అందుకే పెళ్లయ్యాక బీటెక్ చదివా..!

ముగ్గురూ ఆడపిల్లలు.. త్వరగా పెళ్లి చేసి భారం దించుకోమని బంధువులిచ్చే ఉచిత సలహాలు! ఇలాంటి పరిస్థితుల్లో అందరు ఆడపిల్లల తండ్రులు ఎలా ఆలోచిస్తారో కానీ.. తమ తండ్రి మాత్రం తమను బరువుగా కాకుండా బాధ్యతగా పెంచాడంటోంది ఓ అమ్మాయి. క్రమశిక్షణ, విలువలు నేర్పుతూ మంచి జీవితాన్నివ్వడమే కాదు.. కెరీర్‌లోనూ రాణించేలా ప్రోత్సహించాడంటోంది.

Published : 18 Jun 2024 19:22 IST

(Representational Image)

ముగ్గురూ ఆడపిల్లలు.. త్వరగా పెళ్లి చేసి భారం దించుకోమని బంధువులిచ్చే ఉచిత సలహాలు! ఇలాంటి పరిస్థితుల్లో అందరు ఆడపిల్లల తండ్రులు ఎలా ఆలోచిస్తారో కానీ.. తమ తండ్రి మాత్రం తమను బరువుగా కాకుండా బాధ్యతగా పెంచాడంటోంది ఓ అమ్మాయి. క్రమశిక్షణ, విలువలు నేర్పుతూ మంచి జీవితాన్నివ్వడమే కాదు.. కెరీర్‌లోనూ రాణించేలా ప్రోత్సహించాడంటోంది. ఎన్నో సవాళ్లతో కూడుకున్న తన జీవితంలో అడుగడుగునా తన తండ్రి అందించిన సపోర్ట్‌ వల్లే జీవితంలో మంచి స్థితికి రాగలిగానని చెబుతోంది. ‘సాధారణంగా చాలా కుటుంబాల్లో అబ్బాయిలు తల్లిదండ్రుల ఆస్తికి వారసులు కావచ్చు.. కానీ ఆడపిల్లలు వారి విలువలకు వారసులు, అలాంటి ఉన్నత విలువల్నే తమ తండ్రి తమకు ఆస్తిగా అందించాడం’టూ మురిసిపోతోంది. తన జీవితంలో తన తండ్రి అందించిన స్ఫూర్తిని ‘Share Your Story’ వేదికగా ‘వసుంధర.నెట్’తో ప్రత్యేకంగా పంచుకుంది.

నా పేరు మమత. మాది వరంగల్‌. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. నా పదో తరగతి పూర్తికాకముందే హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాం. నాన్న ఇక్కడే ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. మాది మధ్య తరగతి కుటుంబం. ముగ్గురం అమ్మాయిలమే అయినా కష్టపడి చదివించారు మా అమ్మానాన్నలు. ‘చదువుతోనే భవిష్యత్తు!’ అంటూ ప్రతి క్షణం మమ్మల్ని వెన్నుతట్టేవారు. ఇక మా నాన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఓ తండ్రిలా క్రమశిక్షణ నేర్పడమే కాదు.. ఓ స్నేహితుడిలా మాతో మెలిగేవాడు. ఆసక్తి ఉన్న ప్రతి అంశంలో మమ్మల్ని ప్రోత్సహించారు. పరీక్షల్లో మాకు మంచి మార్కులొస్తే.. తనే ఏదో సాధించినంతగా మురిసిపోయేవారు. బహుమతులతో మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేసేవారు.

అయితే నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు నాన్న ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. మా పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే అక్క పెళ్లైంది. వాళ్లు కొన్నేళ్లు పుణేలో ఉన్నా.. ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడికొచ్చాకే అక్క డిగ్రీ పూర్తిచేసి.. ప్లేస్కూల్‌ ప్రారంభించింది. ఇక చెల్లి భర్త ప్రభుత్వోద్యోగి.. తనూ జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడింది. నా విషయానికొస్తే.. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే నన్ను మా మేనబావకు ఇచ్చి పెళ్లి చేయాలని మా బంధువులు నాన్నపై చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ అందుకు నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య వయోభేదం ఎక్కువ.. పైగా అబ్బాయికి చదువు లేదు, ఉద్యోగం లేదు. అయినా ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అతడినే పెళ్లి చేసుకోక తప్పలేదు. పెళ్లయ్యాక నన్ను చదివిస్తానన్న ఒక్క షరతు మీదే నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. వివాహం తర్వాత నాన్నే మా వారితో వ్యాపారం పెట్టించారు. నేను ఆర్థికంగా నిలబడేలా అన్ని విధాలుగా నాకు సహకరించారు. పెళ్లయ్యాకా ఆయన ప్రోత్సాహంతోనే బీటెక్‌ పూర్తి చేశాను. బీటెక్‌ సెకండియర్‌లో ఉన్నప్పుడే పాప పుట్టింది. ఆపై పాపను అమ్మ దగ్గర వదిలేసి కాలేజీకి వెళ్లేదాన్ని. అలా చదువు పూర్తిచేశా.

******

ఆ తర్వాత ఓ ప్రైవేట్‌ సంస్థలో జాబ్‌లో చేరాను. ఓవైపు ఉద్యోగం చేస్తూ, పాపను చూసుకుంటూనే.. మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఈ క్రమంలోనే రెండో పాప పుట్టింది. మేనరికం కారణంగా.. నా ఇద్దరు పిల్లలు ఐదేళ్లొచ్చే వరకు వివిధ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మావారికి వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఆపై ఇతర వ్యాపారాలు ప్రారంభించినా సక్సెస్‌ కాలేకపోయారు. వీటన్నిటితో ఒక్కోసారి ఏడుపొచ్చేసేది. ఈ క్రమంలో నేనే పైచదువులు చదవాలనుకున్నా. ఎంబీఏ ఫైనాన్స్‌ చేశా. అప్పుడూ నాన్నే ఆర్థికంగా అండగా నిలిచారు.. నన్ను ప్రోత్సహించారు. కష్టపడి చదివి కాలేజీలో టాప్‌ వచ్చాను. ఆపై ఓ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలో చేరాను. అకౌంట్స్‌తో పాటు ఇతర విభాగాలూ చూసుకునేదాన్ని. ఈ ఉద్యోగం నాకు అనుభవంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చింది. దాంతో చిన్న చిన్న వ్యాపార ప్రయత్నాలు కూడా చేశాను. ఆపై మావారు వ్యవసాయం చేస్తానంటే కుటుంబంతో సహా ఊరికి వెళ్లిపోయాం.

ఊళ్లో ఉన్నా.. నా ధ్యాసంతా కెరీర్ పైనే ఉండేది. ఈ క్రమంలో మళ్లీ ప్రయత్నించి ఉద్యోగం సంపాదించాను. ఇలా ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని కెరీర్‌లో నేను అనుకున్న స్థాయికి చేరగలిగాను అని సంతోషించే లోపే నాన్న నాకు శాశ్వతంగా దూరమయ్యారు. అది నా జీవితంలోనే పూడ్చుకోలేని లోటు!

ఇన్నాళ్లూ నాన్నుంటే చాలు.. ఏదైనా సాధించగలను అనుకునేదాన్ని. ఆ ధైర్యం, ప్రోత్సాహం నాకు శాశ్వతంగా దూరమయ్యాయన్న ఆలోచనే నా మనసును మెలిపెడుతుంది. అయినా ఈ బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నా. ఇన్నాళ్లూ నాన్నిచ్చిన స్ఫూర్తి, ధైర్యంతోనే జీవితంలో, కెరీర్‌లో ముందుకు సాగాను. ఇదే స్ఫూర్తిని ఇక పైనా కొనసాగించాలనుకుంటున్నా. మా ముగ్గురు అక్కచెల్లెళ్లను నాన్న ఎంత బాధ్యతగా పెంచారో.. నేనూ నా పిల్లల్ని అలాగే పెంచాలనుకుంటున్నా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఎమోషనల్‌గా, కుటుంబ పరంగా ఎన్ని సమస్యలొచ్చినా.. వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నా. నాన్నిచ్చిన విలువలే నాకు ఆస్తిపాస్తులయ్యాయి. ఇప్పుడు వాటినే నా పిల్లలకు అందిస్తే నాన్న రుణం కొంతైనా తీర్చుకున్నదాన్నవుతా! లవ్యూ నాన్నా!

ఇట్లు,
మమత

మరి మీరూ.. మీ జీవితంలో జరిగిన మర్చిపోలేని, స్ఫూర్తిదాయకమైన సంఘటనలను 'వసుంధర. నెట్’ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్‌ని క్లిక్ చేయండి !

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్