యాభై దాటాకే... సేవ అనుకున్నాం కానీ..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశంలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య డాక్టర్‌ శ్రీరత్న పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోయింది.

Updated : 24 Jun 2024 13:13 IST

ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశంలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య డాక్టర్‌ శ్రీరత్న పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోయింది. ఆయన గెలుపులో, వ్యాపారంలో, ట్రస్ట్‌ సేవల్లో తనదైన ముద్ర వేశారామె. ఆ ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారిలా...

మీ కుటుంబ నేపథ్యం, చదువు, వృత్తి, వైవాహిక జీవితం...

మా స్వస్థలం కృష్ణా జిల్లా గొడవర్రు. నాన్న వ్యాపారవేత్త, అమ్మ గృహిణి. ఇంటర్‌ వరకూ విజయవాడలోనే చదివా. మైసూర్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హౌస్‌ సర్జన్‌ చేశా. అప్పుడే చంద్రశేఖర్‌ పెమ్మసానితో పరిచయం, ప్రేమ, పెళ్లి...! మా అత్తగారి ఊరు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం. పెళ్లి తరవాత మేమిద్దరం ఎండీ చేయడానికి అమెరికా వెళ్లిపోయాం. బాల్టీమోర్‌లోని జాన్‌హాప్కిన్స్‌ సైనయ్‌ ఆసుపత్రిలో ఎండీ(జనరల్‌ మెడిసిన్‌) చేశా. కొన్నేళ్లు వైద్యురాలిగా ప్రాక్టీస్‌ చేశా. మాకు ఇద్దరు పిల్లలు.

రాజకీయాలపై అవగాహన ఎలా సాధ్యమైంది?

చిన్నప్పటి నుంచీ ఏ అంశమైనా సరే... క్షుణ్నంగా తెలుసుకోవడం అలవాటు నాకు. శ్రద్ధగా వింటా, పుస్తకాలు బాగా చదువుతా. ప్రతి పనీ ప్రణాళికతో చేస్తా. ఇక, రాజకీయాలపై అవగాహన... ఈ రెండు మూడు నెలల్లో పెంచుకున్నది కాదు. నాన్న వార్తా పత్రికలు చదవడం చిన్న వయసులోనే అలవాటు చేశారు. దీనికి తోడు స్వతహాగానే నాకు రాజకీయ చైతన్యం, సమాజంలో శాశ్వత మార్పుకోసం ప్రయత్నించడం వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. నేనూ మావారు యాభై దాటాక పూర్తిగా సమాజ శ్రేయస్సుకోసం పనిచేయాలనుకున్నాం. అయితే, ఆ దశకి చేరకుండానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ప్రజలకు సేవ చేసేందుకు ఇదీ ఓ మార్గమే అని నమ్ముతా. ఈ ఎన్నికల్లో డా.చంద్ర ఎంపీ అభ్యర్థిగా నిలబడటంతో నేను బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేయడం ఆరంభించా. కార్యకర్తలు డోర్‌టూడోర్‌ క్యాంపెయిన్‌కి రమ్మనడంతో క్షేత్రస్థాయిలో అడుగుపెట్టా. రాజకీయ చైతన్యం ఉంటేనే సరైన అభ్యర్థిని ఎంచుకునే విషయంలో స్పష్టత వస్తుంది. పైగా ఇది ఈ ఒక్క ఎన్నికల సమరానికే కాదు.. ప్రతిసారీ ఉపయోగపడుతుంది. ఆ చైతన్యం కలిగించాకే మావారికి ఓటేయమని అడిగా. ప్రజలకు, కార్యకర్తలకు, పోలింగ్‌ ఏజెంట్లకు సులువుగా అర్థమయ్యేలా ఓటు విలువ, పోలింగ్‌ ఏజెంట్‌ బాధ్యతలు, కౌంటింగ్‌ నియమావళి... ఇలా కొన్ని వీడియోలు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశా. ఇందుకోసం సమయం కేటాయించుకుని మరీ సంబంధిత పుస్తకాలన్నీ చదివా. నోట్స్‌ ప్రిపేర్‌ చేసి పదినిమిషాల నిడివితో వీడియోలు రూపొందించా. ఇది మాకే కాదు, అధికారులకూ, ప్రతిపక్షం వారికీ ఉపయోగపడ్డాయి.

ఎన్నికల ప్రచారంలో మీ ట్రస్ట్‌ తరఫున మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రణాళికలు ఉన్నాయా? అసలీ సంస్థ ఇప్పటివరకూ ఏం చేసింది? లక్ష్యాలేంటి?

నేను మహిళల్ని కలిసినపుడు వారిలో చాలామంది సంక్షేమ పథకాల కంటే తమ పిల్లలకు నాణ్యమైన విద్య, సొంత ఇల్లు కావాలన్నారు. పని కల్పిస్తే చేస్తాం అన్నారు. మా ఆలోచనా ఇదే. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ట్రస్ట్‌ ద్వారా మా ప్రణాళికలు అమలు చేయాలనుకుంటున్నాం. ఇక, ఆడవాళ్లు తమ కాళ్లపై తాము నిలబడితే, ఆర్థిక స్థిరత్వం సాధించి కుటుంబానికి అండగా ఉంటారు. ముఖ్యంగా కుట్టుపని, ప్యాకేజింగ్‌ వంటి పనులెన్నో ఉన్నాయి. వీటికి సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహించాలనుకుంటున్నా. ఇప్పటికైతే బోలెడన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి స్పష్టమైన కార్యాచరణగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. పెమ్మసాని ఫౌండేషన్‌ మొదలుపెట్టి ఐదేళ్లకు పై మాటే. అయితే, వ్యక్తిగతంగా చాలా ఏళ్లుగా ఇవన్నీ సాగుతున్నాయి. బోర్‌వెల్స్‌ వేయించడం, మంచినీటి శుద్ధి ప్లాంట్‌ల ఏర్పాటు, రక్తదాన శిబిరాలు, క్యాన్సర్‌ రన్‌లు, మెడికల్‌ క్యాంప్స్‌ నిర్వహణ ఇలా చాలానే ఉన్నాయి. ప్రతిభగల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, ఫుడ్‌బ్యాంక్‌లకు ఆహార సరఫరా వంటివెన్నో చేశాం. భవిష్యత్తులో మరిన్ని విషయాలపై దృష్టిపెడతాం.

క్రియాశీల రాజకీయాలపై మీకూ ఆసక్తి ఉందా? డాక్టర్‌ కాకపోయుంటే...

నాకు రాజకీయవేత్తగా రాణించడం కంటే సోషల్‌ యాక్టివిస్ట్‌గా పనిచేయడం ఇష్టం. వ్యక్తిగతంగా మెరుగైన సమాజం కోసం పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అందుకే, నా ఆలోచనలు గమనించిన మావారు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టొచ్చుగా అనేవారు. అయితే, వివిధ బాధ్యతల్లో తీరిక లేక వాటన్నింటికీ దూరంగా ఉన్నా. డాక్టర్ని కాకపోయి ఉంటే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసేదాన్ని. అయితే, కొన్నాళ్ల క్రితమే వైద్యురాలిగా ప్రాక్టీస్‌ మానేసి.. మావారు స్థాపించిన ‘యూవరల్డ్‌’ సంస్థ అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతలు, పెమ్మసాని ట్రస్ట్‌ నిర్వహణ చూసుకుంటున్నా. భవిష్యత్తులో నీటి పొదుపు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లపై వర్క్‌చేయాలని ఉంది. ప్రతి ఒక్కరూ పౌరులుగా తమ బాధ్యతల్ని తాము నిర్వర్తించగలిగేలా కృషి చేస్తా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్