పారిస్‌ ఒలింపిక్స్‌ను క్లిక్‌మనిపించాలని..!

ఎంచుకున్న రంగమేదైనా... కృషి, నిబద్ధతలతో పనిచేస్తే గుర్తింపు దానంతట అదే దక్కుతుంది. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ గీతికా తాలూక్‌దార్‌ ప్రయాణమే అందుకు ఉదాహరణ.

Updated : 02 Jul 2024 02:46 IST

ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం

ఎంచుకున్న రంగమేదైనా... కృషి, నిబద్ధతలతో పనిచేస్తే గుర్తింపు దానంతట అదే దక్కుతుంది. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ గీతికా తాలూక్‌దార్‌ ప్రయాణమే అందుకు ఉదాహరణ. తాజాగా ఈమెకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ గుర్తింపు దక్కింది. తద్వారా పారిస్‌లో జులై 26న జరగబోయే ఒలింపిక్‌ గేమ్స్‌ను కవర్‌ చేయడానికి అధికారిక అక్రిడిటేషన్‌ కార్డును అందుకుంది.  ఈ గుర్తింపు పొందిన మొదటి, ఏకైక భారత మహిళా ఫొటోగ్రాఫర్‌గా వార్తలకెక్కింది.

నిరంతరం సమయంతో పరుగులెత్తాల్సి ఉన్నా... క్రీడల్లో ఉండే క్రమశిక్షణ, సవాళ్లే గీతికను ఈ రంగం ఎంచుకునేలా చేశాయి. ఈమెది అసోంలోని నల్బారీ. ఉద్యోగరీత్యా వాళ్ల నాన్నకు తరచూ బదిలీలు అవుతుండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగింది. స్థానికంగా కేంద్రీయ విద్యాలయాల్లో స్కూలింగ్‌ పూర్తి చేసింది. పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, గువాహటిలోని ఐఎమ్‌సీఎమ్‌ మీడియా ట్రస్ట్‌లో మాస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ మీడియాలో పీజీ డిప్లొమా చేసింది. ఆ తర్వాత, సౌత్‌ కొరియాలోని ప్రఖ్యాత సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసింది. స్పోర్ట్స్‌ మీడియాలోని లింగభేదాలపైనా అనేక పరిశోధనలు చేసిన గీతిక, అందుకుగానూ దక్షిణ కొరియా ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌నూ పొందింది.

తాతయ్య స్ఫూర్తితో...

గీతిక తాతయ్య చంద్ర తాలూక్‌దార్‌ ఫిలింమేకర్, డైరెక్టర్‌. చిన్నప్పుడు సెలవుల్లో ఆయన్ను కలవడానికి గువాహటి వెళ్లేది. కెమెరాతో ఆయన పనిచేయడం చూసి, ఫొటోగ్రఫీపై ఆసక్తి పెంచుకుంది. అలా మొదలైన ఈ ప్రయాణం... దేశ, విదేశాల్లోని ప్రముఖ మీడియా సంస్థలూ, పబ్లికేషన్లలో పనిచేసే దాకా వెళ్లింది. డీఎన్‌ఏ, ది టెలిగ్రాఫ్, బీబీసీ, ఇండియా టుడేలతో పాటు పీటీఐ, ఏఎఫ్‌పీ లాంటి వాటికి కంట్రిబ్యూటర్‌గా పనిచేసింది. కొలంబోలోని డైలీ ఫైనాన్షియల్‌ టైమ్స్‌లోనూ తన కెమెరా పనితనం చూపించింది. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా తనకు స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో ఆపై ఫ్రీలాన్సర్‌గా మారింది గీతిక.

కొవిడ్‌లోనూ...

ఒలింపిక్‌ గేమ్స్‌ను కవర్‌ చేయడానికి గీతికకు వచ్చిన రెండో అవకాశం ఈ పారిస్‌ ఒలింపిక్స్‌. మొదటిసారి 2020లో జపాన్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ను కవర్‌ చేయడానికి అక్రిడిటేషన్‌ లేకుండా వెళ్లింది. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోన్న సమయమది. చాలా మీడియా సంస్థలు ఇందుకు భయపడినా, తను మాత్రం ధైర్యంగా, ప్రాణాలను రిస్క్‌ చేసి మరీ వెళ్లడం ఆమె నిబద్ధతకు మచ్చుతునక. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో జరిగిన విమెన్స్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌ 2023,  ఫ్రాన్స్‌లో జరిగిన ఫిఫా విమెన్స్‌ వరల్డ్‌ కప్‌ 2019 లాంటి ఈవెంట్లనూ తన కెమెరాలో బంధించింది. 2018లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ను క్లిక్‌మనిపించిన ఏకైక నార్త్‌ఈస్ట్‌ ప్రాంత మహిళ కూడా గీతికానే. నేషనల్‌ గేమ్స్‌ 2007, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2010, ఐపీఎల్‌ సీరీస్‌ వంటివెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. అలా పందొమ్మిదేళ్లపాటూ ఈ రంగంలో ఈమె చేసిన కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ (ఐఓసీ) డైరెక్ట్‌ అక్రిడిటేషన్‌ను గీతికకు అందించింది. ఇలా ఐఓసీ నుంచి నేరుగా అక్రిడిటేషన్‌ పొందిన ఏకైక భారత మహిళా ఫొటోజర్నలిస్ట్‌గా చరిత్ర సృష్టించింది గీతిక. గ్లోబల్‌గానూ ఈ అర్హత సాధించిన అతికొద్దిమందిలో ఈమె ఒకరు. ‘‘ఈ ఏడాది ‘గేమ్స్‌ వైడ్‌ ఓపెన్‌’ అనేది ఒలింపిక్‌ మోటో. మరిన్ని వర్గాలను కలుపుకోవడం, సమాన అవకాశాలు, ఓపెన్‌ మైండ్‌నెస్, వీక్షకులను ఎంగేజ్‌చేయడం వంటివీ ఈ థీమ్‌లో భాగం. నాకు దక్కిన ఈ గుర్తింపూ అందులో భాగమే. ఈ ప్రోత్సాహం ఎక్కువ మంది అమ్మాయిలు ఈరంగం వైపు రావడానికి దోహదపడుతుంది. సమయపాలన, ఏకాగ్రత ఉంటే ఈ రంగంలో రాణించడం తేలికే’’ అంటోంది గీతిక.


రిచర్డ్‌ హెడ్లీతో...

‘ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది గొప్ప క్రీడాకారులను కలిశాను. అందులో ముఖ్యంగా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సర్‌ రిచర్డ్‌ హెడ్లీను ఇంటర్వ్యూ చేయడం, ఫొటోషూట్‌ వంటివి నేను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. నేను మొదటిసారి  ఆయన్ను కలిసింది కొలంబోలోని తన క్రికెట్‌ ఫౌండేషన్‌లో. అది క్రికెట్‌పై ఆసక్తి ఉన్న పేద పిల్లలకు శిక్షణ ఇచ్చే ఒక ఆర్గనైజేషన్‌. అప్పుడు ఆయన పిల్లలకు బంతి ఎలా విసరాలో, ఎలా క్యాచ్‌ పట్టాలో నేర్పిస్తున్నారు. అదేవిధంగా శ్రీలంక బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కర, ఎమ్‌ఎస్‌ ధోనీ, మేరీకోమ్‌లతో చేసిన ఇంటర్వ్యూలూ మధుర జ్ఞాపకాలే’ అంటోంది గీతిక.


మీరైతే ఏం చేస్తారు?

పరుపు పాడవుతుందనో, దుప్పట్లు పదే పదే ఉతకలేకో... పిల్లలకు డైపర్లు వేస్తుంటాం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు సరే! కాస్త పెద్దయ్యాక మాన్పించక తప్పదుగా? మరి... పక్క తడిపే అలవాటుని మీ చిన్నారులతో సులువుగా ఎలా మాన్పించారో మాతో పంచుకోండి. పేరు, ఊరు వివరాలతో సహా మాకు పంపండి.

మా ఈ-మెయిల్‌-vasundhara@eenadu.in (గమనిక: సమాధానాలు మహిళలు మాత్రమే పంపగలరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్