Hina Khan: రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నా..!

రొమ్ము క్యాన్సర్‌.. లక్షణాలేవీ బయటపడకుండా చాప కింద నీరులా విస్తరిస్తుందీ మహమ్మారి. జీవనశైలి, వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది మహిళలకు శాపంగా మారుతోంది. ఇటీవలే తానూ ఈ వ్యాధి బారిన పడ్డానంటూ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌.

Published : 29 Jun 2024 12:45 IST

(Photos: Instagram)

రొమ్ము క్యాన్సర్‌.. లక్షణాలేవీ బయటపడకుండా చాప కింద నీరులా విస్తరిస్తుందీ మహమ్మారి. జీవనశైలి, వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది మహిళలకు శాపంగా మారుతోంది. ఇటీవలే తానూ ఈ వ్యాధి బారిన పడ్డానంటూ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌. ఈ వార్త అటు సెలబ్రిటీల్ని, ఇటు అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది. ప్రస్తుతం తనకు చికిత్స మొదలైందని.. తనకెదురైన ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు చెబుతోందీ బ్యూటీ. ఇంత కష్ట సమయంలోనూ హీనా ఇలా పాజిటివిటీతో ముందుకెళ్లడం స్ఫూర్తిదాయకం అంటున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మల్టీ ట్యాలెంటెడ్!

‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’ అనే హిందీ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది హీనా. ఆపై పలు ధారావాహికల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘బిగ్‌ బాస్‌ - 11’ రన్నరప్‌గా నిలవడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. పలు రియాల్టీ షోలలోనూ మెరిసిన హీనా.. వెబ్‌ సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాది ‘షిండా షిండా నో పాపా’ అనే పంజాబీ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ‘కంట్రీ ఆఫ్‌ బ్లైండ్‌’ అనే మరో చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సహ-నిర్మాతగానూ వ్యవహరిస్తోంది హీనా. అంతేకాదు.. ఈ సినిమాలో అంధురాలి పాత్ర పోషిస్తోందామె.

చికిత్స మొదలైంది!

సీరియళ్లు, సినిమాలు, షోలతో తెరపై ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉండే హీనా.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, కెరీర్‌ విశేషాల్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే తాను రొమ్ము క్యాన్సర్‌ బారిన పడినట్లు తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టి ఫ్యాన్స్‌ను షాక్‌కి గురి చేసిందీ బుల్లితెర బ్యూటీ.
‘ప్రస్తుతం నేను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నా. ఇది నాకు సవాలుతో కూడిన సమయం. అయినా మానసికంగా దృఢంగా ఉన్నా. ఎలాగైనా ఈ వ్యాధి నుంచి బయటపడాలన్న పట్టుదలతో ఉన్నా. ఇప్పటికే నాకు చికిత్స మొదలైంది. ఈ వ్యాధితో పోరాడేందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధం! అయితే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే.. ఈ కష్ట సమయంలో మీ వ్యక్తిగత అనుభవాలు, సలహాలు, మద్దతును నాకు అందించండి.. తద్వారా నేను ఒంటరిని కాదన్న భావన నాకు కలుగుతుంది. ఇదే ఈ కఠిన ప్రయాణంలో నన్ను మరింత దృఢంగా ముందుకెళ్లేలా ప్రేరేపిస్తుంది. ప్రస్తుతం నేను, మా కుటుంబ సభ్యులు పాజిటివిటీతో ఉన్నాం. ఆ దేవుడి దయ వల్ల త్వరలోనే నేను ఈ మహమ్మారిని జయించి, పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకొస్తానని ఆశిస్తున్నా..’ అంటూ తన మనోభావాల్ని అక్షరీకరించింది హీనా.

ఈ పోస్టుకు సెలబ్రిటీల దగ్గర్నుంచి ఆమె ఫ్యాన్స్‌ దాకా చాలామంది స్పందిస్తున్నారు. ‘హీనా.. మీరు చాలా స్ట్రాంగ్‌ ఉమన్‌. ఈ కఠిన సమయాన్నీ అదే మానసిక దృఢత్వంతో దాటేస్తారు. గాడ్‌ బ్లెస్‌ యూ!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హీనా పోస్ట్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

హెల్దీ లైఫ్‌స్టైల్‌ పాటించినా..!

అనారోగ్యకరమైన జీవనశైలి ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. క్యాన్సర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే చక్కటి ఆహార నియమాలు, వ్యాయామ రొటీన్‌ను పాటించే సెలబ్రిటీలూ ఈ మహమ్మారి బారిన పడడం చూస్తున్నాం. హీనానే ఇందుకు తాజా ఉదాహరణ! లైఫ్‌స్టైల్‌ విషయంలో కచ్చితంగా వ్యవహరించే ఆమె.. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ హీనా పాటించే రోజువారీ ఆహార, వ్యాయామ నియమాలేంటంటే..!

⚛ పరగడుపునే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం ఆమెకు అలవాటు. ఇది తన శరీరంలోని మలినాల్ని బయటికి పంపించి ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండేలా చేస్తున్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది హీనా.

⚛ నచ్చిన ఆహారమైనా సరే.. మితంగా తీసుకుంటానంటుందీ బుల్లితెర క్వీన్. ఇదే తన జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతుంది.

⚛ పెరుగు లేనిదే హీనా భోజనం పూర్తి కాదట! దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని మరో సందర్భంలో తన హెల్దీ సీక్రెట్‌ను బయటపెట్టిందీ బ్యూటీ.

⚛ రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లు తాగడం, తాజా పండ్ల రసాలు తీసుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటట!

⚛ వారానికి ఆరు రోజులు అధిక తీవ్రత ఉన్న వ్యాయామాలు చేస్తుందట ఈ బాలీవుడ్‌ బ్యూటీ. అందులోనూ కిక్ బాక్సింగ్‌ తప్పకుండా సాధన చేస్తానంటుంది. అంతేకాదు.. యోగా, కార్డియో వ్యాయామాలకూ ప్రాధాన్యమిస్తుందట ఈ ముద్దుగుమ్మ.

నిజానికి ఇలాంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ పాటించినప్పటికీ ఎప్పటికప్పుడు క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం కూడా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫలితంగా లక్షణాలు బయటపడకపోయినా.. తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం సులభమవుతుందంటున్నారు.


అనుకోని అవకాశం!

⚛ హీనా ఖాన్‌ కశ్మీరీ అమ్మాయి. శ్రీనగర్‌లో పుట్టిపెరిగిన ఆమె పైచదువుల కోసం దిల్లీ వెళ్లింది. అక్కడి ‘సీసీఏ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎంబీఏ పూర్తిచేసింది.

⚛ తొలుత జర్నలిస్ట్‌ కావాలనుకుందట హీనా. ‘సినిమా రంగంలోకి రావాలని కానీ, వస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదం’టూ ఓ సందర్భంలో పంచుకున్న ఆమె.. ఆపై ఎయిర్‌హోస్టెస్‌గా స్థిరపడాలని ట్రైనింగ్‌ కోసం ముంబయి వెళ్లింది. ఆ సమయంలో మలేరియా జ్వరం రావడంతో ఆ అవకాశం కూడా చేజారింది.

⚛ అయితే కాలేజీలో ఉన్నప్పుడే ఓసారి తన స్నేహితులతో కలిసి ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’ సీరియల్‌ ఆడిషన్స్‌ జరిగే చోటికి వెళ్లిందట హీనా. అప్పుడు తన స్నేహితుల ప్రోత్సాహంతో ఏదో సరదాగా ఆడిషన్స్‌లో పాల్గొందట! అయినా ఈ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ పోషించే అవకాశం రావడంతో తన కెరీర్‌ గమ్యమే మారిపోయిందని ఓ సందర్భంలో పంచుకుందీ బుల్లితెర క్వీన్.

⚛ మొఘలాయి రుచుల్ని ఎక్కువగా ఇష్టపడే ఈ చక్కనమ్మకు.. వెన్నతో కాల్చిన బ్రెడ్‌ అంటే మక్కువట!

⚛ తనకూ కొన్ని నమ్మకాలున్నాయని చెప్పే ఆమె.. ఎప్పుడు, ఎక్కడికెళ్లినా తన బ్యాగ్‌లో ఓ తాయత్తు ఉంచుకుంటుందట!

⚛ చాలామంది క్రికెట్‌ను ఇష్టపడితే.. హీనాకు మాత్రం బాస్కెట్‌బాల్‌ చూడడమన్నా, ఆడడమన్నా మక్కువట!

⚛ కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. 2019 నుంచి 2022 వరకు వరుసగా ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న హీనా.. తనదైన ఫ్యాషనబుల్‌ లుక్స్‌లో ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది.

⚛ ఈస్టర్న్ ఐ పత్రిక ప్రకటించిన ‘టాప్-50 సెక్సియెస్ట్ ఏషియన్ విమెన్’ జాబితాలో వరుసగా రెండుసార్లు స్థానం పొందింది హీనా. అంతేకాదు.. 2014లో ‘ఉత్తమ నటి’గా ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ను కూడా అందుకుందీ బాలీవుడ్‌ బేబ్.

గెట్‌ వెల్‌ సూన్‌ హీనా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్