ముఖానికి పసుపు వాడేటప్పుడు..!

ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో పసుపుది కీలక పాత్ర. అందుకే ఫేస్‌ప్యాక్‌, స్క్రబ్‌.. వంటివి తయారుచేసే క్రమంలో దీన్ని విరివిగా వాడుతుంటాం. ఇందులోని సుగుణాలు, ఔషధ గుణాలు పలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి మోముకు మెరుపును అందిస్తాయి.

Published : 24 Oct 2023 14:07 IST

ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో పసుపుది కీలక పాత్ర. అందుకే ఫేస్‌ప్యాక్‌, స్క్రబ్‌.. వంటివి తయారుచేసే క్రమంలో దీన్ని విరివిగా వాడుతుంటాం. ఇందులోని సుగుణాలు, ఔషధ గుణాలు పలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి మోముకు మెరుపును అందిస్తాయి. అయితే దీన్ని వాడే క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్లు చర్మ అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుందాం రండి..

20 నిమిషాలకు మించి వద్దు!

పసుపును రోజ్‌వాటర్, పాలు, నీళ్లు.. వంటి పదార్థాల్లో కలుపుకొని ముఖానికి పూతలు వేసుకోవడం మనకు అలవాటే! అయితే ఈ క్రమంలో కొంతమంది ఎక్కువ మెరుపు రావాలన్న ఉద్దేశంతో నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు ఆ ప్యాక్‌ తొలగించకుండా అలానే ఉండిపోతారు. నిజానికి పసుపు కలిపిన ఫేస్‌ప్యాక్ /స్క్రబ్‌ ఏదైనా సరే.. 20 నిమిషాలకు మించి ఉంచుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సమయం పాటు శుభ్రం చేసుకోకుండా ఉండిపోతే.. ముఖంపై పసుపు రంగు మాదిరి మచ్చలు ఏర్పడడంతో పాటు మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉందట!

సబ్బు వాడద్దు!

సాధారణంగా ముఖం కడుక్కోవాలనుకున్నప్పుడు సబ్బు ఉపయోగించడం మనకు అలవాటే! ఫేస్‌ప్యాక్‌/స్క్రబ్‌ వేసుకున్నా.. తొలగించుకునే క్రమంలో సబ్బుతో రుద్దుకొని మరీ శుభ్రం చేసుకుంటాం. అయితే పసుపుతో వేసుకున్న ఫేస్‌ప్యాక్‌/స్క్రబ్‌.. వంటివి తొలగించుకునే క్రమంలో సబ్బు వాడద్దంటున్నారు నిపుణులు. అయితే మూడు నాలుగ్గంటల తర్వాత మాత్రం గాఢత తక్కువగా ఉండే ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోమంటున్నారు. ఈ విషయంలో మీకు ఇంకా సందేహంగా ఉన్నట్లయితే ఓసారి నిపుణుల సలహా తీసుకోవచ్చు. అలాగే ముఖం కడుక్కున్నాక మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోకండి.

ఈ విషయంలో జాగ్రత్త!

కళ్ల కింద నల్లటి వలయాలు, క్యారీ బ్యాగుల్ని దూరం చేసుకోవడానికి.. కంటి అలసటను తగ్గించడానికి కొంతమంది కొన్ని ఐ ప్యాక్స్ వేసుకుంటారు. అయితే ఇలాంటి వాటిలో పసుపు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

వీటితో పాటు పసుపు ఉపయోగించి తయారుచేసిన ఫేస్‌ప్యాక్స్‌ ముఖంపై సమానంగా పరచుకునేలా వేసుకోవడం, పూర్తిగా తొలగిపోయేలా శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే! అలాగే ఈ క్రమంలో వేడి నీళ్ల కంటే చల్లటి/గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే వాడమంటున్నారు నిపుణులు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పసుపు చర్మానికి మేలు చేసి చక్కటి మేని ఛాయను అందిస్తుంది.. మొటిమలు, మచ్చలు.. వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్