71 ఏళ్ల అందం.. మనసులు గెలిచింది!

అందాల పోటీల్లో పాల్గొనాలనేది ఆమె చిరకాల కోరిక. ఇటీవలే జరిగిన ‘మిస్‌ టెక్సాస్‌ యూఎస్‌ఏ’ పోటీల్లో పాల్గొని తన కోరికను నెరవేర్చుకుంది. ప్రతి రౌండ్లో ప్రతిభ కనబరిచినా కిరీటం మాత్రం గెలవలేకపోయింది. అయితేనేం.. అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకుంది. అదెలా.. అంటారా? తన వయసు పరంగా!

Published : 26 Jun 2024 12:22 IST

(Photos: Instagram)

అందాల పోటీల్లో పాల్గొనాలనేది ఆమె చిరకాల కోరిక. ఇటీవలే జరిగిన ‘మిస్‌ టెక్సాస్‌ యూఎస్‌ఏ’ పోటీల్లో పాల్గొని తన కోరికను నెరవేర్చుకుంది. ప్రతి రౌండ్లో ప్రతిభ కనబరిచినా కిరీటం మాత్రం గెలవలేకపోయింది. అయితేనేం.. అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకుంది. అదెలా.. అంటారా? తన వయసు పరంగా! ప్రస్తుతం ఆమె వయసు 71 ఏళ్లు. ఈ అందాల పోటీల చరిత్రలోనే అతిపెద్ద వయస్కురాలైన కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది మరిస్సా. మనసులోని తపనకు వయసు ఏమాత్రమూ అడ్డు కాదని నిరూపించడానికే ఈ పోటీల్లో పాల్గొన్నానంటోన్న మరిస్సా కథ మీరూ చదివేయండి!

ఫిట్‌నెస్‌ లవర్!

అందం, నాజూకైన శరీరాకృతి, బ్యూటిఫుల్‌ స్మైల్‌.. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోదు 71 ఏళ్ల మరిస్సా సొగసు. టెక్సాస్‌లోని ‘El Paso’ అనే నగరంలో పుట్టి పెరిగిన ఆమె.. చిన్నతనం నుంచి ఫిట్‌నెస్‌పై మక్కువ పెంచుకుంది. అయితే ఇంటి బాధ్యతల దృష్ట్యా తన ఈ అభిరుచిని కొన్నేళ్ల పాటు పక్కన పెట్టేసిన ఆమె.. 40 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే బరువులెత్తడాన్ని తన జీవనశైలిగా మార్చుకుంది. ఆపై జాతీయ స్థాయిలో జరిగిన పలు ఫిట్‌నెస్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరించింది. ‘మహిళలే సాటి మహిళల్లో స్ఫూర్తి నింపగలరు’ అనే సిద్ధాంతాన్ని నమ్మే మరిస్సా.. గత 30 ఏళ్లుగా ఫిట్‌నెస్‌కు సంబంధించిన కమ్యూనిటీల్లో చురుగ్గా పాల్గొంటూ.. వివిధ కార్యక్రమాల ద్వారా మహిళల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతోంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగానూ తన ఫిట్‌నెస్‌ రొటీన్‌ని పంచుకోవడంతో పాటు.. ఫిట్‌నెస్‌ పాఠాలూ నేర్పుతూ.. ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

మోడల్‌గా మెరిసి..!

ప్రస్తుతం ఏడు పదుల వయసులోనూ చక్కటి శరీరాకృతిని మెయింటెయిన్‌ చేసే మరిస్సా.. గతంలో ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌గా పనిచేసి రిటైరైంది. అంతేకాదు.. మల్లెతీగలాంటి తన ఫిజిక్‌ ఆమెకు మోడలింగ్‌ అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే పలు ఫ్యాషన్‌ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించడంతో పాటు.. టీవీ ప్రకటనల్లోనూ నటించింది. అయితే మరిస్సా బకెట్‌ లిస్ట్‌లో అందాల పోటీల్లో పాల్గొనడం కూడా ఒకటి. కానీ వయసు మీరడంతో ఇన్నాళ్లూ తనకు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే గతేడాది మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ వయోపరిమితిపై ఉన్న నిబంధనల్ని ఎత్తేయడంతో.. మరిస్సాకు మార్గం సుగమమైంది. ఇలా 71 ఏళ్ల వయసులో ఇటీవలే ముగిసిన ‘మిస్‌ టెక్సాస్‌ యూఎస్‌ఏ’ పోటీల్లో పాల్గొందామె. తద్వారా ఈ అందాల పోటీల చరిత్రలోనే అతి పెద్ద వయస్కురాలైన కంటెస్టెంట్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ వయసులోనూ స్టేజిపై ఆమె పెర్ఫార్మెన్స్‌కు, ఫిజిక్‌కు న్యాయనిర్ణేతలే కాదు.. ఎంతోమంది ముగ్ధులయ్యారు.

వాళ్లు అలా అడిగేసరికి..!

మనసులోని తపనను నెరవేర్చుకోవడానికి వయసు అడ్డు కాదని నిరూపించిన మరిస్సా.. ఈ పోటీల్లో విజయం సాధించకపోయినా.. తనదైన ఆత్మవిశ్వాసంతో ఎంతోమంది మనసులు గెలిచింది. తనకు జయాపజయాలు ముఖ్యం కాదని, తోటి మహిళల్లో స్ఫూర్తి నింపడానికే ఈ పోటీల్లో పాల్గొన్నానంటోందీ ఓల్డెస్ట్ బ్యూటీ.

‘అందాల పోటీల్లో పాల్గొనాలన్నది నా కోరిక. ఇన్నాళ్లకు అది నెరవేరింది. అయితే ఇందులో జయాపజయాల గురించి నేను ఆలోచించలేదు. ఏ వయసులోనైనా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలియజేసేందుకే ఈ పోటీల్లో పాల్గొన్నా. ఈ రెండూ మన జీవనశైలిలో ఉంటే వయసు పెద్ద లెక్కే కాదు.. అందాల పోటీల్లో భాగంగా వేదికపై క్యాట్‌వాక్‌ చేయడం నాకెంతో నచ్చింది. న్యాయనిర్ణేతలు, తోటి కంటెస్టెంట్లు, ప్రేక్షకులు నన్నెంతో ప్రోత్సహించారు. ఇంతమంది మద్దతు నాకు లభిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. పోటీ ముగిశాక చాలామంది మహిళలు నా వద్దకొచ్చి ‘మీరే మా స్ఫూర్తి.. మా కోసం ఓ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించచ్చుగా!’ అని అడిగారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నా ఆశయం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది..’ అంటోందీ అందాల రాణి.

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌.. అదే!

ఫిట్‌నెస్‌ అంటే తన దృష్టిలో నాజూకైన శరీరాకృతి కాదని, ఆరోగ్యంగా-దృఢంగా ఉండడమే అంటోంది మరిస్సా.

‘ఫిట్‌నెస్‌ అంటే చాలామంది సన్నగా, నాజూగ్గా మారడమే అనుకుంటారు. కానీ ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడే శరీరం పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు నేను భావిస్తా. అలాగే నా ఫిట్‌నెస్‌ రొటీన్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. వారానికి మూడు రోజులు వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తా. మా ఇంటికి దగ్గర్లోని కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం. నా పెట్‌ డాగ్‌తో కలిసి కొండ ఎక్కి దిగుతా. ఇక మిగతా మూడు రోజులు స్పిన్నింగ్‌ వంటి కార్డియో వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తా. ఇవే నా శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. ఈ వయసులోనూ నాకు మోడలింగ్‌ చేయాలని ఉంది. ఆ అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయనుకుంటున్నా..’ అంటోందీ బ్యూటిఫుల్‌ గ్రానీ. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన డేనియల్‌ను వివాహం చేసుకున్న మరిస్సా.. ప్రస్తుతం తన అభిరుచులపై దృష్టి పెడుతూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది.

ఇక ‘మిస్‌ టెక్సాస్‌ యూఎస్‌ఏ – 2024’ పోటీల్లో డాలస్‌కు చెందిన అరియెనా విజయం సాధించింది. పర్యావరణహిత ఇళ్లను నిర్మించడం, ఇంటి అలంకరణ వస్తువుల్ని తయారుచేయడంలో దిట్ట అయిన ఆమె.. ఈ ఏడాది క్యాలిఫోర్నియాలో జరగబోయే ‘మిస్‌ యూఎస్‌ఏ’ పోటీల్లో టెక్సాస్ తరపున పోటీపడనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్