Shafali Verma: క్రికెట్‌ కోసం జుట్టు కత్తిరించుకున్నా!

హరియాణా.. ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువగా ఉండే రాష్ట్రమిది. అమ్మాయిలు చదువుకోకూడదు.. ఆటల్లో రాణించకూడదు అనే నియమాలు ఉంటాయిక్కడ. అయినా సమాజాన్ని ఎదిరించి.. తనకు నచ్చిన క్రీడలో రాణించాలనుకుందో అమ్మాయి. ఆడపిల్ల అంటూ ఆట నేర్పడానికి నిరాకరిస్తే.. అబ్బాయిలా వేషం మార్చుకొని మరీ క్రీడపై పట్టు పెంచుకుంది.

Updated : 29 Jun 2024 22:06 IST

(Photos: Instagram)

హరియాణా.. ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువగా ఉండే రాష్ట్రమిది. అమ్మాయిలు చదువుకోకూడదు.. ఆటల్లో రాణించకూడదు అనే నియమాలు ఉంటాయిక్కడ. అయినా సమాజాన్ని ఎదిరించి.. తనకు నచ్చిన క్రీడలో రాణించాలనుకుందో అమ్మాయి. ఆడపిల్ల అంటూ ఆట నేర్పడానికి నిరాకరిస్తే.. అబ్బాయిలా వేషం మార్చుకొని మరీ క్రీడపై పట్టు పెంచుకుంది. ఈ పట్టుదలే ఇప్పుడు ఆమెను ప్రపంచంలోనే ది బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్లలో ఒకరిగా నిలబెట్టింది. రెండు పదుల వయసులోనే భారతీయ మహిళల క్రికెట్‌లో సంచలనంగా మారిన షఫాలీ వర్మ.. తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ (197 బంతుల్లో 205 పరుగులు) చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కిందామె. మిథాలీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచింది షఫాలీ. ఈ నేపథ్యంలో ఈ యువ మహిళా ప్లేయర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

ఒక్క మ్యాచ్‌.. రెండు ఘనతలు!

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌-దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఓపెనర్‌ షఫాలీ వర్మ తన అద్భుత బ్యాటింగ్‌ విన్యాసంతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఆట మొదలైన తొలి రోజే 197 బంతుల్లో 205 పరుగులు చేసి.. టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆవిర్భవించింది షఫాలీ. అంతేకాదు.. మిథాలీ రాజ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గానూ నిలిచిందీ యంగ్‌ క్రికెటర్‌. 22 ఏళ్ల క్రితం మిథాలీ ఇంగ్లండ్‌పై 407 బంతుల్లో 214 పరుగులు చేసింది. అయితే ప్రస్తుత టెస్టులో షఫాలీకి జత కలిసిన స్మృతి కూడా 149 పరుగులతో విజృంభించడంతో మన జట్టు ఒక్క రోజులోనే 525 పరుగులు చేసింది. ఇలా టెస్టుల్లో ఒక్క రోజులో ఎక్కువ పరుగులు చేయడం కూడా మహిళల టెస్టు క్రికెట్లో ఒక రికార్డు కావడం మరో విశేషం.

‘గత మూడు వన్డేల్లో పెద్ద స్కోర్లు సాధించలేకపోయా. కానీ ఈ మ్యాచ్‌కు ముందు నా బలాబలాల్ని ఓసారి పునశ్చరణ చేసుకున్నా. ఇవే నేను డబుల్‌ సెంచరీ చేసే శక్తినిచ్చాయి. రోజంతా ఆడాలనుకున్నా.. ఆడాను!’ అంటూ తన బ్యాటింగ్‌ సీక్రెట్‌ని బయటపెట్టిందీ యువ బ్యాటర్.

అబ్బాయిలతో కలిసి ఆడా!

‘మనసు పెట్టి చేసే ఏ పనైనా మనకు జీవితాన్నిస్తుంది..’ చిన్నతనం నుంచి నేను నమ్మే సిద్ధాంతమిదే! నిజానికి క్రికెట్‌లోకి రావాలని కానీ, వస్తానని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా పదేళ్ల వయసులో మా సొంతూరు రోహ్‌తక్‌లో కొంతమంది అబ్బాయిలు క్రికెట్‌ ఆడడం చూశా. వాళ్లు కొట్టే బౌండరీలు చూస్తుంటే నాకు ముచ్చటేసింది. ఎలాగైనా ఈ ఆట నేర్చుకోవాలనిపించింది. కానీ మా ప్రాంతంలో అమ్మాయిల్ని ఇలాంటి ఆటలు ఆడనిచ్చే వారు కాదు. అయినా ధైర్యం చేశా. నా మనసులోని కోరికను మా నాన్నతో పంచుకున్నా. తనూ ప్రోత్సహించాడు. ‘భారత మహిళల జట్టులో చోటు సంపాదించాలంటే నీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. అదే నీకు అవకాశాలు తెచ్చిపెడుతుంది..’ అంటూ వెన్నుతట్టాడు. నాన్న మాటలు నాలో మరింత స్ఫూర్తి నింపాయి. ఈ క్రమంలోనే నాకు ఇష్టమైన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టా. అయితే ఆ సమయంలో రోహ్తక్‌లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు లేకపోవడం, ఆడపిల్లలకు ఈ క్రీడలో ట్రైనింగ్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో.. అబ్బాయిగా వేషం మార్చుకొని.. అబ్బాయిలతోనే క్రికెట్‌ సాధన చేసేదాన్ని.

జుట్టు కత్తిరించుకున్నా!

నేను చిన్నతనం నుంచే ఎత్తు ఎక్కువగా ఉండేదాన్ని. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే క్రమంలో ఇది కూడా నాకు బాగా కలిసొచ్చింది. అంతేకాదు.. మొదట్లో నా జుట్టు చాలా పొడవుగా ఉండేది. నడుస్తుంటే నా నడుమును తాకే నా జుట్టును చాలా ఇష్టపడేదాన్ని. కానీ అబ్బాయిలతో ఆడే క్రమంలో ఇదే నాకు అడ్డుగా అనిపించింది. అందుకే జుట్టు కత్తిరించుకున్నా. ఆ సమయంలో ఇది నా గుర్తింపును దాచి ఉంచడమే కాదు.. ఆడే క్రమంలో సౌకర్యాన్నీ అందించింది. అందుకే అప్పట్నుంచి ఇదే హెయిర్‌స్టైల్‌ని కొనసాగిస్తున్నా. జుట్టు విషయంలోనే కాదు.. నా వేషాన్నీ అబ్బాయిలా మార్చుకున్నా. మొదట్లో నా డ్రస్సింగ్‌ చూసి కొంతమంది వింతగా చూసేవారు. ఎవరెలా చూసినా, ఏమనుకున్నా నాకు నచ్చినట్లుగా నేను ఉండాలనుకున్నా. ఈ మనస్తత్వమే నాకు నచ్చిన రంగంలో నన్ను నిలబెట్టింది. ఇక ట్యాటూలంటే నాకు చాలా ఇష్టం. మొదట్లో అమ్మానాన్న ఏమంటారోనన్న భయంతో దుస్తులు కవరయ్యే ప్రదేశాల్లో మాత్రమే ట్యాటూలు వేయించుకునేదాన్ని. కానీ ఆ తర్వాత నా ఇష్టాన్ని మా ఇంట్లో వాళ్లూ గౌరవించడంతో మరిన్ని ట్యాటూలు వేయించుకున్నా.

అప్పుడంతా మారిపోయింది!

ఆడపిల్లనన్న కారణంతో చిన్నతనంలో సమాజం నుంచి ఎంతో వివక్షను ఎదుర్కొన్నా. క్రికెట్‌లోకి వస్తానన్నప్పుడూ చాలామంది నన్ను నిరుత్సాహ పరచాలని చూశారు. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. మా నాన్న చిన్న జ్యుయలరీ షాప్‌ నడిపేవారు. మొదట్లో ట్రైనింగ్‌ కోసం, పోటీల్లో పాల్గొనడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆర్థికంగా పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయినా నాన్న ప్రోత్సాహంతో ముందుకు సాగాను. ఫిట్‌నెస్‌ కోసం రోజూ రొట్టె, సబ్జీ (కాయగూరలన్నీ కలిపి చేసే కూర) తప్పకుండా తీసుకునేదాన్ని. నడక, పరుగు, జాగింగ్‌.. వంటి వ్యాయామాలు చేసేదాన్ని. ఈ కష్టానికి ప్రతిఫలంగా నా 15 ఏళ్ల వయసులో భారత మహిళల జట్టులో చోటు దక్కింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అతి పిన్న వయసులో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి క్రీడాకారిణిని కూడా నేనే అని గర్వంగా చెబుతా. నేను ఆటలో రాణించడం చూశాక మా ఊళ్లో నన్ను చూసే దృష్టి కోణం మారింది. నన్ను ఈ క్రీడలోకి వద్దన్న వారే.. ఇప్పుడు తమ కూతుళ్లకు నన్ను స్ఫూర్తిగా తీసుకోమని సలహా ఇస్తుంటే సంతోషంగా అనిపిస్తుంటుంది. ఏదేమైనా గతేడాది అండర్‌-19 టీ20 మహిళల ప్రపంచకప్ నెగ్గడం, ఆ జట్టుకు నేను కెప్టెన్‌గా వ్యవహరించడం మర్చిపోలేని అనుభూతి! ఆ సమయంలో నన్ను అభినందించడానికి వచ్చిన అతిథులతో మా ఇల్లు నిండిపోయింది. అది చూసి మా అమ్మానాన్నల హృదయం ఉప్పొంగింది. ఒక కూతురిగా నాకు అంతకంటే ఇంకేం కావాలి?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్