వ్యర్థాలను తగ్గిస్తూ... ఫర్నిచర్‌ తయారుచేస్తూ..!

కొండలా పేరుకున్న చెత్తలో దుర్గంధాన్ని కూడా లెక్క చేయకుండా అందులోని వ్యర్థాలను సేకరించి ఒక బ్యాగులో నింపింది. వాటిని ఓ చిన్న మెషిన్‌ ద్వారా వేరు చేయడానికి ప్రయత్నించింది.

Published : 30 Jun 2024 02:18 IST

కొండలా పేరుకున్న చెత్తలో దుర్గంధాన్ని కూడా లెక్క చేయకుండా అందులోని వ్యర్థాలను సేకరించి ఒక బ్యాగులో నింపింది. వాటిని ఓ చిన్న మెషిన్‌ ద్వారా వేరు చేయడానికి ప్రయత్నించింది. అవి వేరు కాలేదు, అయినా పట్టుదల వీడలేదు. అలా మూడేళ్లపాటు చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఫలితం దక్కింది. చెత్త నుంచి రకరకాల వ్యర్థాలను వేరుచేసే టెక్నాలజీని కనిపెట్టింది. ఆ చెత్తను పాఠశాల ఫర్నిచర్‌గా మార్చింది. ఈ కృషికి జాతీయ, అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందింది నివేద ఆర్‌ఎమ్‌.

బెంగళూరులో పుట్టిన నివేద తన ఇంటి చుట్టుపక్కల పేరుకునే చెత్తను రీసైకిల్‌ చేయాలనే ప్రయత్నాన్ని చిన్నప్పటి నుంచే మొదలుపెట్టింది. ‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ పిలుపుతోపాటు పలు సామాజిక సేవాసంస్థలతోనూ కలిసి పని చేసింది. కాలేజీ తర్వాత ‘ట్రాష్‌కాన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ పేరుతో వ్యర్థాలవల్ల కలిగే అనర్థాలపై అందరిలో అవగాహన కలిగించేది. 

వేరు చేయడంలో...

వ్యర్థాలను తగ్గించడంపై నివేద అధ్యయనం మొదలుపెట్టింది. తన 22వ ఏట బెంగళూరు, చెన్నైలో చెత్త వేసే ప్రాంతాలన్నీ తిరిగేది. రకరకాల వ్యర్థాలన్నీ కలిసిపోయి ఉండటం చూసేది. ప్లాస్టిక్, వృథా ఆహారం, శానిటరీ నాప్‌కిన్లు, బిస్కట్‌ ర్యాపర్స్, చిప్స్‌ కవర్లన్నీ ఉండే చెత్త నుంచి ముందుగా దేనికది విడదీయాలనుకుంది. ‘ఒక చిన్న మిషన్‌ కొనడానికి అమ్మని డబ్బులు అడిగా. ‘ట్రాష్‌కాన్‌ ల్యాబ్స్‌’ ప్రారంభించి మూడేళ్లపాటు రకరకాల ప్రయోగాలు చేశా. ఆ చెత్తను విడదీయలేక ఒకసారి మిషన్‌ విరిగిపోయింది. మళ్లీ మరొకదాన్ని సిద్ధం చేసుకొన్నా. ప్రయత్నాలు మాత్రం మానలేదు. అలా పలు ప్రయోగాల తర్వాత వ్యర్థాలను విడదీయడమే కాదు, వాటిని రీసైకిల్‌ చేసి ప్లైవుడ్‌లాంటిదాన్ని తయారుచేయగలిగామని’ చెబుతుంది నివేద.

టన్నులకొద్దీ...

‘ట్రాష్‌కాన్‌ ల్యాబ్స్‌’లో ప్రస్తుతం రోజుకి 1,100 టన్నుల వృథాను సేకరించి రీసైకిల్‌ చేస్తున్నారు. అలాగే ఇక్కడ తయారవుతున్న మెటిరియల్‌తో 10వేల మందికిపైగా ప్రభుత్వపాఠశాలల పిల్లల కోసం బెంచీలు, డెస్క్‌లు, తరగతి బల్లలు, కుర్చీలు సహా తదితర ఫర్నిచర్‌ తయారుచేసిచ్చారు. ఆరు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రాష్‌కాన్స్‌ మెషీన్లు వ్యర్థాలను వేరుచేస్తున్నాయి. ‘స్కూల్స్‌లో మేం అందించిన సౌకర్యాలతో డ్రాప్‌అవుట్స్‌ తగ్గారు. పెద్దవాళ్లలోనే కాదు, పిల్లలకూ వృథా తగ్గించాలనే అవగాహన కలిగించాలి. అప్పుడే ఈ సమస్య తగ్గుతుంది. గత 20 ఏళ్లతో పోలిస్తే వ్యర్థాలు రెట్టింపు పెరిగాయి. ఇండియాలో మాత్రమే రోజూ 2లక్షల టన్నుల వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. వీటిని కాల్చడంవల్ల ఇప్పటికే ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలతో ఎందరో బాధపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో 20 ఏళ్లకు భూమి అంతా చెత్తతో నిండిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. అందరూ దీనిపై అవగాహన తెచ్చుకోవాల్సిందే’ అంటున్న నివేద కృషిని రెడ్‌క్రాస్‌ ప్రోత్సహిస్తోంది. ఈమె కనిపెట్టిన టెక్నాలజీని ప్రపంచబ్యాంకు గుర్తించి మాల్దీవులు, దుబాయి వంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి సిఫారసు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్