. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ పేరును స్ఫూర్తిగా తీసుకొనే తన కథకు ఈ టైటిల్‌ పెట్టానంటోందామె. ముంబయిలో పేదరికంలో పుట్టి పెరిగిన అవని అనే యువతి కథ ఇది. తన కథ కోసం అవని అనే పాత్రతో పాటు, మరో 150 మంది మహిళల పాత్రల్ని సృష్టించింది సంజన. ఇరుకైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ.. ఫలానా వారు తనకు తల్లైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ.. అవని ముందుకు సాగే నేపథ్యంతో కూడుకున్నదీ కథ. ఇందులో భాగంగా తన మొదటి తల్లి అత్యంత పరిశుభ్రంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంది అవని. ఆపై తన తల్లి బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌లా అందంగా ఉంటే ఎలా వ్యవహరిస్తుందో మరో ఊహలో విహరిస్తుంటుందామె. ఆ తర్వాత ఎప్పుడూ బాధపడుతూ ఉండే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన తల్లైతే ఎలా ఉంటుందో మూడోసారి ఊహించుకుంటుంది అవని. ఇలా 150 మంది తల్లుల్ని, విభిన్న కోణాల్లో ఊహించుకుంటూ.. వారు తన తల్లైతే ఎలా ఉంటుందన్నది అవని ఆలోచిస్తున్నట్లుగా.. పాటలో చరణాలను పోలినట్లుగా అద్భుతమైన షార్ట్‌ స్టోరీస్‌ రాసింది సంజన. ఈ కథ ‘Granta’ అనే పత్రికలో ప్రచురితమైంది.

5 లక్షల ప్రైజ్‌మనీ!

ఆధునిక నగర జీవనశైలి మనల్ని, మన కుటుంబాల్ని, అనుబంధాల్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో ఈ కథ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. తాజాగా ఈ కథ అరుదైన బహుమతి గెలుచుకుంది. కామన్వెల్త్‌ ఫౌండేషన్‌ ఏటా అందించే ‘కామన్వెల్త్‌ షార్ట్‌ స్టోరీ ప్రైజ్‌’ను ఈ ఏడాదికి గానూ గెలుచుకుంది ఈ కథా రచయిత్రి సంజన. ప్రపంచవ్యాప్తంగా 7,359 మంది ఈ ప్రైజ్‌ కోసం పోటీ పడగా.. సంజన మొదటి బహుమతి అందుకోవడం విశేషం! ఈ క్రమంలో రూ. 5.26 లక్షల నగదు బహుమతి ఆమె సొంతమైంది. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక ప్రైజ్‌ గెలుచుకున్న మూడో భారతీయురాలు సంజన. 2012 నుంచి ఇవ్వడం ప్రారంభించిన ఈ పురస్కారాన్ని.. 2016లో పరాశర్‌ కుల్‌కర్ణి (Cow and Company), 2020లో కార్తీక పాండే (The Great Indian Tee and Snakes)లు అందుకున్నారు.

అవే నా కథలకు పట్టుగొమ్మలు!

అయితే ఈ బహుమతి తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టించేలా చేసిందంటోంది సంజన.

‘కామన్వెల్త్‌ షార్ట్‌ స్టోరీ ప్రైజ్‌ వంటి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. ఈ కథను చాలామంది ఆదరించారు. ఇదే స్ఫూర్తితో ఇలాంటి కథలు మరెన్నో రాయాలనుకుంటున్నా. నా 26 ఏళ్ల జీవితంలో పదేళ్లు విదేశాల్లోనే గడిపా. ముంబయిలో పుట్టి పెరగడం వల్ల నా చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ల ప్రవర్తన, జరిగే సంఘటనల్ని సునిశితంగా పరిశీలించేదాన్ని. అలాగే ఇక్కడి సమాజంలో ఉన్న పరిస్థితులూ నాకు సుపరిచితమే! ఈ ఊహలన్నీ కథలుగా మలుస్తుంటా. ‘ఐశ్వర్యారాయ్’ కథ కూడా ఇలాంటి ఊహల్లో నుంచి పుట్టిందే. దీనికి బాలీవుడ్‌ నటి ‘ఐశ్వర్యారాయ్’ పేరును స్ఫూర్తిగా తీసుకోవడంతో నా పుస్తకం మరింత మందికి చేరువైంది. మన సమాజంలో తల్లీకూతుళ్ల ఆలోచనలు, సౌందర్య ప్రమాణాలు, ముంబయిలోని స్ట్రీట్‌ ఫుడ్‌, ఆధునిక నగర జీవనశైలి.. వంటి ఎన్నో అంశాల్ని నా కథ స్ప స్పృశిస్తుంది. ఇది మన దేశం వారినే కాదు.. అంతర్జాతీయంగానూ ఎంతోమందిని ఆకట్టుకోవడం విశేషం!’ అంటోంది సంజన. ఇక గతంలో ఆమె రాసిన ‘Back stroke’ అనే షార్ట్‌ స్టోరీ ‘The Southampton Review’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్