చూపు లేదు కానీ... ఫుట్‌బాల్‌ ఆడేస్తోంది!

ఆ స్టేడియంలో ఫుట్‌బాల్‌ క్రీడ జరుగుతోంది. అయితే ఆడేవాళ్లు కళ్లకి గంతలు కట్టుకుని ఉన్నారు. అయినా ఒడుపుగా బంతిని కాళ్లతో తోస్తూ గోల్‌ దిశగా నడిపిస్తున్నారు. వాళ్లలో ఒకరు... 26 ఏళ్ల నిర్మా మనుభాయ్‌ ఠాకర్దా. ఆమె గాలిలో వస్తోన్న బంతి వేగాన్నీ నేలపై అది కదిలే శబ్దాన్నీ అంచనావేస్తూ సునాయాసంగా ఫుట్‌బాల్‌ ఆడేస్తోంది. సాధనతో కొద్దికాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

Updated : 26 Jun 2024 02:36 IST

ఆ స్టేడియంలో ఫుట్‌బాల్‌ క్రీడ జరుగుతోంది. అయితే ఆడేవాళ్లు కళ్లకి గంతలు కట్టుకుని ఉన్నారు. అయినా ఒడుపుగా బంతిని కాళ్లతో తోస్తూ గోల్‌ దిశగా నడిపిస్తున్నారు. వాళ్లలో ఒకరు... 26 ఏళ్ల నిర్మా మనుభాయ్‌ ఠాకర్దా. ఆమె గాలిలో వస్తోన్న బంతి వేగాన్నీ నేలపై అది కదిలే శబ్దాన్నీ అంచనావేస్తూ సునాయాసంగా ఫుట్‌బాల్‌ ఆడేస్తోంది. సాధనతో కొద్దికాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

గుజరాత్, సబర్‌కాంతా జిల్లాలోని రెహదా గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టింది నిర్మా. తండ్రి మనుభాయ్‌ రైతు. తల్లి లఖూబెన్‌ గృహిణి. మనుభాయ్‌ పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు చూపు తెప్పించడం కోసం ఆసుపత్రులన్నీ తిప్పారు. కంటిలోని రక్తనాళం దెబ్బతినడంతో అది కష్టసాధ్యమని చెప్పారు వైద్యులు. దాంతో తీవ్ర వేదనకు గురయ్యారు తల్లిదండ్రులు. ఎలాగో గుండె దిటవు చేసుకుని చదివించాలని అనుకున్నారు. అందుకని స్కూల్లో చేరుద్దామని తీసుకెళ్తే అంధులకి ప్రవేశం లేదన్నారు. గ్రామ సర్పంచి సిఫార్సుతో ప్రాథమిక పాఠశాలలో నిర్మాకు చోటిచ్చారు.   

‘స్కూల్‌లో తోటి విద్యార్థుల్లా బోర్డుపై అక్షరాలు చదవలేను. వినడం తప్ప రాయలేను. దీంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. టీచర్‌ పాఠం చెబుతుంటే త్వరగా అర్థం చేసుకోలేకపోయేదాన్ని. దాంతో తోటిపిల్లలను అడిగి తెలుసుకుందామని ప్రయత్నించేదాన్ని. కానీ క్లాసులో వాళ్లెవరికీ నేనొకదాన్ని ఉన్నానన్న ఆలోచనే ఉండేది కాదు. కష్టంగా అనిపించేది. అప్పుడు నాలాంటి వారి కోసం నడుపుతున్న ఒక ఎన్జీవో గురించి కనుక్కున్నారు నాన్న. అది నా జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది’ అంటోంది నిర్మా. 

బ్రెయిలీ నేర్చుకున్నా...

నిర్మా ఉండే గ్రామానికి 13 కిలోమీటర్ల దూరంలో ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద బ్లైండ్‌’ అనే సేవాసంస్థ ఉంది. అంధులు, వైకల్యం ఉన్నవారికి చేయూతని అందిస్తోన్న ఆ సంస్థలో ఆమెను చేర్చాడు తండ్రి. ‘అక్కడే బ్రెయిలీ నేర్చుకుంటూ చదువు కొనసాగించి పదో తరగతి పాసయ్యా. ఆ తర్వాత అహ్మదాబాద్‌ వెళ్లి చదువుకున్నా. గుజరాత్‌ యూనివర్శిటీలో బీఏ పూర్తిచేశా. టీచర్‌ అవ్వాలనే కలతో బీఈడీ చదువుతున్నా. మూడేళ్ల క్రితం నాన్న చనిపోతే, అమ్మ ఒంటరిగానే ఇంటి బాధ్యతలు చూసుకుంటూ నన్ను చదివిస్తోంది’ అంటుందీమె. 

ఫుట్‌బాల్‌ గురించి విని...

కాలేజీలో తనలాంటి అంధ విద్యార్థి విష్ణు వఘేలా ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడని తెలిసి, ఓసారి వివరాలు అడిగింది నిర్మా. ఫుట్‌బాల్‌ ఆడే విధానం నచ్చి, ఆసక్తి పెంచుకుంది. ‘అప్పటివరకు ఫుట్‌బాల్‌ గురించి తెలీదు. విష్ణుని నేర్పమని అడిగా. తీరా పాస్, కిక్‌ నేర్చుకున్నప్పుడు కిందపడి దెబ్బలు తగలడం, తోటి క్రీడాకారుడిని ఢీకొనడం జరిగేవి. కంగారు పడేదాన్ని. మొత్తమ్మీద ఎలాగో నానా కష్టాలూ పడి ఈ క్రీడలో శిక్షణ తీసుకున్నా. బాగా ఆడగలను అని నామీద నాకు నమ్మకం వచ్చాక పోటీల్లో పాల్గొంటున్నా. మూడేళ్ల నుంచి పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడాను. రోజూ దాదాపు నాలుగైదు గంటలు ఆట ప్రాక్టీస్‌ చేస్తా. అందులో భాగంగా యోగా, రన్నింగ్, వర్కవుట్లు తప్పనిసరిగా ఉంటాయి’ అని చెబుతున్న నిర్మా, ‘ద ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌(ఐబీఎస్‌ఏ)’ ఛాంపియన్‌షిప్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడింది. మాతృదేశం తరఫున ఇటీవల అంతర్జాతీయస్థాయి పోటీలకు ఇంగ్లండ్, జపాన్‌ వెళ్లింది. ‘విమానమెలా ఉంటుందో కూడా తెలియని నేను విదేశాలకి వెళ్లడంకన్నా, దేశం కోసం ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాలన్నదే నా లక్ష్యం’అని చెబుతున్న నిర్మా కల నెరవేరాలని కోరుకుందాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్