ఓ విప్లవంగా... సైక్లింగ్‌!

‘మగరాయుడిలా ఆ సైకిల్‌ సంగతి నీకెందుకు’ అప్పట్లో సైకిల్‌ అంటే సరదాపడే అమ్మాయిలకు ఇంట్లో ఇదే అనుభవం ఎదురయ్యేది. మగపిల్లలకు మాత్రమే సైకిల్‌ అని భావించేవారు.  దీంతో తండ్రి, సోదరుడు లేదా భర్త నడిపితేనే సైకిల్‌పై కూర్చొని తన కలను ఆడపిల్ల తీర్చుకోవాల్సి వచ్చేది.

Published : 23 Jun 2024 02:18 IST

‘మగరాయుడిలా ఆ సైకిల్‌ సంగతి నీకెందుకు’ అప్పట్లో సైకిల్‌ అంటే సరదాపడే అమ్మాయిలకు ఇంట్లో ఇదే అనుభవం ఎదురయ్యేది. మగపిల్లలకు మాత్రమే సైకిల్‌ అని భావించేవారు.  దీంతో తండ్రి, సోదరుడు లేదా భర్త నడిపితేనే సైకిల్‌పై కూర్చొని తన కలను ఆడపిల్ల తీర్చుకోవాల్సి వచ్చేది. అయితే ‘సైకిల్‌ మహిళలూ నడపొచ్చు. ఇది ఆమె హక్కు కూడా’ అనే పిలుపు మూడున్నర దశాబ్దాల క్రితం మొదలైంది. దీనికి తమిళనాడు పుదుక్కోటై జిల్లా వేదికైంది. చరిత్రలోనే ఇదొక సామాజిక ఉద్యమంగా నిలింది. ఈ ఘనత ‘అరివోలి ఇయక్కం’ ప్రాజెక్టును ప్రవేశపెట్టిన అప్పటి జిల్లా కలెక్టర్‌ షీలారాణి ఛంకత్‌ది. సైకిల్‌ నేర్చుకొని ఆర్థిక పురోగతిని సాధించాలంటూ మహిళలందరిలో చైతన్యాన్ని నింపారీమె. 

1980ల్లో ఆసక్తి ఉంటే అన్నయ్య లేదా తమ్ముడివద్ద ఆడపిల్లలు సైకిల్‌ నేర్చుకోవడం రహస్యంగానే జరిగేది. ఆ తర్వాత నడపాలన్నా కూడా నిర్మానుష్యమైన ప్రాంతాలనే ఎంచుకోవాల్సి వచ్చేది. ఈ సంప్రదాయాన్ని మార్చాలనుకున్నారు షీలారాణి. అలా పుదుక్కోటై జిల్లాలో ప్రారంభమైంది ‘అరివోలి ఇయక్కం’ ప్రాజెక్టు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు సైకిల్‌లో శిక్షణనివ్వడానికి శిబిరాల ఏర్పాటుతోపాటు కోఆర్డినేటర్స్‌ను నియమించారు. సైకిల్‌ తొక్కడం ద్వారా పొందే ప్రయోజనాలను మహిళలకు అవగాహన కలిగించడంలో జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా పనిచేసింది. విద్య, ఉద్యోగం, ఉపాధి వంటివి ఎలా సాధించొచ్చో పాటల రూపంలో కోఆర్డినేటర్స్‌ అవగాహన కలిగించేవారు. స్వీయసామర్థ్యాలను పెంపొందించుకోవడంలో సైకిల్‌ శిక్షణ ఎలా ఉపయోగపడుతుందో చెప్పేవారు. సైకిల్‌ మహిళల హక్కు అనే పిలుపు అందరినీ మేల్కొనేలా చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఓ ఉద్యమానికి తెర లేపినట్లైంది. ప్రతి మహిళ శిక్షణాశిబిరాలకు చేరుకునేవారు. ఉత్సాహంగా నేర్చుకొని రహదారుల్లో ధైర్యంగా, స్వేచ్ఛగా సైకిల్‌ తొక్కుతూ తమ హక్కును ప్రదర్శించేవారు. ఒకరిద్దరితో మొదలైన ఈ ఉద్యమం ఏడాది తిరక్కుండానే లక్షమందికిపైగా చేరింది. ఉపాధ్యాయులు, నర్సులు, మహిళారైతులు, కూలీలు, విద్యార్థులు, గృహిణులు... ఇలా అన్ని స్థాయులవాళ్లూ తాము సైతం అంటూ సైకిల్‌పై ప్రయాణించి సాధికారతను సాధించారు. ఈ ‘సైక్లింగ్‌ మూవ్‌మెంట్‌’ మహిళలందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. అంతేకాదు, వీరందరికీ సొంతంగా సైకిల్‌ కొనుగోలుకు బ్యాంకు రుణాలు వచ్చేలా చేశారు షీలారాణి.

మరవలేను...

‘సైక్లింగ్‌ను ఓ విప్లవంలా మార్చగలిగా. లక్షలమంది శిక్షణపొంది జీవితంలో చక్రాన్ని తిప్పారు. విద్యార్థులు కాలేజీలకు, ఉద్యోగులు సొంతంగా సైకిల్‌పై ఆఫీసులకు వెళ్లడం మొదలైంది. రహదారుల్లో ఎక్కడ చూసినా మహిళలు సైకిళ్లపై కనిపించేవారు. గృహిణులు కూడా నిత్యావసర వస్తువులు తేవడానికీ దీన్నే ఉపయోగించేవారు. మొత్తంమీద మహిళలకు సైకిల్‌ సాధికారతను సాధించేలా చేయగలిగింది. 1992 మహిళాదినోత్సవానికి తమ సైకిల్‌ బార్స్‌లో జాతీయపతాకాన్ని ఉంచి, బెల్‌ కొడుతూ వేలమంది మహిళలు చేసిన ర్యాలీ మరవలేనిది. అదే ఏడాది ‘అరివోలి’ నేతృత్వంలో నిర్వహించిన ‘ఎగ్జిబిట్‌ అయాన్‌-కం-కాంటెస్ట్స్‌’లో వారమంతా 70వేలమందికి పైగా మహిళలు సైక్లింగ్‌లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఇది తమ హక్కు అన్నట్లుగా మహిళల కళ్లల్లో అప్పుడు తొణికిన ఆత్మవిశ్వాసం నాకింకా గుర్తుంద’ంటారు షీలారాణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్